tuesday motivation: ఒకర్ని చూసి మారుతూ పోతే.. నీ ఉనికి ఎక్కడుంటుంది
tuesday motivation: ప్రతి మనిషికి ప్రత్యేక గుణాలుంటాయి. వాటిని తెలుసుకోకుండా పక్కవాళ్లని చూస్తూ అసూయపడి వాళ్లలాగా మారిపోతే మనమూ విజయాలు సాదిస్తామేమో అనుకుంటారు. అలా మారుతూ పోతే నీ ఉనికి అనేదే ఉండదు.
ఏనుగు ఈత కొట్టలేదు, చేప గాల్లోకి ఎగరలేదు. అలాని ఏనుగు బలం తగ్గినట్టా? చేపకు అసమర్థత ఉన్నట్లా? కాదు కదా. దేని బలం దానికే. దేని ప్రత్యేకత దాందే. రారాజు సింహం కూడా నీళ్లలో దిగి చేపలాగా ఈదలేదు. అలాని సింహం బలహీనమైనది కాదు. ఈ భూమ్మీద బతికే బ్రతి జీవరాశికి దాని ప్రత్యేకత ఉంటుంది. అలాగే ప్రతి మనిషికి కూడా ఇతరులతో పోల్చుకోలేని ప్రత్యేక గుణాలుంటాయి.
నీకొచ్చిన పని మరొకరికి రాకపోవచ్చు. వాళ్లకున్న అందం నీకు లేకపోవచ్చు. నీలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ ముందుకు కదులు . అంతేగానీ పక్కవాళ్లతో పోల్చుకుంటూ నువ్వు కానిదీ, నువ్వు చేయలేని అలవాట్లు తెచ్చుకోకు. కొందరు బొమ్మలు బాగా వేయగలిగితే కొందరు లెక్కలు బాగా చేయగలుగుతారు. కొందరు బాగా వినగలిగితే కొందరు బాగా మాట్లాడగలుగుతారు. నీకున్న ప్రత్యేకతను, సృజనాత్మకను మరింత పదునుగా మరల్చుకో. అంతేగానీ పక్కవాళ్లకున్న ప్రత్యేకతల్ని చూసి బాధపడటమూ, మనకంత ట్యాలెంట్ లేదే అని కుళ్లుకోవడం మంచి పని కాదు. మీ మనసే పాడవుతుంది. ప్రశాంతంగా ఉండలేరు. ఏమీ సాధించలేరు.
ఒక కాకి ఎప్పుడూ హంసలను చూసి కుళ్ళు కునేది. వాటికున్న తెల్లటి రూపాన్ని, అందాన్ని చూసి బాధ పడేది. నేనేమో నల్లగా, హీనంగా ఉన్నానని బాధపడేది.
ఒకరోజు కాకి తను కూడా నీళ్లలో ఉంటూ హంసలు తినేదే తింటే తెల్లగా మారిపోతాననుకుంది.
ఏవేవో ప్రయత్నాలు చేసి గాల్లోకి ఎగరడం మానేసింది. నీళ్లలో ఈతకొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. కాకి లక్షణం ప్రకారం కాకికి ఈత అవసరం లేదు కాబట్టి. ఎంత ప్రయత్నించినా ఈత కొట్టలేకపోయింది.
అలవాటు లేని కలుపు మొక్కలు, ఆహారం తిని అవి నప్పక చిక్కి బక్కశల్యమైంది. అందంగా కాదు కదా.. ఉన్న శక్తి కూడా క్షీణించింది.
ఇక లాభం లేదని తనలాగే ఉండటం మొదలెట్టింది. హాయిగా గాల్లోకి ఎగురుతూ కింద ఉన్న ప్రకృతి అందాలను చూస్తూ ఆస్వాదించసాగింది. తనకిష్టమైనవి తింది. తన జీవితంలోనే ఎంతో గొప్పతనం ఉందని గ్రహించి హంసలను చూసి అసూయ పడటం మానేసింది.
మన గొప్పతనం మనం మాత్రమే తెలుసుకోగలం.
మీలో ఉన్న ఉత్తమ గుణాలకు పదును పెట్టండి.
వాటినే మీ శక్తిగా మార్చుకోండి.
గొప్ప విజేతగా మారిపోండి.