Tuesday Motivation : ఆడేమనుకుంటాడో.. ఈడేమనుకుంటాడో కాదు.. నువ్వేమనుకుంటున్నావో అది చేసేయ్..-tuesday motivation belief is biggest weapon in this world believe in yourself ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Motivation : ఆడేమనుకుంటాడో.. ఈడేమనుకుంటాడో కాదు.. నువ్వేమనుకుంటున్నావో అది చేసేయ్..

Tuesday Motivation : ఆడేమనుకుంటాడో.. ఈడేమనుకుంటాడో కాదు.. నువ్వేమనుకుంటున్నావో అది చేసేయ్..

Anand Sai HT Telugu Published Apr 30, 2024 05:00 AM IST
Anand Sai HT Telugu
Published Apr 30, 2024 05:00 AM IST

Tuesday Motivation : ప్రపంచంలో చాలా మంది ఇతరులపై ఆధారపడేవారే. అందుకే వారి విజయం కోసం మీరు పనిచేస్తూ ఉంటారు.

మంగళవారం మోటివేషన్
మంగళవారం మోటివేషన్ (Unsplash)

ఒక మనిషి జీవితంలో పైకి ఎదగాలంటే వారిపై వారికి నమ్మకం ఉండాలి. అప్పుడే విజయం సొంతమవుతుంది. కానీ నేటి సమాజంలో ఎక్కువ మంది చేసే అతిపెద్ద తప్పు.. ఇతరులను నమ్మడం. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ఎదురుచూస్తూ ఉంటారు. మనవాడే.. నాకు ఏదో ఒకటి చేస్తాడులేనని ఆశ అందరికీ. కానీ ఇది అసలైన తప్పు. ఎందుకంటే ఎవరైనా వారి ఎదుగుదలకు మిమ్మల్ని వాడుకుంటారు. మీకు పని చేసి పెట్టడం అనేది చాలా అరుదు.

అందుకే అవకాశాల కోసం ఎదురుచూడకూడదు. అవకాశాలను సృష్టించుకోవాలి. గొప్ప గొప్ప వాళ్లంతా తమ దగ్గర పని చేయించుకునే వాళ్ల మైండ్ సెట్ అలానే ట్యూన్ చేస్తారు. వారి విజయం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. ఆ విషయం అర్థమయ్యేలోపు జీవితం అయిపోతుంది. అందుకే మీపై మీకు నమ్మకం ఉండాలి. ఎవరు ఏం చేయరు మీ కోసం అని గుర్తించాలి. మీకోసం మీరు పోరాడాలి.., మీ గెలుపు కోసం మీరే నిలబడాలి.

జీవితంలో భయంతో చేసే ఏ పనైనా మంచి ఫలితం ఇవ్వదు. తెలివితో చేసే ఏ పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి. మనల్ని మనం నమ్ముకున్న ప్రతీసారి విజయం మనకే దక్కుతుంది. అదే ఇతరులను నమ్ముకుంటే నిరాశే ఎదురవుతుంది. ఇప్పుడు ఎవరికోసమో నువ్ వృథా చేసే ప్రతీ నిమిషం భవిష్యత్తులోని అదృష్టాన్ని తారుమారు చేస్తుంది.

మీరు ఉదాహరణకు ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. ఏదో సాధించాలి అనుకుంటారు. కానీ కంపెనీ మాత్రం మీరు అక్కడే పని చేసేలా మీ ఆలోచనను ఆపేస్తుంది. అందుకే కొన్నిసార్లు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. దీనికి మీపై మీకు నమ్మకం, ధైర్యం ఉండాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు ఏదైనా చేసే ముందు దాదాపుగా అందరూ నవ్వుతారు... తర్వాత వెక్కిరిస్తారు.. గెలిచాక వాళ్లే నిన్ను ఫాలో అవుతారు.

జీవితంలో సాధ్యంకాని పని అంటూ ఏది ఉండదు. నువ్ ప్రారంభించడమే అసలు పని. ఆ తర్వాత విజయం వైపు నీ అడుగులు పడతాయి. కేవలం నమ్మకం అనే పునాది మీద కష్టంతో ముందుకు వెళ్లాలి. మీ మీద మీకు అనుమానం ఉంటే జీవితంలో ఏదీ సాధించలేరు. ముందుగా మిమ్మల్ని మీరు గెలవాలి.

'నన్ను నేను నమ్ముకున్న ప్రతీసారి విజయం వరించేది.. ఒకరిపై ఆధారపడిన ప్రతీసారి నన్ను నేను నిందించుకోవాల్సి వచ్చేది.. చివరకు అర్థమైంది.. స్వశక్తిని మించిన ఆస్తి లేదు అని.'

భయపడుతూ కూర్చుంటే బతకలేవు.. తప్పో.. ఓప్పో ముందు చేసి చూడు.. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది.. ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది.

ఆడేమనుకుంటాడో..

ఈడేమనుకుంటాడో కాదు..

నువ్వేమనుకుంటున్నావో అది చేసేయ్..

నిన్ను అన్నోడెవడూ నీ కష్టం వస్తే నీకు సాయం చేయరు..

ఇష్టమో.. కష్టమో.. నష్టమో..

ఏదైనా నీకు అనుభవాన్నిస్తుంది..

జీవితంలో విజయం సాధించాలంటే ముందు నిన్ను నువ్వు నమ్ముకో.. తర్వాత ప్రకృతే నీకు సాయం చేస్తుంది. నువ్ ముందుకు వెళ్లేందుకు నీకు దారి చూపిస్తుంది.. విజయపు వెలుగులు నీకు కనిపించేలా చేస్తుంది.

Whats_app_banner