Tuesday Motivation: మిమ్మల్ని భయం ఆవహించేస్తుందా? భయాన్ని ఇలా విడిచిపెట్టండి
Tuesday Motivation: ఏది సాధించాలన్నా ధైర్యం కావాలి. ధైర్యంగా అడుగేస్తేనే ముందుకు సాగేది. కొందరిలో భయం నిలువల్లా ఆవహిస్తుంది.
Tuesday Motivation: ధైర్యం, భయం... ఈ రెండూ కూడా మన శరీరంలోని ప్రతిస్పందనలే. మనం ప్రమాదంలో ఉన్నట్లు భావిస్తే ఆ పరిస్థితికి ఆ ఆలోచనకు తగ్గట్టు శరీరం ప్రతిస్పందిస్తుంది. ఆ ప్రతిస్పందనే ‘భయం’. కొందరిలో ఈ భయం తక్కువగా ఉంటుంది. మరికొందరిలో మాత్రం విపరీత ప్రతిస్పందన కారణంగా భయం అధికంగా ఉంటుంది. పూర్తిగా మీ జీవితం నుండి భయాన్ని నిర్మూలించడం అసాధ్యం. కానీ ఆ భయాన్ని అధిగమించి మీరు చేయాలనుకుంటున్న పనులను చేసేలా మిమ్మల్ని మీరే మార్చుకోవచ్చు. భయాన్ని ఎలా అధిగమించాలో మానసిక తత్వవేత్తలు వివరిస్తున్నారు.
భయాన్ని ఒక లోపంగా చూడకండి, దాన్ని ఒక అడ్వాంటేజ్ గా భావించండి. మీరు దేన్ని చూసి భయపడుతున్నారో... దాన్ని సవాలుగా తీసుకోండి. ఒంటరిగా ఉండడం భయం అయితే ఒంటరిగా ఉండి భయాన్ని అధిగమించండి. మీకు ఏ విషయాలు ఆందోళనకరంగా అనిపిస్తాయో... ఆ విషయాలను మరింతగా తెలుసుకునేందుకు ప్రయత్నించండి. భయం దానంతట అదే తగ్గుతుంది.
మీకు ఎవరూ లేరని, మీరు ఏమీ సాధించలేరని అనిపిస్తున్నప్పుడు భయం ఆవహిస్తుంది. మీ బాధలను, ఆందోళనను పక్కన పెట్టండి. జీవితం ఎంతో ఉంది.. నేను సాధించగలను అని గట్టిగా అనుకోండి. మీరు భయానికి లొంగితే పూర్తిగా అందులోనే కూరుకుపోతారు. మీకు తెలియని పనిని సవాలుగా తీసుకోండి. ఆ పనిని గుర్తు తెచ్చుకొని పదేపదే భయపడడం మానేయండి.
భయం అనేది కొన్ని రకాల పనుల వల్ల కూడా పెరుగుతుంది. అందులో ముఖ్యమైనది వాయిదా వేయడం. తరచూ వాయిదా వేసే లక్షణం ఉన్నవారు భయం బారిన త్వరగా పడతారు. అలాగే సాకులు చెప్పి పని తప్పించుకునే వారిలో కూడా ఈ భయం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పనులు వాయిదా వేయడం, పనులు తప్పించుకోవడం వంటి అలవాట్లను మానుకోండి.
కొందరిలో తాము ఏ పని చేసినా విఫలమవుతామని భయం ఆవహిస్తుంది. మీరు ముందుగా వైఫల్యం గురించి మర్చిపోండి. ప్రయత్నంపైనే దృష్టి పెట్టండి. ప్రయత్నం చేస్తున్న కొద్దీ ఏదో రోజు విజయం అందుకుంటారు. ఆ ప్రయత్నాలలో ఎన్నో విఫలం అవ్వచ్చు. ఆ విఫలమైన సందర్భాలను అతిపెద్ద ఓటమిగా చూడకండి. కేవలం ప్రయత్నంలో ఒక భాగం అనుకోండి. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైనట్టు చెప్పుకున్నారు. కానీ 1000 ప్రయత్నాల తర్వాత అతను విజయాన్ని సాధించారు. ఆ విజయమే ఆయనను గుర్తుపెట్టుకున్నారు, కానీ ఈ 1000 సార్లు ఓటమిని మాత్రం ఆయన లెక్కలోకి తీసుకోలేదు. వాటిని ప్రయత్నాలుగానే చెప్పుకున్నారు.
ఎంతో కొంత భయం ఉండడం కూడా మనిషికి చాలా అవసరం. ఆ భయమే కొన్నిసార్లు తప్పులు చేయకుండా అడ్డుకుంటుంది. కాబట్టి పూర్తిగా భయం లేకుండా బతకాలని మాత్రం భావించకండి.