Tuesday Motivation : తెలివి మాత్రమే ఉంటే సరిపోదు.. దానికి కష్టం తోడు కావాలి-tuesday motivation intelligence may be fails but hard work never fails ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Motivation : తెలివి మాత్రమే ఉంటే సరిపోదు.. దానికి కష్టం తోడు కావాలి

Tuesday Motivation : తెలివి మాత్రమే ఉంటే సరిపోదు.. దానికి కష్టం తోడు కావాలి

Anand Sai HT Telugu

Tuesday Motivation Telugu : కొందరికి చాలా తెలివి ఉంటుంది. కానీ జీవితంలో సక్సెస్ కాలేరు. కారణం వారికి కష్టపడటం తెలియదు. తెలివి ఉంటే మాత్రమే జీవితంలో విజయం సాధించలేరు అనేది మెుదటి సూత్రం.

గెలుపు సూత్రాలు

మన చుట్టు పక్కల చాలా తెలివైనవారు కనిపిస్తూ ఉంటారు. కానీ జీవితంలో విజయం సాధించి ఉండరు. కాకపోతే.. జీవితం గురించి గొప్ప గొప్పగా మాటలు చెబుతారు. మరీ నువ్ ఎందుకు ఇలానే ఉన్నావ్ అని అడిగితే.. ఆలోచన చేశా కానీ ఆచరణలో పెట్టలేకపోయానని చెబుతారు. అంటే వారు కష్టపడకపోవటమే వారి జీవితంలో వెనకే ఉండిపోవడానికి అసలు కారణం. తెలివి ఉన్నంత మాత్రన విజయం రాదు. దానికి కష్టం కూడా తోడుగా ఉండాలి.

మన అందరికీ తెలిసిన విరాట్ కోహ్లీ గురించి ఓ విషయం చెప్పుకుందాం. 2006లో విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. అదే సమయంలో అతడి నాన్న చనిపోయారు. ఈ విషయం కోహ్లీకి తెలిసింది. ఓ వైపు నాన్న అనే ఎమోషన్, మరోవైపు నాన్న చూపించిన దారి. ఈ సమయంలో కోచ్ కోహ్లీతో మాట్లాడాడు. ఇంటికి వెళ్తావా.. ఆడగలవా అని.. బాధను దిగ మింగుకుని ఆట మెుదలుపెట్టాడు కోహ్లీ.

ఆ రోజు తన టీమ్ ను గెలిపించాడు కోహ్లీ. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఎవరైనా నిలవలేరు. బాధతో ఇంటికి వెళ్తారు. నాన్న అంటే ఎంతో ఇష్టం ఉన్నా.. రంజీలో ఆడాలని నాన్న కల కోసం ఉండిపోయాడు కోహ్లీ. ఆ సమయంలో కోహ్లీ పడిన కష్టమే ఈ రోజు కింగ్ కోహ్లీని చేసింది. ఆ రోజున ఒక్క అడుగు వెనక్కు వేసి ఉంటే.. కోహ్లీ జీవితంలో ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు. ఆ ఒక్క మ్యాచ్ జీవితాన్ని మార్చేసింది.

కేవలం కల ఉంటే సరిపోదు. కలకు తగ్గట్టుగా ప్రయాణం ఉండాలి. అప్పుడే జీవితంలో ముందుకు సాగిపోతాం. లేదంటే నలుగురిలో నారాయణ అన్నట్టుగా ఆగిపోతాం. నిజానికి కోహ్లీ ఆ రోజున తీసుకున్నది తెలివైన నిర్ణయం. నాన్న అంటే ఎంతో ఇష్టం ఉన్నా.. గ్రౌండ్‌లో కష్టపడేందుకు బ్యాట్ పట్టుకుని దిగాడు. అదే కోహ్లీని ప్రపంచంలో సూపర్ బ్యాట్స్ మెన్‌గా చేసింది.

చాలా మంది జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మరికొందరికి వేరే పరిస్థితులు రావొచ్చు. తెలివితో విజయం సాధించలేం. దానితోపాటుగా కష్టం కూడా ఉండాలి. అప్పుడే విజయం నీ ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ వస్తుంది.

కష్టాలు కలకలం ఉండవు. చీకటి వెనక వెలుతురు ఉన్నట్టే.. కష్టం వెనక సుఖం ఉంటుంది. మంచి రోజుల కోసం పోరాడాలి. తెలివి ఉంది కదా బతికేస్తాం అనుకుంటే బతికి ఉంటావ్ అంతే.. నువ్ పెట్టుకున్న కల దరిదాపుల్లోకి కూడా వెళ్లలేవు.

గొంగళి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధ పడేలోపే.. అందమైన సీతాకోక చిలుకలా మారి స్వేచ్ఛగా ఎగురుతుంది. మనిషి జీవితం కూడా అంతే.. కష్టాలను దాటితేనే అందమైన జీవితం ఆహ్వానం పలుకుతుంది.. కొత్త జీవితం మెుదలవుతుంది.