Tuesday Motivation : మీరు ఏ స్థితిలో ఉన్నా.. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి.. ఎందుకంటే..-tuesday motivation on be proud of who you are ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Tuesday Motivation On Be Proud Of Who You Are.

Tuesday Motivation : మీరు ఏ స్థితిలో ఉన్నా.. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి.. ఎందుకంటే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 10, 2023 06:34 AM IST

Tuesday Motivation : జీవితంలో ఇతరులను, పెద్దలను గౌరవించడం ఎంత ముఖ్యమో.. మనల్ని మనం గౌరవించుకోవడం కూడా అంతే ముఖ్యం. మీరు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా.. దానికి కారణం మీరే అయి ఉండాలి. మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి. మిమ్మల్ని ఇతరులు గౌరవించాలి అంటే.. ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకోండి.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Tuesday Motivation : ప్రేమ అయినా.. గౌరవం అయినా.. మీకు ఇతరులు ఇవ్వాలంటే.. ముందు మిమ్మల్ని ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం చేయాలి. ఈ రెండు మీరు చేయనప్పుడు.. రెండో వ్యక్తి మిమ్మల్ని గౌరవించాలి అనుకోవడం మూర్ఖత్వమే. మీరు ఈ రోజు ఏ స్థితిలో ఉన్నా.. ఉన్నతంగా అయినా.. నీచ స్థితిలో ఉన్న మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి. మీరు ఏ పని చేసినా.. అది మీకు మంచి అనిపించే చేసి ఉంటారు కదా. అది మీకు ఎప్పుడూ ఉత్తమ ఫలితాలు మాత్రమే ఇవ్వదు. కొన్నిసార్లు మెరుగైన ఫలితాలకు బదులుగా.. మెరుగైన ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది.

మంచి ఫలితాలు వస్తే.. మీరు కొన్ని విషయాల్లో స్ట్రాంగ్ అవుతారు. అదే ఎక్స్​పీరియన్స్ వస్తే.. కొన్ని మెంటల్​గా స్ట్రాంగ్ అవుతారు. కొన్నిసార్లు మీరున్న మెరుగైన స్థితికన్నా తక్కువ స్థానంలోకి వెళ్లిపోతారు. అలా వెళ్లినంత మాత్రానా మీది తప్పు అని కాదు. మీరు చేసిన ఓ మిషన్ సక్సెస్​ కాలేదు అంతే. కనీసం మీరు ఆ విషయాన్ని ప్రయత్నించినందుకు మిమ్మల్ని చూసి మీరు గర్వపడండి. అంతే కానీ మీరు తక్కువైనట్లు ఫీల్ అవ్వకండి.

అవును నిజమే గర్వం అనేది మెదడుకెక్కితే మంచిది కాదు. కానీ మీకు మీరు ఇచ్చుకునే గౌరవాన్ని గర్వం అని ఇతరులు భావిస్తే అది కచ్చితంగా వారి తప్పు. సెల్ఫ్ లవ్ ఎప్పటికీ మిమ్మల్ని దిగజారనీయదు. ఇతరులు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని పక్కన పెట్టి.. మనసుకు నచ్చినట్లు ఉండండి.. బతకండి. ఎందుకంటే నువ్వెంత మంచి పనులు చేసినా.. ఏదొక చిన్న మిస్టెక్ చాలు మిమ్మల్ని సమాజం నుంచి దూరం చేయడానికి. మీ ముందు మంచిగా మాట్లాడి.. నువ్వులేనప్పుడు తప్పుగా మాట్లాడే వారికోసం నీ ఆలోచన మార్చుకోనవసరం లేదు. నిన్ను ప్రేమించుకుంటూ.. గౌరవించుకుంటూ.. ఇతరులకు ఇబ్బంది కలిగించనంతవరకు నువ్వు చేసేది కరెక్ట్​ అని గుర్తు పెట్టుకోవాలి.

లైఫ్​లో సక్సెస్ అయితే ఎంత గర్వంగా ఫీల్ అవుతామో.. ఫెయిల్ అయినా గర్వంగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే మీరు ప్రయత్నించారు. కనీసం ప్రయత్నించకుండా.. కొత్తగా ఎలాంటివి చేయకపోవడం కన్నా ప్రయత్నించడమే మంచిది. మీరు ఇలాంటి మిషన్​లో సక్సెస్ అయితే మీ చుట్టూ నలుగురు ఉంటారు. ఫెయిల్ అయితే మీ చుట్టూ మీరే ఉంటారు. అదే మీకు ఇంకా ప్రశాంతతను ఇస్తుంది. ఆ పనిని ఇంకోరకంగా ఎలా చేసి ఉంటే బాగుండేదో మీకు నేర్పిస్తుంది. మీ ప్రయత్నాల వల్ల ఏదైనా తప్పు జరిగితే మిమ్మల్ని మీరు నిందించుకోకండి. మీలా అందరూ బాధపడుతూ ఉంటే.. ప్రపంచం ఈరోజు ఇంతగా అప్​డేట్ అయ్యేదా? అందరూ తప్పులు చేసే వాళ్లే. కానీ చేసే తప్పులు మళ్లీ చేయకుండా.. వాటిని సరిదిద్దుకుంటూ.. కొత్త ప్రయత్నాలు చేసే వాళ్లే నిజమైన అచీవర్స్.

మీరు గుర్తించుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆత్మవిశ్వాసాన్ని.. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఎప్పుడూ లింక్ చేయకండి. ఎందుకంటే ఈ రెండూ వేర్వేరు విషయాలు. ఆత్మవిశ్వాసంలో మీలో కొత్త శక్తిని ఇస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ మీ పని తీరును క్షీణించేలా చేస్తుంది. మీరు మీ విజయాల, మీ నిర్ణయాల గురించి గర్వపడండి. మీ ఎదుగుదలకు అవసరమైనంత గర్వం మీ దగ్గరుంటే చాలు అని గుర్తుపెట్టుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం