Soya Biryani: మంచి వెజ్ బిర్యానీ తినాలని ఉందా? అయితే సోయా దమ్ బిర్యానీ ట్రై చేయండి నాన్‌వెజ్‌ను మరిపించేస్తుంది!
Soya Biryani:నాన్‌వెచ్ బిర్యానీలు తినీ తినీ బోర్ కొట్టేసిందా? చక్కటి వెజ్ బిర్యానీ తింటే బాగుండు అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. సోయా చంక్స్ అంటే మీల్ మేకర్స్‌తో బిర్యానీ తయారు చేసుకుని తిన్నారంటే మళ్లీ మళ్లీ తినాలి అనుకుంటారు. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
మంచి వెజ్ బిర్యానీ తినాలని ఉందా? అయితే సోయా బిర్యానీ ట్రై చేయండి
చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ బిర్యానీలు తినీ తినీ బోర్ కొట్టేసిందా. ఇంట్లో వాళ్లకీ, పిల్లలకీ నచ్చేలా చక్కటి వెజ్ బిర్యానీ చేస్తే బాగుండు అనుకుంటున్నారా. అయితే ఇది మీ కోసమే. పోషక విలువలతో పాటు ప్రొటీన్లు పుష్కలంగా ఉండే సోయా బిర్యానీని వారి కోసం తయారు చేయండి. ఈ వీకెండ్ కి లేదా న్యూ ఇయర్ రోజున వారికి సోయా చంక్స్ అంటే మీల్ మేకర్స్ తో ఫర్ఫెక్ట్ వెజ్ బిర్యానీ చేసి పెట్టారంటే కొత్త సంవత్సరాన్ని మరింత కొత్తగా మొదలు పెట్టిన వారు అవుతారు. ఆలస్యం చేయకుండా సోయా బిర్యానీ(మీల్మేకర్ దమ్ బిర్యానీ తయారీకి ఏయే పదార్థాలు కావాలో, ఎలా తయారు చేయాలో చూసేద్దామా..
సోయా బిర్యానీ కోసం కావాలసిన పదార్థాలు:
- బాస్మతి బియ్యం- 500గ్రాములు
- మీల్‌మేకర్ - 100గ్రాములు(సోయా చంక్స్)
- క్యారెట్ - ఒకటి
- క్యాప్సికమ్ - ఒకటి
- పెరుగు- ముప్వావు కప్పు
- పచ్చి బఠాణీ - పావు కప్పు
- కొత్తమీర - పావు కప్పు
- పుదీనా - పావు కప్పు
- అల్లం - ఒక చిన్న ముక్క
- పచ్చిమిర్చి- మూడు
- కారంపొడి - ఒక టీస్పూన్
- ధనియాల పొడి - ఒక టీస్పూన్
- వేయించిన జీలకర్ర పొడి - ఒక టీస్పూన్
- గరం మసాలా - ఒక టీస్పూన్
- పసుపు - అర టీస్పూన్
- ఉప్పు- రుచికి తగినంత
- నిమ్మకాయ - ఒకటి
- నెయ్యి- ఏడు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్లు
- దాల్చిన చెక్క- రెండు లేదా మూడు ముక్కలు
- యాలకులు- ఎనిమిది
- లవంగాలు- ఎనిమిది
- బిర్యానీ ఆకు- మూడు
- మరాఠీ మొగ్గ- మూడు
- అనాస పువ్వు- మూడు
- షాజీరా- రెండు టీస్పూన్లు
- ఎండిన గులాబీ రేకులు- రెండు టీస్పూన్లు
- పెద్ద ఉల్లిపాయ- ఒకటి
- అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టేబుల్ స్పూన్లు
- నీళ్లు- 50మిల్లీ లీటర్లు
- కుంకుమ పువ్వు లేదా ఫుడ్ కలర్
- మైదా పిండి- ఒక కప్పు
సోయా బిర్యానీ తయారీ విధానం:
- ముందుగా వేడి నీటిలో మీల్ మేకర్లను వేసి కొన్ని నిమిషాల పాటు నాననివ్వాలి.
- ఇవి కాస్త మెత్తగా మారిన తర్వాత బయటకు తీసి గట్టిగా నీరు పిండుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె మీల్ మేకర్లు వేసి దీంట్లోనే చిన్నగా తరుముకున్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చి బఠాణీలు, కొత్తిమీర తరుము, పుదీనా తురుము వేసి చక్కగా కలపాలి.
- తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మూడు పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కను వేసి మెత్తటి పేస్టు చేసుకోవాలి.ఈ పేస్టును ముందుగా కలుపుకున్న మిల్మేకర్ మిశ్రమంలో వేసి కలపాలి.
- ఇందులోనే ఒక టీస్పూన్ కారం పొడి, ఒక టీస్పూన్ ధనియాల పొడి, ఒక టీస్పూన్ జీలకర్ర పొడి,ఒక టీస్పూన్ గరం మసాలా , అర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు, ఒక నిమ్మకాయ రసం వేసి అన్నీ కలిసిపోయేలా కలపండి.
- ఈ మిశ్రమంలోనే ముప్పావు కప్పు పెరుగు వేసుకుని మీల్ మేకర్ ముక్కలకు పెరుగు, మసాలాలు అన్ని బాగా అంటుకునేలాగా చక్కగా కలిపి గంటపాటు అలాగే వదిలేయండి. మారినేషన్ లేకుండా బిర్యానీ రుచిగా ఉండదు.
- ఇప్పడు బిర్యానీ బాణీ లేదా అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి.నెయ్యి లేని వారు నూనె కూడా వేసుకోవచ్చు. బిర్యానీ రుచి బాగుండాలంటే నెయ్యి మంచి ఆప్షన్.
- వేడికి నెయ్యి కరిగిన తర్వాత దాంట్లో ఒక దాల్చిక చెక్క ముక్క, రెండు యాలకులు, ఐదు లవంగాలు, రెండు బిర్యానీ ఆకులు, ఒక టేబుల్ స్పూన్ షాజీరా, ఒక మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వు వేసి వేయించండి.
- ఇవి కాస్త వేగి మంచి వాసన రావడం మొదలు పెట్టడాని ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేయండి.
- ఉల్లిపాయలు బాగా వేగితేనే బిర్యానీ టేస్టీగా ఉంటుంది. ఇవి పూర్తిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు పసుపు వేసి వేయించండి.
- అల్లం పచ్చి వాసన పోయేంత వరకూ వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మారినేట్ చేసుకున్న మీల్ మేకర్ మిశ్రమాన్ని వేసి చక్కగా కలపండి.
- ఈ మిశ్రమం రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత మీల్ మేకర్లు మునిగే అంతవరకూ నీళ్లు పోయండి. ఎక్కువ నీళ్లు పోస్తే బిర్యానీ చెడిపోతుందని గుర్తుంచుకోండి.
- మీల్ మేకర్లు ఉడికేంత వరకూ అంటే దాదాపు 6 నుంచి 8 నిమిషాల వరకూ ఈ మిశ్రమాన్ని ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కక్కు పెట్టుకోండి.
- ఇప్పుడు లోతుగా ఉండే మరొక గిన్నె తీసుకుని దాంట్లో అన్నం ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని వేడి చేయండి.
- ఈ నీటిలోనే దంచి పెట్టుకున్న ఒక దాల్చిన చెక్క ముక్క, ఐదు లవంగాలు, ఆరు యాలకులు,రెండు బిర్యానీ ఆకులు, రెండు మఠాటీ మొగ్గలు, రెండు అనాస పువ్వులు, షాజీరా, ఎండిన గులాబీ రేకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా మరగనివ్వండి.
- మరుగుతున్న నీటిలో అరగంట పాటు నానబెట్టిన బాస్మతీ రైస్ ను వేసి, నిమ్మరసం పోసి ఉడికించండి.
- బాస్మతీ బియ్యం కాస్త పలుకు ఉన్నప్పుడు అంటే దాదాపు ముప్పావు వంతు ఉడికిన తర్వాత నీటిని వడకట్టి బియ్యాన్ని తీసుకోవాలి.
- ఇప్పుడు ముందుగా మీల్ మేకర్ మిశ్రమాన్ని వేయించి పక్కక్కు పెట్టుకున్న బిర్యానీ గిన్నెలో ఈ బియ్యాన్ని లేయర్ లేయర్లుగా వేసి అన్నం మీద మూడు టీ స్పూన్ల నెయ్యిని, బాస్మతీ రైస్ ఉడికించిన నీటిని ఒక కప్పు తీసుకుని స్ప్రెడ్ చేస్తూ పోయండి.
- ఇప్పుడు ఇదే రైస్ మీద వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, నీటిలో కలిపిన ఫుడ్ కలర్ వేసి గార్నీష్ చేసుకొండి.
- ఇప్పడు బిర్యానీ గిన్నెకు సరిపడా మూత తీసుకుని దాని చుట్టూరా మైదా పిండిని అతికించి గాలి కూడా బయటకు రాలేనంత గట్టిగా మూతపెట్టండి. ఇలా అయితేనే బిర్యానీ చక్కగా దమ్ అవుతుంది.
- అన్నాన్ని దాదాపు 20 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొండి.
- కంగారు పడి ఆఫ్ చేసిన వెంటనే మాత్రం మూత అస్సలు ఓపెన్ చేయకండి. పావు గంట నుంచి 20 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచిన తర్వాత మూత తీసి కింద నుంచి అన్నాన్ని అంతా కలపండి.
- అంతే హెల్తీ అండ్ టేస్టీ సోయా దమ్ బిర్యానీ తయారయినట్టే.మిర్చీ కా సాలన్ , రైతాలతో పాటు సర్వ్ చేసుకుని తినేయచ్చు. ఈ వీకెండ్ లేదా స్పెషల్ డేకి ఈ బిర్యానీ ట్రై చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. వారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది.