Pumpkin Halwa: వసంత పంచమి రోజున సరస్వతీ దేవికి ఇష్టమైన గుమ్మడికాయ హల్వా సమర్పించండి.. ఇదిగో రెసిపీ
Pumpkin Halwa: వసంత పంచమి వస్తోంది. ఆ రోజున సర్వసతీ దేవికి ఇష్టమైన నైవేద్య సమర్పించి ఆమె ఆశీస్సులు పొందాలనుకుంటున్నారా? అయితే గుమ్మడికాయతో ఇలా హల్వా చేసి అర్పించండి. రుచిలో అద్భుతుంగా ఉండే ఈ హల్వా తయారు చేయడం కూడా చాలా సులువు.
గుమ్మడికాయ హల్వా తయారీ విధానం
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్లపక్షంలో ఐదవ రోజున వసంత పంచమిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి 2 న వసంత పంచమిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సరస్వతీ దేవిని పూజించడం వల్ల జ్ఞానం, తెలివి, కీర్తి లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున, విద్యా దేవత అయిన సరస్వతికి దేవికి ప్రీతికరమైన నైవేద్యాలు, వస్త్రాలు వంటి రకరకాల పదార్థాలు సమర్పిస్తారు. మీరు కూడా వసంత పంచమి రోజున సరస్వతీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆమె భోగ ప్రసాదంలో ఏదైనా భిన్నంగా, రుచిగా చేయాలనుకుంటే గుమ్మడికాయతో ఇలా హల్వా తయారు చేసుకోవచ్చు. ఇది రుచిలో అద్భుతంగా ఉండటంతో పాటు తయారు చేయడం కూడా చాలా సులభం. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

గుమ్మడికాయ హల్వా తయారీకి కావలసిన పదార్థాలు
- ఒక గుమ్మడికాయ
- 1/2 దాల్చిన చెక్క
- 150 మి.లీ నీరు
- 150 గ్రాములు పంచదార
- 4 టేబుల్ స్పూన్ల వెన్న లేదా నెయ్యి
- 50 గ్రాముల ఎండు ద్రాక్ష
- 50 గ్రాముల జీడిపప్పు
- 2 టేబుల్ స్పూన్లు కాల్చిన కొబ్బరి తురుము
- 2 టేబుల్ స్పూన్ల బాదం ముక్కలు
- ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి
గుమ్మడికాయ హల్వా తయారీ విధానం..
- ముందుగా గుమ్మడికాయను తీసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- తరువాత గుమ్మడి ముక్కలకు ఉండే గింజలు, పీచు పదార్థాన్నీ పూర్తిగా తీసిపడేయాలి.
- ముక్కలన్నీ శుభ్రంగా అయిన తర్వాత పీలర్ సహాంతో గుమ్మడికాయ ముక్కలపై ఉండే తొక్కంతా తీసేయాలి.
- తరువాత గుమ్మడికాయను కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
- ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో గుమ్మడికాయ ముక్కలు , నీళ్లు, దాల్చిన చెక్క వేసి మూతపెట్టి మెత్తబడే వరకు ఉడికించాలి.
- ఆ తర్వాత నీటిని వడగట్టి గుమ్మడికాయ ముక్కలను తీసుకుని గుజ్జులా చేసుకోవాలి.
- ఇప్పుడు మరో పెద్ద ప్యాన్‌లో 4 టీస్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి.
- నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్‌లను, బాదం ముక్కలను నెయ్యిలో వేయించి పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు అదే ప్యాన్‌లో గుమ్మడికాయ వేసి గుజ్జంత చిక్కబడి రంగు మారే వరకు 10 నిమిషాలు ఉడికించాలి.
- ఇప్పుడు ఈ గుమ్మడికాయ గుజ్జులో పంచదార, యాలకుడ పొడి వేసి ఉడకనివ్వండి. పంచదార నచ్చని వాళ్లు బెల్లం కూడా వేసుకోవచ్చు.
- తక్కువ మంట మీద దీన్ని 8నుంచి 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దాంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, కొబ్బరి పొడి వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి.
- అంతే అద్భుతమైన గుమ్మడికాయ హల్వా తయారు అయినట్టే. అమ్మవారికి సమర్పించి ఆశీస్సులను పొందండి.