Tuesday Motivation : మీరే ఒక సైన్యం.. పట్టుదలతో కొండను తవ్విన ఈయనే ఆదర్శం
Tuesday Motivation : జీవితంలో ఏదేదో చేయాలనుకుంటాం. కానీ ఉన్నచోటే ఉండిపోతాం. కారణం పట్టుదల కంటే.. ఆలోచనలు మాత్రమే ఎక్కువగా చేస్తాం. పట్టుదల ఉంటే పర్వతాన్నైనా పిండి చేయోచ్చు. గెలుపును మీ బానిస చేసుకోవచ్చు.
పట్టుదల ఉండాలేగానీ ఏదైనా సాధించొచ్చు. పట్టుదల ఉండాలే గానీ.. గమ్యాన్ని ఈజీగా చేరుకోవచ్చు. చాలా మందికి ఏదో ఒకటి చేయాలి జీవితంలో అని ఉంటుంది. కానీ పట్టుదల అనేది మాత్రం శూన్యం. తాత్కాలిక ఆలోచనలతో ఆనందపడిపోతారు. ఇది చేయాలి.. అది చేయాలనే ఆలోచనలతో అక్కడే ఉండిపోతారు. ఆలోచనలు చేయాలి.. కార్యరూపం దాల్చేవిధంగా ఉండాలి. గాలిలో మెడలు కాడుతూ.. ఉంటే.. ఊహల్లోనే ఉంటారు. పట్టుదల ఉంటే.. రంగంలోకి దిగుతారు. గెలుపు కోసం ప్రయత్నిస్తారు. పట్టుదల ఎలా ఉండాలో.. ఓ వ్యక్తి కథ చదివితే మీకే అర్థమవుతుంది.
ట్రెండింగ్ వార్తలు
దశరథ్ మంజీ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా.. ఏకంగా పర్వతాన్నే పిండి చేశారు. 22 ఏళ్లు కష్టపడ్డారు. తమ ఊరికి దారిని వేశాడు. ఇప్పుడు ఆ దారిని ఎన్నో గ్రామాల ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. ఓ సామాన్యుడు 22 ఏళ్లు పట్టుదలతో దారిని వేసేందుకు కొండను తవ్వడం అంటే మాటలా. ఎంత పట్టుదల, ఎంత కృషి ఉండాలి. ఇంతకీ దశరథ్ మంజీ అలా చేయాల్సిన అవసరం ఏం వచ్చింది. జీవితంలో చాలా పెద్ద దెబ్బ అతడి మనసును కలిచివేసింది. అదే పట్టుదలతో కొండను తవ్వేలా చేసింది. అతడే ఒక సైన్యంగా దారిని వేసి 'మౌంటెన్ మ్యాన్' అయ్యాడు. ఓ సారి అతడి కథలోకి వెళ్దాం..
బీహార్ లోని గెహ్లార్ గ్రామంలో దశరథ్ మంజీ జన్మించారు. బాల్యం నుంచి గనుల్లో పని చేసేవారు. ఫల్గుణి అనే మహిళను వివాహం చేసుకున్నారు. గెహ్లార్ బీహార్ రాజధాని పాట్నాకు దాదాపు 100 కి.మీ దూరాన ఉన్న ఓ చిన్న పల్లె. బయటి ప్రపంచానికీ ఆ గ్రామానికీ మధ్య ఓ కొండ అడ్డం ఉంటుంది. గెహ్లార్ వాసులు నిత్యావసరాలు కొనుగోలు చేయాలనుకున్నా, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకోవాలన్నా కొండ చుట్టూ తిరిగి వెళ్లాలి. 32 కి.మీ దూరం తిరగాలి. కొండను తొలిస్తే.. అది మూడు కిలో మీటర్ల దూరమే.
కొండకు దగ్గరలోనే దశరథ్ మంజీ.. క్వారీలో పని చేసేవారు. ఓ రోజున మధ్యాహ్నంపూట.. తన భార్య ఫల్గుణి భోజనం తీసుకుని వెళ్లింది. అప్పుడు ఆమె గర్భవతి. ఆ సమయంలో భోజనం తీసుకెళ్తూ.. కొండమీద పడిపోయింది. ఎవరో చెబితే.. దశరథ్ మంజీకి తెలిసింది. వెళ్లి చూస్తే.. భార్యకు ఒళ్లంతా రక్తం. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే... ఆమె చనిపోయింది. అప్పుడే ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు. తన దగ్గర ఉన్న గొర్రెలు అమ్మి.. సమ్మెట, ఉలి, గునపాన్ని కొన్నాడు. 300 అడుగులు ఎత్తైన కొండను తవ్వే పని మెుదలుపెట్టాడు.
ఓ వైపు మంజీ కొండను తవ్వే పని చేస్తున్నాడు. కానీ గ్రామస్తులు చూసి మాత్రం పిచ్చొడని నవ్వేవాళ్లు. ఎవరినీ పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అలా 22 ఏళ్లు పట్టుదలతో శ్రమించి.. కొండను తవ్వేశాడు దశరథ్ మంజీ. కొండ కాస్త తవ్వాక.. పది ఏళ్లకు కొంతమంది వచ్చి సాయం చేశారు. కానీ ఆ దారిలో ప్రతీ చోట దశరథ్ చెమట ఉంది. అతడి పట్టుదలతో ఓ దారి ఏర్పడింది. ఓ సామాన్యుడు పర్వతాన్ని జయించాడు. ఇప్పుడు చాలా గ్రామాల ప్రజలు ఆ దారిని ఉపయోగించుకుంటున్నారు.
పట్టుదల ఉంటే.. ఎంతటి పనినైనా చేయోచ్చు అనేందుకు ఇదో ఉదాహరణ. ఓ మనిషి ఏళ్లపాటు శ్రమించి కొండను తవ్వేశాడు అంటే.. ఎంత పట్టుదల ఉంటే అంతటి పని చేస్తాడు. చిన్న చిన్న వాటికే.. అంతా అయిపోయింది అనుకునేవారికి.. దశరథ్ మంజీ కథ ఓ పాఠం. కొన్నిసార్లు మీరు అనుకున్నది సరైన సమయంలో జరగకపోవచ్చు.. కానీ ఏదో సమయంలో జరుగుతుంది. కావాల్సింది పట్టుదలతో ముందుకు వెళ్లడం అంతే..
నిరాశ నీడలు అలుముకుంటే..
నిట్టూర్పు జాడలు వదలనంటే..
నిందల చీకట్లు కమ్ముకుంటే..
వందల ఇక్కట్లు తరుముతుంటే..
భుజాలు అండగా నిలవకుంటే..
బాధతో దిగులు పెరుగుతుంటే..
గట్టు విడిచి కంటిప్రవాహం..
ఎగసిన కెరటమై.. చెంపను తాకదా.. విశ్వాసాన్ని నింపదా..
పట్టుదలను నేర్పదా.. గమ్యానికి చేర్చదా..!