Tuesday Motivation : గెలవకపోవడం ఓటమి కాదు.. మళ్లీ ప్రయత్నించకపోవడమే ఓటమి
Tuesday Motivation : ఏదైనా విషయంలో ఓడిపోవడం అంటే ఓటమి అని అస్సలు అనుకోవద్దు. మళ్లీ ప్రయత్నించకపోవడమే అసలైన ఓటమి.

జీవితాన్ని గెలుపు ఓటములుతో చూస్తారు. కానీ ఇక్కడ గెలిచిన వాడి మాటలకే విలువ ఎక్కువ. ఓడిన వాటి అనుభవాలను మాత్రం ఎవరూ పట్టించుకోరు. కానీ గెలిచిన వ్యక్తి చెప్పే మాటలకంటే.. ఓడిన వ్యక్తి చెప్పే మాటలు చాలా స్ఫూర్తినిస్తాయి. ఎందుకంటే ఓడిన వ్యక్తికి ఓటమి బాధ తెలుసు. గెలిచిన వ్యక్తి తన గురించి మాత్రమే చెబుతాడు. వెళ్లే దారి గురించి అస్సలు చెప్పడు. అదే ఓడిన వ్యక్తి వెళ్లేదారిలో ఉండే ముళ్ల గురించి కూడా వివరిస్తాడు.
నిజానికి జీవితంలో గెలవడం కంటే ఓడిపోవడమే ముఖ్యం. గెలిస్తే మీరు ఎవరో ప్రపంచానికి తెలుస్తుంది.. కానీ ఒక్కసారి ఓడిపోతే ప్రపంచమంటే ఏంటో మీకు తెలుస్తుంది. మీ వాళ్లు ఎవరు, పరాయి వాళ్లు ఎవరో అర్థమవుతుంది. మీ చుట్టు ఉండే వాళ్ల మాటలు అర్థమవుతాయి. అందుకే ఎప్పుడూ గెలుపు కోసం మాత్రమే ప్రయత్నించకూడదు. ఓటమి రుచి కూడా చూడాలి.
అయితే చాలా మంది చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే.. ఒక్కసారి ఓడిపోతే ఇక జీవితమే అయిపోయిందని బాధపడుతుంటారు. కానీ గెలిస్తే మీరు నేర్చుకునేదానికంటే.. ఓడిపోయినాక నేర్చుకునేది చాలా బలంగా ఉంటుంది. నేర్చుకోవాలనే తపనను పెంచుతుంది. ఇతర విషయాల్లోనూ ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పిస్తుంది. అందుకే గెలవకపోవడం ఓటమి కాదు.. మళ్లీ ప్రయత్నించకపోవడమే ఓటమి.
మీ చుట్టు ఉన్నవాళ్లను సంతోషపెట్టేందుకు మీరు గెలవాలని అనుకోవద్దు. మీ కోసం మీరు పోరాడాలి. అప్పుడే ముందుకు వెళ్తారు. ఒక్కసారి గెలిచేందుకు వందసార్లు ఓడిపోయినా పర్లేదు. కానీ ఒక్కసారి ఓడిపోయామని ప్రయత్నించడం మాత్రం ఆపకూడదు. గెలుపు రుచి కంటే ఓటమి ఇచ్చే అనుభవాలు చాలా గొప్పవి. ఏ పుస్తకంలోనూ మీకు దొరకవు. స్వతహాగా మీరే నేర్చుకోవాలి అంతే.
గెలిచాక మీకోసం చప్పట్లు కొట్టే చేతులకంటే..మీరు ఓటమిలో ఉన్నప్పుడు చేయి అందించేవారిని గుర్తుపెట్టుకోవాలి. వారే మీకు జీవితాంతం తోడుంటారు. ఓటమిని మెట్లుగా చేసుకుంటూ పైగి ఎదిగినప్పుడే మీ గెలుపునకు అర్థం ఉంటుంది. మీరు నేరుగా చివరి మెట్టు ఎక్కి.. గెలిస్తే.. అందులో మీకు కూడా సంతృప్తి ఉండదు. జీవితంలో గెలవాలంటే కచ్చితంగా మనసుతో ఓ యుద్ధం జరగాలి. నీతో నీకు యుద్ధం జరిగినప్పుడే అసలైన నువ్వు బయటకు వస్తావ్. గెలుపు తేలికగా ఉండే.. ఏదో ఒకరోజు జీవిత ఓడిపోక తప్పదు. అందుకే గెలుపు కోసం ప్రయత్నించు.. కానీ ఓడిపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నించు.
ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో.. దానివలన లభించే ప్రతిఫలం కూడా అంత తియ్యగా ఉంటుంది.. అలాగే ఓటమి ఎంత బాధనిచ్చినా.. తర్వాత వచ్చే గెలుపు కిక్కునిస్తుంది.
గెలుపు ఎన్నో ఓటములను మరిచేలా చేస్తుంది.. ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది.. ప్రయత్నించి చూస్తే సాధ్యంకానిదంటూ ఏదీ లేదు..
లక్ష్య సాధనలో గెలవకపోవడం ఓటమి కాదు.. మళ్లీ మళ్లీ ప్రయత్నించకపోవడం ఓటమి..
గెలిచినప్పుడు సంబరాలు చేసుకోవడం ఓకే.. కానీ ఓడిపోయినప్పుడు దాన్ని జీర్ణించుకోవడం అవసరమే.
గెలుపు ఓటమి రెండు కళ్లలాంటివి.. ఏ ఒక్కటి లేకున్నా జీవితం అందంగా కనిపించదు..