Chicken Rogan: మీ న్యూ ఇయర్ పార్టీలో టేస్టీగా చికెన్ రోగన్ జోష్ కర్రీ ప్రయత్నించండి, రెసిపీ అదిరిపోతుంది
చికెన్ రోగన్ జోష్ అనేది సాంప్రదాయ కాశ్మీరీ నాన్ వెజ్ వంటకం. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. వండడం కూడా సులభం. న్యూ ఇయర్ పార్టీ మెనూలో ఈ కర్రీకి చోటు ఇవ్వండి. ఇది మీకు ఎంతో నచ్చుతుంది.
మీరు న్యూ ఇయర్ పార్టీలో టేస్టీ వంటకాలు ఏమి వండాలా? అని ఆలోచిస్తున్నారా.. మీ న్యూ ఇయర్ పార్టీ ఫుడ్ మెనూలో కాశ్మీరీ స్టైల్ లో వండే చికెన్ కర్రీ ప్రయత్నించండి. దీన్ని చికెన్ రోగన్ జోష్ అంటారు. దీన్ని చూస్తేనే నోరూరిపోతుంది. చికెన్ రోగన్ జోష్ అనేది సాంప్రదాయ కాశ్మీరీ కూర. దీనిలో చికెన్ ముక్కలను మసాలా గ్రేవీలో, సోంపు గింజలు, పొడి అల్లం పొడితో వండుతారు. ఈ కాశ్మీరీ చికెన్ తినడానికి ఎంత టేస్టీగా ఉంటుందో వండుకోవడం కూడా అంతే సులువుగా ఉంటుంది. చికెన్ రోగన్ జోష్ ను వేడి వేడిగా రోటీ, నాన్ లేదా రైస్ తో తినవచ్చు. న్యూ ఇయర్ రోజు రాత్రి ఈ కూరతో డిన్నర్ ప్లాన్ చేయండి. మీకు ఇది ఎంతో నచ్చుతుంది.
చికెన్ రోగన్ జోష్ రెసిపీకి కావలసిన పదార్థాలు
చికెన్ - కిలో
పాలు - రెండు స్పూన్లు
యాలకులు - నాలుగు
లవంగాలు - అయిదు
నల్ల మిరియాల పొడి - అర స్పూను
సాదా పెరుగు - అర కప్పు
కారం - మూడు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
బిర్యానీ ఆకులు - నాలుగు
ఎండు మిరపకాయలు - నాలుగు
జీలకర్ర - ఒక స్పూను
నెయ్యి - పావు కప్పు
కుంకుమ పువ్వు - నాలుగు రేకులు
సోంపు పొడి - అర స్పూను
అల్లం పొడి - అర స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
గరం మసాలా పొడి - అర స్పూను
చికెన్ రోగన్ జోష్ రెసిపీ
- చికెన్ రోగన్ జోష్ తయారు చేయాలంటే ముందుగా కుంకుమపువ్వు దారాలను పాలలో నానబెట్టాలి.
- ఇప్పుడు యాలకులు, లవంగాలు, నల్ల మిరియాలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు వేయాలి. ఆ పెరుగులోనే కారం, సోంపు పొడి, ఆవాలు, ఎండు అల్లం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
- తర్వాత కుక్కర్ లో నెయ్యి వేసి వేడి చేసి బిర్యానీ ఆకులు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేగనివ్వాలి.
- ఇప్పుడు అందులో చికెన్ వేసి 5 నిమిషాలు ఉడికించాలి.
- ఇప్పుడు పెరుగులో నానబెట్టిన మిశ్రమం మొత్తం వేయాలి. అలాగే కుంకుమపువ్వు వేసిన పాలను కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి.
- అందులో ఒక కప్పు వేడినీళ్లు వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
- కుక్కర్ మీద మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే దాకా ఉంచాలి.
- అంతే టేస్టీ చికెన్ రోగన్ జోష్ రెడీ అయినట్టే. ఇది చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇందులో బోన్ లెస్ చికెన్ వాడితే టేస్టీగా ఉంటుంది.
చికెన్ వంటకాలు కచ్చితంగా న్యూ ఇయర్ పార్టీలో కనిపిస్తాయి. నాన్ వెజ్ ప్రియులు చికెన్ తినకుండా ఉండలేరు. అందుకే ఇక్కడ మేము సరికొత్తగా కాశ్మీరీ చికెన్ వంటకం రెసిపీ ఇచ్చాము ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.