Exam Hall Behaviour : ఎగ్జామ్ హాలులో విద్యార్థులు ఇలా ప్రవర్తించకండి.. బుక్కైపోతారు!
Exam Hall Behaviour : పరీక్షలు అనగానే విద్యార్థులకు ఎక్కడా లేని టెన్షన్ వస్తుంది. దీంతో చదివింది అంతా మరిచిపోతారు. పరీక్ష హాలులో ఎలా ప్రవర్తించాలి? అంతకుముందు ఏం చేయాలి?
తెలంగాణలో పది పరీక్షలు మెుదలవుతున్నాయి. మార్చి 18 నుంచి షెడ్యూల్ ఉంది. పరీక్షలంటే ఆందోళన సర్వసాధారణం. పరీక్ష హాలుకు చేరుకునే ముందు విద్యార్థులకు కొన్ని చిట్కాలు పాటించాలి. పరీక్ష హాలులో ఎలా ప్రవర్తించాలో కూడా తెలుసుకోవాలి. పరీక్షకు ముందు రోజు అతిగా నిద్రపోకండి. వీలైనంత త్వరగా పడుకుని త్వరగా లేవండి. మీరు ఎంత బాగా నిద్రపోతే అంత రిఫ్రెష్ గా ఉంటారు. పరీక్ష రోజున వీలైనంత త్వరగా లేచి ఫ్రెష్‌గా ఉండండి.
ముందు రోజు క్రమం తప్పకుండా భోజనం చేయండి. పరీక్షకు వెళ్లే ముందు రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ తినండి. ఖాళీ కడుపుతో వెళ్లకూడదు. ఎక్కువగా తినకండి. వీలైనంత వరకు బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే బయట తినడం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. బయట ఆహారం తీసుకుంటే తాగడానికి వేడి నీటిని వాడండి. పరీక్ష పూర్తయ్యే వరకు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
పరీక్షా కేంద్రానికి అవసరమైన సామాగ్రిని ముందురోజు చక్కగా చూసుకోవాలి. హాల్ టికెట్, ID, పెన్నులు, పెన్సిల్ మొదలైన వాటిని చెక్ చేసుకోవాలి. పరీక్షా కేంద్రానికి బయలుదేరే ముందు ప్రతిదీ మళ్లీ తనిఖీ చేయండి. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం మంచిది. పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందు చేరుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా పరీక్ష రాయవచ్చు. పరీక్షకు ముందు రోజు మీరు పరీక్షా కేంద్రాన్ని సందర్శించి తనిఖీ చేయాలి. తద్వారా మీరు పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకోవచ్చు. మీకు అన్నీ తెలుసుననే అతి విశ్వాసం వద్దు. అదేవిధంగా నిర్లక్ష్యం మంచిది కాదు.
సాధారణంగా విద్యార్థులందరూ పరీక్షకు ముందు ఎక్కువ చర్చల్లో పాల్గొంటారు. అనవసరంగా మాట్లాడటం వల్ల ఏకాగ్రత కోల్పోతారు. తాము చదివిన దానికంటే చదవని వాటి గురించి ఎక్కువగా మాట్లాడి ఆందోళనను సృష్టిస్తారు. ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకండి.
పరీక్ష హాల్‌లోకి ప్రవేశించిన తర్వాత మీ హాల్ టికెట్ నంబర్‌ను తనిఖీ చేయండి. మీ సీట్లలో సౌకర్యవంతంగా కూర్చోండి. ఒక నిమిషం పాటు లోతైన శ్వాస తీసుకోండి. దీర్ఘ శ్వాస తీసుకోవడం ద్వారా మీరు ఏకాగ్రతను కాపాడుకోవచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
జవాబు పత్రాలలో తప్పులు లేకుండా రాయాలి. హాల్ టికెట్ నంబర్‌ను సరిగ్గా నమోదు చేయండి. సూపర్‌వైజర్ సంతకాన్ని పొందండి. జవాబు పత్రంపై ముద్రించిన సూచనలను తప్పకుండా చదవండి. ఒక్కసారి ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదవండి. ప్రశ్నపత్రంపై అనవసరంగా ఏమీ రాయవద్దు. ముందుగా మీకు తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ప్రశ్నల సంఖ్యను సరిగ్గా నమోదు చేసి సమాధానం ఇవ్వండి. వీలైనంత వరకు ఒకటే పెన్ను ఉపయోగించండి.
పరీక్ష రాసే సమయంలో పక్కచూపులు చూడకండి. ఇన్విజిలేటర్ దృష్టిలో పడితే మీ మీదే వారి ఫోకస్ ఉంటుంది. దీంతో మీరు సరిగా పరీక్ష రాయలేరు. స్కాడ్ వచ్చి మిమ్మల్ని తనిఖీ చేస్తే భయపడకండి. మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అయితే వారు వచ్చే ముందు మీరు ఇతరుల వైపు చూస్తే మీ మీద అనుమానం వస్తుంది. అందుకే మీ పరీక్షపైనే ఫోకస్ చేయండి. పరీక్ష హాలులో ఇతరులతో మాట్లాడేందుకు ప్రయత్నించకండి. బక్కైపోతారు. పరీక్ష మధ్యలో ఒకటి రెండు సార్లు చిన్న విరామం తీసుకోండి. మీ గదిలోని ఇన్విజిలేటర్‌ను టైమ్ అడుగుతూ ఉండండి. దానికి అనుగుణంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
పరీక్ష ముగిసిన తర్వాత స్నేహితులతో ఎక్కువగా మాట్లాడి సమయాన్ని వృథా చేసుకోకండి. పూర్తయిన పరీక్ష గురించి చర్చించుకుంటూ సమయాన్ని వెచ్చించకండి. వీలైనంత త్వరగా ఇంటికి చేరుకుని తదుపరి పరీక్షకు సిద్ధం కావాలి.