Kothimeera Dosa:వేసవిలో శరీరానికి చలువ చేసేందుకు కొత్తిమీర దోసలు తినండి.. ఇదిగో రెసిపీ ఇలా చేసేయండి!-try this healthy and tasty kothimeera dosa in summer with simple recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kothimeera Dosa:వేసవిలో శరీరానికి చలువ చేసేందుకు కొత్తిమీర దోసలు తినండి.. ఇదిగో రెసిపీ ఇలా చేసేయండి!

Kothimeera Dosa:వేసవిలో శరీరానికి చలువ చేసేందుకు కొత్తిమీర దోసలు తినండి.. ఇదిగో రెసిపీ ఇలా చేసేయండి!

Ramya Sri Marka HT Telugu

Kothimeera Dosa: వేసవిలో డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే కొత్తిమీర దోసలను తప్పకుండా తినాల్సిందే.శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడం నుంచి క్యాన్సర్ వ్యాధిని తగ్గించడం వరకూ ఎన్నో రకాల ప్రయోజనాలను అందించే కొత్తిమీరతో దోసలు ఎలా వేయాలో తెలుసుకుందాం రండి.

కొత్తిమీరతో తయారు చేసిన రుచికరమైన దోసలు

వేసవి వచ్చేసింది. శరీరంలో వేడి, డీహైడ్రేషన్ వంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే చలువ చేసే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేసే గుణాలు కలిగిన ముఖ్యమైన ఆహారాల్లో కొత్తిమీర ముందుంటుంది. కాబట్టి ఈ వేసవిలో దీన్ని ఎక్కువగా తినేందుకు ప్రయత్నించండి. ఇప్పటివరకూ మీరు కొత్తిమీరతో పచ్చడి చేసుకుని ఉంటారు, కూరల్లో, మజ్జిగల్లో కూడా వేసుకుని తిని ఉంటారు. ఈసారి కొత్తగా కొత్తిమీర దోసలను ట్రై చేయండి.

ఈజీగా త్వరగా తయారయ్యే కొత్తిమీర దోసలు మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి, మలబద్దకం, అజీర్తి వంటి సమస్యను నయం చేస్తాయి, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చర్మం నుంచి కళ్ల వరకూ, మధుమేహం నుంచీ గుండెపోటు వరకూ ఎన్నో ప్రాణాంతక వ్యాధును నయం చేసే లక్షణాలు, పోషకాలు అన్నీ కొత్తిమీరలో ఉంటాయి. ఇలాంటి కొత్తిమీరతో ఉదయాన్నే దోసలు వేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కొత్తిమీర దోసలను ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి.

కొత్తిమీర దోసలకు కావాల్సిన పదార్థాలు:

  • కొత్తిమీర ఒక కప్పు
  • పచ్చిమిర్చీ - ఒకటి లేదా రెండు
  • అల్లం ముక్క- ఒక ఇంచు
  • గోధుమపిండి- ఒక కప్పు
  • బియ్యం పిండి - పావు కప్పు
  • బొంబాయి రవ్వ - పావు కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నీరు

కొత్తిమీర దోసలు తయారు చేయడం ఎలా?

  1. కొత్తిమీరతో దోసలు వేసుకోవడానికి ముందుగా కొత్తిమీరను తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కుని ఒక మిక్సీ జార్ లో వేయండి.
  2. ఇదే మిక్సీ జార్ లో ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా నీరు పోసి మిక్సీ పట్టండి.
  3. మెత్తటి పేస్టులా మారిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్‌లో వేయండి.
  4. ఇప్పుడు అదే బౌల్‌లో గోధుమపిండి, బియ్యం పిండి, బొంబాయి రవ్వలతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
  5. కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ కొత్తిమీర మిశ్రమం పిండి అన్నీ బాగా కలిసిపోయేంత వరకూ బాగా కలపండి.
  6. ఇప్పుడు దోస పెనం తీసుకుని దోస వేడి చేయండి.
  7. తరువాత కొత్తిమీర మిశ్రమంతో ముందుగా దోసలు వేసుకుని తర్వాత దాని మీద కాస్త నూనె వేయిండి.
  8. మీడియం ఫ్టేమ్ మీద రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దోసను మరొక వైపుకు తిప్పండి.
  9. రెండు వైపులా చక్కగా ఉడికిన తర్వాత దోసను తీసి టామాటొ చట్నీ లేదా కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీ వంటి మీకు నచ్చిన చట్నీలతో నంచుకుని తిన్నారంటే రుచి అదిరిపోతుంది.

ఈజీగా సింపుల్ గా తయారయ్యే కొత్తిమీర దోసలను పిల్లల నుంచి పెద్దల వరకూ దీన్ని నిస్సందేహంగా తినచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందచ్చు. అన్నింటికన్నా మించి ముందు రోజు నానబెట్టడం వంటి శ్రమ లేకుండా త్వరగా, ఇన్ స్టంట్ గా వీటిని తయారు చేసుకోవచ్చు. రెసిపీ నచ్చింది కదా ట్రై చేసి ఇంట్లో వాళ్లకి సర్వ్ చేసేయండి మరీ.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం