Tuesday Motivation: ఇతరులను చూసి అసూయ పడకండి, మీ బలాలేంటో మీరే గుర్తించండి
Tuesday Motivation: చాలామంది ఎదుటివారిని చూసి అసూయ పడుతూ ఉంటారు. వారి బలాలను గుర్తించరు. దేవుడు ప్రతి ఒక్కరికీ బలాలు, బలహీనతలు ఇస్తారు.

Tuesday Motivation: ఒక పెద్ద అడవిలో ఒక కాకి నివసిస్తోంది. దానికి తన జీవితం అంటే నచ్చేది కాదు. నల్లటి రంగు, చెవులు చిల్లులు పడేలా అరుపులు, ఎంగిలి మెతుకులు తిని బతకడం... ఇవన్నీ దానికి యావగింపుగా అనిపించాయి. ఎప్పుడు కావ్ కావ్ అంటూ అరవడం, అందరూ మిగిల్చినవి తినడం... ఇదేనా నా జీవితం అంటూ ఆలోచించ సాగింది. ఇంతలో దానికి ఒక తీయని గొంతు వినపడింది. కూ... అనే ఆ గొంతు దానికి చాలా నచ్చింది. ఆ గొంతు వినిపించే వైపుగా వెళ్ళింది. దానికి మామిడి చెట్టుపై కూర్చుని మామిడి చిగుళ్ళు తింటున్న కోయిల కనిపించింది. ఆ కోయిలతో ‘మీ గొంతు ఎంత బాగుందో, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నాలాగా ఎంగిలి మెతుకులు తినాల్సిన అవసరం లేదు. మామిడి చిగుళ్ళు తింటూ జీవిస్తావు. నీ గొంతుకు ఎంతోమంది అభిమానులు’ అంటూ పొగడడం మొదలుపెట్టింది.
దానికి కోకిల ‘చాల్లే... నాది ఒక బతుకేనా? నా రంగు నీ కన్నా నలుపు. పైగా వసంత రుతువులో తప్ప మిగతా సమయాల్లో నోరు విప్పలేను. చివరికి నా పిల్లల్ని కూడా నేను పెంచలేను. నీ గూటిలోనే వదిలేస్తాను. మా జాతి బతుకుతోంది అంటే అంతా నీ చలవే. నాతో పోలిస్తే ఆ చిలకమ్మ జీవితమే గొప్పగా ఉంటుంది’ అంది.
కోకిల మాటలు విని కాకి చిలకను చూసేందుకు వెళ్ళింది. జామ చెట్టు మీద కూర్చుని జామ పండు తింటూ కనిపించింది పచ్చని చిలుకమ్మ. కాకి ఆ చిలుకతో... ‘చిలుకమ్మ నువ్వు ఎంత అందంగా ఉన్నావు. నీ రంగు ఎంత చక్కగా ఉందో, నీ అందం ముందు ఏదైనా దిగదుడుపే. నేను నీ అంత అదృష్టవంతురాలని కాదు’ అంటూ పొగిడింది. దానికి చిలకా ‘చాల్లే ఊరుకో. నాది ఒక బతుకేనా? ఏ వేటగాడుకో దొరికానంటే పట్టుకుపోయి సంతలో అమ్మేస్తాడు. పంజరంలో బంధిస్తాడు. నా రంగే నాకు శాపం. నా కన్నా నెమలి జీవితమే బాగుంటుంది. అది చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. నచ్చిన చోటల్లా తిరుగుతుంది’ అని చెప్పింది.
నెమలిని చూసేందుకు కాకి ఎగురుకుంటూ పోయింది. సరిగ్గా అదే సమయానికి చినుకులు పడడంతో నెమలి నాట్యమాడుతూ కనిపించింది. ఆ నెమలి రంగును, నాట్యాన్ని, నెమలి ఈకలను చూసి కాకి కుళ్ళుతో, అసూయతో రగిలిపోయింది.
నెమలి దగ్గరికి వెళ్లి ‘ఆహా జీవితమంటే నీది కదా... పక్షి జాతిలో నీ అంత అందాన్ని నేను చూడలేదు. నీ నాట్యం, నీ అందం మామూలుగా లేవు. నా బతుకు నీ ముందు ఎందుకు పనికిరాదు. బతికితే నీలా బతకాలి’ అంటూ మాట్లాడసాగింది.
దానికి నెమలి ‘ఆపమ్మా ఓ కాకమ్మా... నాది ఒక బతుకా? నేను నాట్యం చేయాలంటే వర్షం పడాలి. ఇక నా ఈకలు నా ప్రాణానికే ముప్పు తెచ్చిపడుతున్నాయి. వీటి కోసం ఎంతో మంది నన్ను వేటాడుతున్నారు. ఇక నా శరీరాన్ని వండుకు తినేందుకు ఎంతమంది ఎదురుచూస్తున్నారో. మీకు ఇలాంటి సమస్యలు ఏవీ లేవు. నిన్ను ఎవరూ పట్టుకోవడానికి ప్రయత్నించరు. నువ్వు స్వేచ్ఛగా తిరగవచ్చు. నచ్చింది తినవచ్చు. నీలా బతికే అవకాశం మాకు లేదు. దినదిన గండంగా రోజూ బతకాల్సిందే’ అంటూ కళ్ళనీరు పెట్టుకుంది.
అప్పుడు కాకికి తన జీవితం ఏంటో అర్థం కాలేదు. పక్షుల్లో ఏ పక్షి కూడా తనంత స్వేచ్ఛగా జీవించడం లేదని అర్థం చేసుకుంది. తన రంగు, తన రూపు, తన గొంతే... ఎవరినీ తనకు హాని తలపెట్టకుండా కాపాడుతున్నట్టు అర్థం అయింది. తన జీవితమే బాగుందని మిగతా పక్షులన్నీ దినదిన గండంగా జీవిస్తున్నాయని భావించి సంతృప్తిగా ఎగిరిపోయింది. ఇంకెప్పుడూ తన గురించి తాను చులకనగా మాట్లాడుకోలేదు.
ఇది కేవలం కాకికే కాదు, మన మనుషులకూ వర్తిస్తుంది. అంబానీని చూసో, అదానీనో చూసో కుళ్లిపోయే బదులు... దేవుడు మనకు ఇచ్చిన జీవితంలోనే ఆనందాన్ని వెతుక్కోవడం మంచిది. ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒక బలహీనతతో పాటు కొన్ని బలాలను అందిస్తాడు. మీ బలం ఏంటో మీరు తెలుసుకోండి. మీ జీవితంలో ఉన్న ప్లస్ పాయింట్లను ప్రతిసారి తలచుకోండి. అప్పుడు మీ జీవితం కూడా మీకు అందంగా కనిపిస్తుంది.