Tuesday Motivation : ఎన్నికల ఫలితాల తర్వాత.. మీరు ఏ గట్టున ఉన్నా.. ఎవరూ పెద్దగా పట్టించుకోరు
Tuesday Motivation In Telugu : ఎన్నికల ఫలితాల కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తుంది. ఈసారి గొడవలు కూడా ఎక్కువే అయ్యాయి. పోలింగ్ సమయంలో ఏపీలో జరిగిన ఘటనలు అనేకం. కానీ తెల్లారితే కలిసే పని చేసుకోవాలని చాలా మంది మరిచిపోతున్నారు.
ఓట్ల పండుగ అయిపోయింది.. ఇక మీ ముఖం చూసే నాయకుడు ఉండడు. ఒకవేళ మీ బాగోగులు చూసే నాయకుడు మీకు దొరికితే మీ అంత అదృష్టమైన ఓటరు ఇంకొకరు ఉండరు. గతంలో కంటే ఎక్కువే ఈసారి పార్టీల కోసం గొడవలు అయ్యాయి. ఎంతో మంది మీద కేసులు, తలలు పగలగొట్టుకోవడం.. ఇలా చెప్పుకుంటే పోతే.. ఎన్నికలు చాలా చోట్ల రక్తాన్ని చూశాయి.
కానీ అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎన్నికలు అయ్యాక మిమ్మల్ని పట్టించుకునే పార్టీ ఉండదు. ఎన్నికల వేళ అవసరం కోసం మాత్రమే వస్తుంటాయి పార్టీలు. మళ్లీ ఐదేళ్ల తర్వాతే మీరు ఎవరో వారికి గుర్తుకువస్తారు. ఓటరన్నా.. అంటూ సలాం చేసేందుకు వస్తారు. కానీ ఎన్నికల కోసం గొడవపడి సొంత ఊర్లో మాటలకు దూరమైన వారు ఎందరో ఉన్నారు. అలాంటివారు కచ్చితంగా ఒక్కసారి ఆలోచించాలి.
ఊరు అంటే ఓ కుటుంబం. కానీ ఎన్నికలు వచ్చాక.. ఈ ఉమ్మడి కుటుంబం కాస్త వేర్వేరు అవుతుంది. అంతకుముందు ఉన్న పలకరింపులు, ఆప్యాయతలు కనిపించవు. కేవలం పార్టీలు అనే మాయలో పడి.. చాలా మంది బంధాలను దూరం చేసుకుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి. కానీ మీ ఊర్లో ఉన్న వ్యక్తిని మీరు ప్రతి రోజూ చూస్తూ ఉండాలి. మీ జీవితంలో భాగమైనవారికి కేవలం ఎన్నికలు అనే విషయంతో దూరం అవ్వడం కరెక్ట్ కాదు.
ఎన్నికల ఫలితాల కోసం ఊరోడితో కయ్యానికి కాలు దువ్వడం అంటే.. మీకు మీరు దూరం అవ్వడమే. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ ఊరోడు మాత్రం అక్కడే ఉంటాడు. మీకు కష్టం వస్తే ముందుగా వచ్చేది వాడే. మీ ఇంట్లో ఎవరైనా పోతే.. నీ కన్నీరు తుడిచేది ఊరోడే. ఏ పార్టీ నిన్ను పెద్దగా పట్టించుకోదు. ఎన్నికలు అయ్యాక వారి బిజీలో వారు ఉంటారు. కలిసినప్పుడు మాట్లాడుకోవాల్సింది ఊర్లో ఉన్న మీరిద్దరే.
ఎన్నికల విషయంలో మీరు మీరు గొడవపడితే దాన్ని కూడా రాజకీయం చేసి పార్టీలే లబ్ధి పొందుతాయి. అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా గొడవలు లేని గ్రామాల కోసం కష్టపడాలి. మీ ఊరికి కావాల్సిన పనులు కోసం నిలదీసి అడగాలి.
రాజకీయం నేడు వ్యాపారం కాదా..
గెలవాలి ఎలగైనా ఆరు నూరైనా..
ఖర్చులకు వెనకాడరు అప్పు చేసైనా..
5 ఏళ్ల అధికారం కోసం కోట్లు కుమ్మరిస్తారు..
దోపిడికి రాజమార్గం ఇదని మీకు ఎప్పుడు అర్థం కావాలి?
పెట్టుబడి పెట్టి.. లాభాలు ఆశించేంది.. పెట్టుబడిదారి వ్యవస్థ అయితే..
పెట్టుబడితో పదవులు సాధిస్తే ఏమనాలి..?
ప్రజా సంక్షేమం.. అభివృద్ధి వినేందుకు చాలా బాగుంటాయి..
కానీ ఆచరణలో సాధ్యం చేస్తారు అనుకోవడం మాత్రం అవివేకమే.
ఓటు హక్కును తాకట్టు పెట్టిన ప్రతి ఒక్కరూ.. మాట్లాడే హక్కును కోల్పోతారు..ఎదురించే హక్కును కోల్పోతారు..
రాజకీయ నాయకుల రాజకీయంలో ముడిసరుకులు కాకండి..
మీ చుట్టు ఉన్నవారితో గొడవలకు దిగకండి..
ఫలితాలు వస్తాయి.. పోతాయి.. ఒకే ఊరిలో కలిసి మెలిసి ఉండాల్సింది మీరు..