Eggless Egg Bhurji: గుడ్లు లేకుండానే టేస్టీ ఎగ్ బుర్జీని ఈజీగా తయారు చేయచ్చు? ఇందులో ప్రొటీన్లు కూడా ఎక్కువే!
Eggless Egg Bhurji: మీరు ఎగ్ బుర్జీ పేరు వినే ఉంటారు, తినే ఉంటారు కూడా. అయితే ఎగ్ లేకుండా కూడా ఎగ్ బుర్జీని తయారు చేయవచ్చని మీకు తెలుసా? అవును ఇది సాధ్యమే. ప్రొటీన్లు అధికంగా ఉండే ఈ ఎగ్‌లెస్ ఎగ్ బుర్జీ తయారు చేయడం కూడా చాలా సులువు. రుచిలో కూడా ఏం తీసిపోదు లెండి!
ఎవరైనా వంట గురించి ఆలోచిస్తే ముందుగా త్వరగా అయిపోయేది, రుచికరమైన దానికే ప్రాధాన్యత ఇస్తారు. అందులో టాప్ లో ఉండేది ఈ ఎగ్ బుర్జీ. ఉదయం ఆఫీసుకు ఆలస్యం కాకుండా, పిల్లలకు స్కూల్ బాక్సులకు ఇబ్బంది కాకుండా సరైన సమయానికి రెడీ చేసుకోగల వంటకం. దీని కోసం పెద్దగా ఇబ్బంది పడనవసరం లేదు. పైగా బాగా వంట తెలిసిన వాళ్లే చేయాలని కూడా లేదు. ప్రొటీన్ అధికంగా ఉండి శరీరానికి మంచి ఎనర్జీని అందించే ఈ వంటకాన్ని కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్లెవరైనా చేసేయొచ్చు.

అదేనండీ ఎగ్ బుర్జీ. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎగ్ లేకుండా ఎగ్ బుర్జీని ఎలా తయారుచేయాలి అని. అదేంటో మీకు కూడా డౌట్ గానే ఉందా… రండి తెలుసుకుందాం. మాంసాహారం మానేసిన వాళ్లు కూడా ఈ ఎగ్ లెస్ ఎగ్ బుర్జీతో ప్రొటీన్లను సంపాదించుకోవచ్చు. దీని కోసం కావల్సిన ఆహార పదార్థాలు, తయారీ విధానం ఇలా ఉన్నాయి.
ఎగ్‌లెస్ బుర్జీ తయారీకి కావలసినవి
- శెనగపిండి (1 కప్పు),
- అవిసె గింజల పొడి (ఒక చెంచా),
- తాజా పెరుగు (4-5 చెంచాలు),
- ఉప్పు రుచికి తగినంత
- నీరు (ఒక 1/3 కప్పు),
- ఒక ఉల్లిపాయ (సన్నగా తరిగినది),
- సగం క్యాప్సికం (తరిగినది),
- సగం తరిగిన క్యారెట్,
- సగం తరిగిన టమోటా,
- రెండు పచ్చిమిర్చి,
- కారం (రెండు చెంచాలు),
- పసుపు (ఒక చెంచా),
- కొత్తిమీర (సన్నగా తరిగినది).
ప్రోటీన్ అధికంగా ఉండే ఎగ్‌లెస్ బుర్జీని ఇలా తయారు చేసే విధానం:
- ఎగ్‌లెస్ బుర్జీ తయారీకి ముందుగా మిశ్రమాన్ని తయారు చేయండి.
- ఒక పెద్ద గిన్నెలో శనగపిండి, అవిసె గింజల పొడి, పెరుగు, నీరు, ఉప్పు వేసి బాగా కలపండి. దోశకు తయారు చేసే మిశ్రమంలాగా బాగా కలిసేంత వరకూ తిప్పుతూనే ఉండండి.
- ఇప్పుడు ఒక పాన్ లేదా తవ్వాను వేడి చేయండి. వేడిచేసిన తవ్వాపై కొద్దిగా నూనె వేసి ఆవాలు వేయండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. ఇప్పుడు అందులోనే టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించండి. తరువాత తరిగిన క్యాప్సికం, క్యారెట్, పచ్చిమిర్చి వేసి అన్నీ మెత్తబడే వరకు వేయించండి.
- కూరగాయలను వేయిస్తున్నప్పుడు పసుపు, జీలకర్ర పొడి, కారం వంటి కొన్ని మసాలా దినుసులను వేసుకుంటూ బాగా కలుపుకోండి.
- ఇప్పుడు ఈ కూరగాయలను పాన్‌పై బాగా పరచండి. దానిపైన శనగపిండి మిశ్రమాన్ని వేయండి. మిశ్రమాన్ని ఒకే చోట వేయకూడదు. కూరగాయలన్నింటిపై ఒక పొర మాదిరిగా కప్పుతూ పాన్‌పై పరచాలి.
- ఇప్పుడు దానిని కప్పి ఇంకొన్ని నిమిషాలు ఉడికించండి. శనగపిండి ఒక వైపు కొద్దిగా ఉడికిన తర్వాత, దానిని తిప్పి మరికొద్దిసేపు ఉడికించండి. దాని ఆకృతి బుర్జీలాగా , దాని రంగు కొద్దిగా గోధుమ రంగులోకి మారే వరకు ఉడికించండి. ఉడికిందని కన్ఫామ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వంటను కిందకు దించేయండి. అంతే, వేడి వేడిగా బుర్జీని పరాఠా, రోటీ లేదా బ్రెడ్‌తో సర్వ్ చేసుకోవడమే.
సంబంధిత కథనం