Sankranthi Pindi vantalu: సంక్రాంతికి గ్యారెలు లేకపోతే ఎట్ల? బొబ్బెర్లతోని ఇట్ల చేశిల్లంటే మస్తు కరకరలాడతయ్!-try this telangana special tasty and crispy bobbera gyarelu recipe for this sankranthi festival ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sankranthi Pindi Vantalu: సంక్రాంతికి గ్యారెలు లేకపోతే ఎట్ల? బొబ్బెర్లతోని ఇట్ల చేశిల్లంటే మస్తు కరకరలాడతయ్!

Sankranthi Pindi vantalu: సంక్రాంతికి గ్యారెలు లేకపోతే ఎట్ల? బొబ్బెర్లతోని ఇట్ల చేశిల్లంటే మస్తు కరకరలాడతయ్!

Ramya Sri Marka HT Telugu
Jan 08, 2025 06:30 PM IST

Sankranthi Pindi vantalu: పండుగ దగ్గరికచ్చింది. అప్పాలు మొదలు బెట్టిల్లా లేదా? ఏమేం అప్పాలు చెయ్యాలె, ఎట్ట చెయ్యాలె అని ఆలోచించుకుంటున్నరా ఏంది? అయితే ఈ సారి బొబ్బెర గ్యారెలు చెయ్యిళ్లి.ఇవి మంచిగ కరకరలాడ్తయి.టేస్టు గుడ మస్తుంటది. ఎట్ల చేయాల్నో ఈడ సూడొచ్చు.

సంక్రాంతికి గ్యారెలు లేకపోతే ఎట్ల? బొబ్బెర్లతోని ఇట్ల చేశిల్లంటే మస్తు కరకరలాడతయ్!
సంక్రాంతికి గ్యారెలు లేకపోతే ఎట్ల? బొబ్బెర్లతోని ఇట్ల చేశిల్లంటే మస్తు కరకరలాడతయ్!

తెలంగాణల సంక్రాంతి అంటే అప్పాలు ఉండాల్శిందే. ఈడ సకినాల తర్వాత చాన ఫేమస్ అప్పాలేవన్న ఉన్నయా అంటే అవి గ్యారెలే. వీటిని చెక్కలు అని గూడా పిలుస్కుంటరు. అయితె ముచ్చటేందంటే ఊకె శనినగప్పు గ్యారెలు తిని తిని బోర్ కొట్టేటోల్ల కోసం, ఈసారి పండుగకు కొత్తగా గ్యారెలు తినాలనుకునేటోళ్ల కోసం మేము ఒక రెసిపీ తీసుకొచ్చినం. అదే బొబ్బరి గ్యారెలు. ఇవి మంచి టేస్టుగుంటయ్ అట్లనే కరకరలాడ్తయి గూడ. ఓసారి చేసుకొని సూడరాదుర్రి మీకే నచ్చుతయి. మళ్ల మళ్ల చేస్కొని తినాలనుకుంటరు గూడ. ఈ బొబ్బెర గ్యారెలు చెయ్యడానికి ఏమేం గావాల్నో, ఎట్ల చెయ్యాల్నో ఈడ వివరంగ చెప్తాన సూడుళ్లి.

yearly horoscope entry point

బొబ్బెర గ్యారెలు చెయ్యడానికి కావాల్శిన సామాన్లు

  • రెండు కిలోల బియ్యం(దొడ్డు బియ్యం)
  • 200 గ్రాముల బొబ్బెర పప్పు
  • 300 గ్రాముల నువ్వులు
  • 200 గ్రాముల పళ్లీలు
  • 2 కట్టల కల్యమాకు(కరివేపాకు)
  • కట్ట కోత్మీరు(కొత్తిమీర)
  • రెండు చెంశెల కారం (రెండు టీ స్పూన్లు)
  • రెండు చెంశెల ధనియాల పొడి
  • రెండు చెంశెల జిల్కర(జీలకర్ర)
  • ఎనిమిది పచ్చిమిర్పకాయలు
  • ఒక శిన్న ఉల్లిగడ్డ
  • రెండు ఎల్లిగడ్డ
  • నీళ్లు
  • అప్పాలు కాల్వడానికి నూనె
  • గ్యారెల మిషిన్
  • పెద్ద మూకుడు(కడాయి)
  • అప్పాల పుల్ల
  • జల్లి గంటె(చిల్లుల గరిటె)
  • జల్లి గిన్నె(చిల్లుల గిన్నె)
  • అప్పాలు ఎయ్యడానికి కాటన్ బట్ట
  • ఉప్పు( పిండి కల్పినంక నోట్లేసుకొని చూశి మీకు నచ్చినంత కల్పుకోవాలె)
  • అన్నిటికన్న ముఖ్యం ఇద్దరు మనుషులు.( గ్యారెప్పాలు చెయ్యడానికి కనీసం ఇద్దరన్న, ముగ్గురన్న కచ్చితంగ ఉండాలె. ఒక్కలే చేశుడు మస్తు కష్టమైతది, ఆగం ఆగం అయితది)

బొబ్బెర గ్యారెలు ఎట్ల చెయ్యాల్నో సూద్దాం..

  • ముందు మనం తీసుకున్న దొడ్డు బియ్యాన్ని మంచిగ జల్లెడ బట్టుకొని గిర్ని కాడికిపొయ్యి పిండి పిట్టిచ్కరావాలె.
  • బొబెర్లను గూడ మంచిగ రెండు సార్ల కడిగి నానబెట్టుకోవాలె.
  • పట్టిచ్చిన పిండి సల్లారినంక, బొబ్బర్లు రెండు గంటలు నానిన తర్వాత తీసకొని పక్కుకుబెట్టుకోవాలె.
  • పళ్లీలను గూడ దోరగ ఏంచి పొట్టుదీసి పక్కకు బెట్టుకోవాలె.
  • ధనియాలు, జిల్కరను కచ్చపచ్చగ దంచుకోవాలె. మిక్సీలేసుకున్న ఏంలేదు.
  • తర్వాత పచ్చిమిర్పకాయలు, ఉల్లిగడ్డ, పొట్టు దీశి పెట్టుకున్న ఎల్లిగడ్డలు అన్నిటిని ఒక్కకాడేశి మెత్తగ దంచుకోవాలె.
  • ఇప్పడు ఒక పెద్ద డబ్బ అంటే బేషిన్ తీస్కొని దాంట్ల పిండి పొయ్యాలె. పెద్ద డబ్బాల అయితెనే పిండిని మంచిగ కలుపుకోవస్తది.
  • ఈ పిండిల నువ్వులు, పొట్టు దీశిపెట్టుకున్న పళ్లీలు, బొబెర్లు, సన్నగ కోశి పెట్టుకున్న కల్యమాకు, కోత్మీరు(కొత్తిమీర) ఏశి అన్నిటిని మంచిగ కలుపుకోవాలె.
  • పిండిల బబ్బర్లు అన్ని కలగల్శిన తర్వాత దాంట్లనే కొంచెమంత కారం, ఉప్పు, దంచిపక్కకు బెట్టుకున్న జిల్కర, ధనియాల పొడిని, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ పేస్టు ఏశి మల్లా మంచిగ కలుపుకోవాలె.
  • ఇవన్ని మంచిగ కలుపుకున్న తర్వాత పిండిల కొన్ని నీళ్లు పోశి తడుపుకుని ఉప్పు, కారం గిట్ల సరిపొయినయా, లేదా అని చూస్కోవాలె.(పొడి పిండి కన్న తడి పిండిల అయితె మంచిగ తెలుస్తది)
  • అన్ని బరాబరుగా ఉన్నయనుకుంటే పిండిల కొన్ని కొన్ని నీళ్లు పోస్కుంట మంచిగ కలుపుకుంటరావాలె. పిండి గట్టిగ ఉండద్దు, అట్లని మెత్తగ గావద్దు మధ్యరకంగా ఉండేటట్లు మంచిగ కలుపుకోవాలె. (పిండి మెత్తగ అయిందంటె అప్పాలు నూనెను బాగ పీల్చుకుంటయ్). గట్టిగుంటె అప్పాలు గట్టిగయి దంగవు.
  • పిండిని కలుపుకొని పక్కక్కు పెట్టుకుని కొంచెం కొంచెం తీస్కొని చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలె. ముద్దలు గుండ్రంగా జేస్కుంటెనే గ్యారెప్పాలు గూడ మంచిగ గుండ్రంగ వస్తయ్.
  • ఇప్పడు గ్యారెల మిషిను, నూనె ప్యాకెటు లేకపోతే మెత్తగ జారిపోయేటట్టుండే బట్టల కవరు అసొంటిది ఏదన్న కవర్ తీస్కోవాలె.
  • మిషిన్ మీద ఈ కవర్ పెట్టి దానికి మంచిగ నూనె రాసుకోవాలె. లేకపోతే అప్ప మంచిగ తియ్యరాదు.
  • కవర్‌కు నూనె రాశి దాని మీద ముద్ద పెట్టి మల్ల దాని మీద కవర్ కప్పి మిషన్ తోటి అప్పలాగ అయ్యేటట్టు ఓత్తాలె.
  • అప్ప మందంగా ఉండకుండ, మరీ పల్చగ గాకుండా చూస్కొండి. మందంగ ఉంటె లోపల ఉడ్కదు. పల్చగ ఉంటే మూకుడుల ఏశేటప్పుడు తీయ్య రాదు, ఇరిగి పోయి ముక్కలు అయితది.
  • ఇగ మనం తీసుకున్న కాటన్ బట్ట మీద అప్పాలు సగానికి ఎక్కువ నిండంగనే పెద్ద మూకుడు తీసుకని పొయ్యి మీద పెట్టుకోవాలె. (పొయ్యి అంటే గ్యాస్ అయినా ఏం లేదు, కట్టెల పొయ్యి అయినా ఏం లేదు) మీ ఇష్టం, మీ సౌలతి.
  • మూకుడు ఎంత పెద్దగుంటె నూనె అంత ఎక్కువ పోయాలె. నూనె ఎంత ఎక్కువ ఉంటె అన్ని ఎక్కువ అప్పాలు కాల్చుకోవచ్చు.
  • పెద్ద మంట మీద నూనె మంచిగ మరిగేదాక ఆగాలి.
  • నూనె మరుగుతాంటే మనం బట్ట మీద చేశి పెట్టుకున్న బొబ్బెర గ్యారెలను తీశి మూకుట్ల ఎయ్యాలె.
  • మూకుట్ల ఎయ్యంగనె గ్యారెలు ఒకదానికొకటి అతుక్కున్నట్లు అనిపిత్తది. కని ఏంగాదు కొంచెం కాలినంక అప్పాల పుల్లతొటి కదిలిత్తె అవే విడిపోతయి.
  • నూనెల ఏశిన అప్పాలు కొంచెం కాలినంక పుల్లతొటి వాటిని మర్రెయ్కాలె( అంటే మరోవైపుకు తిప్పుకోవాలి)
  • అప్పాలు మంచిగ దోరగ కాలినంక జల్లి గంటెతోటి తీసుకొని జల్లిగిన్నెల ఏసుకోవాలె. జల్లి గిన్నె కింద ఒక పెద్ద పళ్లెం(ప్లేటు) పెట్టుకుంటె నూనెంతా పళ్లెంలకు కార్తది. మళ్ల ఆ నూనెను వాడుకోవచ్చు. అప్పాలు గూడ నూనె నూనె ఉండకుండ ఉంటయ్.
  • చల్లారినంక అప్పాలను తీసుకొని గంపలనన్న, పెద్ద గిన్నెలనన్న ఏసుకోవాలె. అంతే ఇట్లనే మొత్తం పిండితోటి మిగిలిన అప్పాలు గూడ చేసుకోవాలె.

ఎన్ని రకాల గ్యారెలు ఉన్న బొబ్బెర గ్యారెలు అన్నింటికన్న ఎక్కువ కరకరలాడ్తయి. మంచిగ రుచిగొడ్తయి గూడ. అదే వీటి స్పెషాలిటి. ఎట్ల చెయ్యాల్నో అర్థమైంది గదా. ఇగ మంచిగ చేసుకొని తినుళ్లి. ఎవలికన్న ఇచ్చినా గూడ మస్తున్నయని మెచ్చకుంటరు సూడుళ్లి.

Whats_app_banner