Jewellery Polishing: ఆర్టిఫిషియల్ జ్యువెలరీ రంగు పోయాయా? ఇలా మెరిపించేయొచ్చు-try these tips to polish artificial jewellery at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jewellery Polishing: ఆర్టిఫిషియల్ జ్యువెలరీ రంగు పోయాయా? ఇలా మెరిపించేయొచ్చు

Jewellery Polishing: ఆర్టిఫిషియల్ జ్యువెలరీ రంగు పోయాయా? ఇలా మెరిపించేయొచ్చు

Koutik Pranaya Sree HT Telugu
Oct 17, 2024 10:30 AM IST

Jewellery Polishing: ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, వన్ గ్రామ్ గోల్డ్ నగలు రంగుపోయి తొందరగా నలుపెక్కుతాయి. అంత ఖరీదు పెట్టి కొన్న నగల్ని ఇంట్లోనే పాలిషింగ్ చేసుకునే చిట్కాలు తెల్సుకోండి. చాలా ఉపయోపడతాయి.

ఆర్టిఫిషియల్ నగల్ని పాలిషింగ్ చేసే టిప్స్
ఆర్టిఫిషియల్ నగల్ని పాలిషింగ్ చేసే టిప్స్ (Shutterstock)

బంగారానికీ తక్కువా కాదు. పోయినా ఏ బాధా లేదు. అందుకేనేమో ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. బంగారం ధరలు పెరగడం వల్ల వీటి మీద మక్కువ మరింత ఎక్కువైపోయింది. బంగారం, వజ్రాలతో సాధ్యం కాని సరికొత్త డిజైన్ ప్రతి సందర్భంలో ధరించడానికి అందుబాటులో ఉంటోంది. అయితే కాలక్రమేణా వాటి రంగు పోతుంది. నల్లగా మారతాయి. వాటిని వేసుకోలేరు. అలాంటప్పుడు వాటిని మెరిపించే కొన్ని చిట్కాలు తెల్సుకోండి. పాత నగలు కూడా కొత్తగా కనిపిస్తాయి.

బేకింగ్ సోడా

మెరిసే వెండి నగలు, ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఉంగరాలు కొన్నిసార్లు వేసుకోగానే కాస్త నలుపు రంగులోకి మారిపోతాయి. అలాంటి నగల మెరుపును తిరిగి తీసుకురావడానికి బేకింగ్ సోడాను వాడొచ్చు. దానికోసం ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో అర టీస్పూన్ ఉప్పు, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి చిక్కటి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు వెండి ఉంగరాన్ని లేదా నగల్ని ఒక అల్యూమినియం ఫాయిల్ మీద వేసి దాని మీద ఈ చిక్కటి పేస్ట్ వేసి రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత కాస్త చేతులతో ఉంగరాన్ని రుద్ది శుభ్రమైన నీటితో కడగాలి. వెండి నగలు పక్కాగా మెరిసిపోతాయి.

నిమ్మకాయ:

మెరిసే రాళ్లు లేదా ముత్యాలతో చేసిన బ్రాస్లెట్లు ఎక్కువ కాలం ఉపయోగించిన తర్వాత నలుపు రంగులోకి మారడం ప్రారంభిస్తాయి. నిమ్మకాయ సహాయంతో పోయిన రంగును తిరిగి తెచ్చుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో కొద్దిగా నీరు తీసుకుని అందులో అంతే మొత్తంలో నిమ్మరసం కలపాలి. ఇప్పుడు అందులో నల్లగా మారిన బ్రాస్ లెట్ ను ముంచి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత బ్రష్ తో లేదా చేతులతో రుద్దుతూ బ్రేస్ లెట్ ను శుభ్రం చేసి తర్వాత చల్లటి నీటితో కడిగితే చాలు.

కోక్:

ప్రతి ఒక్కరూ ఇష్టంగా తాగే ఈ పానీయాన్ని నగలు శుభ్రపరచడానికీ వాడొచ్చు. దీనకోసం ఒక గిన్నెలో కోక్ పోసుకుని అందులో ఆర్టిఫిషియల్ జ్యువెలరీని పావుగంట పాటూ ఉంచాలి. తర్వాత కాస్త చేత్తో లేదా సాఫ్ట్ బ్రష్‌తో రుద్దితే మురికి వదిలిపోతుంది. పాత నెక్‌లేస్ కొత్తగా మెరుస్తుంది. 

టూత్ పేస్ట్:

ఆర్టిఫిషియల్ చెవిపోగులను శుభ్రం చేయడానికి టూత్ పేస్ట్ ను ఉపయోగించవచ్చు. ఇందుకోసం టూత్ బ్రష్ పై కొద్దిగా టూత్ పేస్ట్ అప్లై చేసి రాయాలి. తప్పకుండా చెవిపోగులు కొత్త వాటి లాగే కనిపిస్తాయి.

Whats_app_banner