Cabbage Brocoli Butter: పిల్లల లంచ్ బాక్సుల్లోకి క్యాబేజీ బ్రోకలీ బటర్ చేసి పెట్టారంటే మిగలకుండా తినేస్తారు!
Cabbage Brocoli Butter: క్యాబేజీ, బ్రోకలీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయలు. అందుకే వీటిని ఏ రకంగా అయినా మన మెనూలో తప్పకుండా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఇలా హెల్దీగా, టేస్టీగా క్యాబేజీ బ్రోకలీ బటర్ చేసి పెట్టారంటే బాక్సు అంతా ఖాలీ చేసి తీసుకొస్తారు.
బ్రోకలీ ధర కాస్త ఎక్కువే కానీ, ఆరోగ్యానికి చాలా మంచిది. బహుశా అందుకే బ్రోకలీ తినేవారి సంఖ్య తక్కువ, దానికి సంబంధించిన వంటకాలు కూడా తక్కువే. అయితే, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగిన వారు తరచుగా బ్రోకలీని తమ ఆహారంలో చేర్చుకోవాలని అనుకుంటారు, కానీ దాని రుచి కొన్నిసార్లు వారిని ఆపేస్తుంది. ముఖ్యంగా పిల్లలు కాకరకాయను చూసినట్లు బ్రోకలీని చూసి పారిపోతారు. నిజం ఏమిటంటే బ్రోకలీ కాస్త రుచిలేనిది అయినప్పటికీ, దానిని మీరు చాలా రుచికరంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈరోజు మనం అలాంటి ఒక రెసిపీ గురించి తెలుసుకుందాం. బ్రోకలీ, క్యాబేజీలతో బటర్ కలిపి గోబీ బ్రోకలీ మఖ్ఖని తయారు చేస్తే పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా వేళ్ళు చప్పరించేసుకుంటూ మరీ తినేస్తారు. ముఖ్యంగా పిల్లలైతే లంచ్ బాక్సు అంతా ఖాళీ చేసుకుని తీసుకొస్తారు.
క్యాబేజీ బ్రోకలీ బటర్ తయారు చేసే విధానం:
కావలసిన పదార్థాలు:
క్యాబేజీ: 1 కప్పు
బ్రోకలీ: 1/2 కప్పు
పచ్చి బఠానీలు: 1/2 కప్పు
ఉప్పు: రుచికి తగినంత
గ్రేవీ కోసం: నూనె: 2 స్పూన్లు
సన్నగా తరిగిన ఉల్లిపాయలు: 1
సన్నగా తరిగిన అల్లం: 1 ముక్క
ఎర్ర మిరపకాయ పొడి: రుచికి తగినంత
తరిగిన టమాటాలు: 3
గరం మసాలా: 1 స్పూను
జీలకర్ర పొడి: 1/2 స్పూను
ధనియాల పొడి: 1/2 స్పూను
పసుపు పొడి: 1/2 స్పూను
కసూరి మెంతి: 1 స్పూను
కొబ్బరి పాలు: 3/4 కప్పు
జీడిపప్పు పొడి: 1/4 కప్పు
చక్కెర: 1/4 స్పూను
తయారీ విధానం:
ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు పోసుకుని మరిగించాలి.
నీళ్ళు మరిగిన తర్వాత, ఒక స్పూను ఉప్పు వేసి, ముందుగా తరిగిన క్యాబేజీని దాంట్లో మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత క్యాబేజీని నీళ్ళ నుండి తీసివేయాలి.
ఇప్పుడు అదే నీళ్ళలో బ్రోకలీ వేసి ఐదు నుండి ఆరు నిమిషాలు ఉడికించాలి.
వీటిని పక్కకు పెట్టుకుని గ్రేవీ తయారు చేసుకోవాలి.
గ్రేవీ తయారు చేయడానికి, కడాయిలో నూనె వేసి కాగిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వేయాలి.
ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చేవరకు వేయించిన తర్వాత దాంట్లోనే అల్లం, వెల్లుల్లి, మిరపకాయలు వేసి రెండు నిమిషాలు పాటు వీటిని వేయించాలి. ఇలా అన్ని మసాలా దినుసులు వేసి బాగా కలుపుతూ వేయించాలి.
ఇప్పుడు ఒక కడాయిలో టమాటాలు, ఉప్పు, చక్కెర, కసూరి మెంతి వేసి మూత పెట్టి మీడియం మంట మీద ఎనిమిది నుండి పది నిమిషాలు పాటు అన్నింటినీ ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి.
ఈ మసాలా మిశ్రమం చల్లారిన తర్వాత, దానిలో జీడిపప్పు పొడి, కొబ్బరి పాలు వేసి మిక్సీలో లేదా గ్రైండర్లో వేసి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
ఇప్పుడు ఒక పాన్‌లో గ్రేవీ, క్యాబేజీ, బ్రోకలీ, బఠానీలు, మసాలా పేస్ట్ వేసి చక్కగా వేయించాలి.
తరువాత మీడియం మంట మీద ఈ మిశ్రమాన్ని 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
అవసరమైతే నీరు పోసుకుని గ్రేవీని మరికొంత పలుచన చేసుకోవచ్చు.లేదంటే ఇంతటితో ఆపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో అలంకరించుకోవాలి.
అంతే గోబీ బ్రోకలీ బటర్ రెసిపీ రెడి అయినట్టే. వేడి వేడిగా సర్వ్ చేశారంటే వేళ్లు చప్పరించుకుంటూ మరీ తినేస్తారు. పిల్లల లంచ్ బాక్సులోకి పెట్టినా నిశ్చితంగా ఉండచ్చు.