గ్రీన్ మటన్ కర్రీ ఒక్కసారి వండుకొని చూడండి, బగారా రైస్ తో జతగా అదిరిపోతుంది-try cooking green mutton curry once it goes well with bagara rice ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  గ్రీన్ మటన్ కర్రీ ఒక్కసారి వండుకొని చూడండి, బగారా రైస్ తో జతగా అదిరిపోతుంది

గ్రీన్ మటన్ కర్రీ ఒక్కసారి వండుకొని చూడండి, బగారా రైస్ తో జతగా అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu

మటన్ కర్రీ ఎప్పుడూ ఒకేలా వండితే ఎలా? ఓసారి గ్రీన్ మటన్ కర్రీ వండి చూడండి. దీని ముందు ఏ కూర అయినా దిగదుడుపే. అంత రుచిగా ఉంటుంది ఈ కూర.

గ్రీన్ మటన్ కర్రీ రెసిపీ

మటన్‌తో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. నాన్ వెజ్ ప్రియులకు మటన్ వంటకాలు అంటే ఎంతో ఇష్టం. అలా అని ఎప్పుడూ ఒకేలా వండుకుంటే ఎలా ఓసారి కొత్తగా గ్రీన్ మటన్ కర్రీ ట్రై చేయండి. పైగా ఇది స్పైసీగా, టేస్టీగా ఉంటుంది.

ప్లెయిన్ బిర్యానీతో ఈ గ్రీన్ మటన్ కర్రీ కాంబినేషన్ అదిరిపోతుంది. దీన్ని వండడం కూడా చాలా సులువు. గ్రీన్ మటన్ కర్రీ అనగానే ఆకుపచ్చ ఫుడ్ కలర్ వేస్తారేమో అనుకోకండి. చుక్కకూరను కలిపి వండుతారు. అందుకే ఇది రుచిగా ఉంటుంది. ఇక రెసిపీ ఎలాగో చూద్దాం.

గ్రీన్ మటన్ కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు

మటన్ - అరకిలో

చుక్కకూర తరుగు - మూడు కప్పులు

ఉల్లిపాయలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

గరం మసాలా పొడి - అర స్పూను

పసుపు - పావు స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

కారం - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - తగినంత

గ్రీన్ మటన్ కర్రీ రెసిపీ

1. మటన్ ను చిన్న ముక్కలుగా కోసే శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా ఉడకబెట్టుకోవాలి.

2. ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉంచితే బాగా మటన్ మెత్తగా ఉడుకుతుంది.

3. ఇప్పుడు చుక్కకూరను శుభ్రంగా తరిగి నీటిలో వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో ఉల్లిపాయ తరుగును వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.

5. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేయాలి. ఇందులోనే పసుపు వేసి బాగా కలుపుకోవాలి.

6. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలపాలి.

7. ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న చుక్కకూరను వేసి బాగా కలిపి పైన మూత పెట్టుకోవాలి.

6. చుక్కకూరలోంచి నీరు దిగి బాగా ఉడుకుతుంది. ఆ నీరు ఇంకిపోయే వరకు చిన్న మంట మీద ఉడికించాలి.

7. ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ ను నీటితో సహా అందులో వేయాలి.

8. పైన మూత పెట్టి నీరు ఇంకే వరకూ ఉడికించుకోవాలి.

9. మటన్ లోని మీరు ఇంకిన తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.

10. పైన మూత పెట్టి ఇది దగ్గరగా ఇగురులాగా అయ్యేవరకు ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.

11. అంతే టేస్టీ, గ్రీన్ మటన్ కర్రీ రెడీ అయినట్టే చుక్కకూరలో కొంచెం పుల్లదనం ఉంటుంది.

12. ఈ పుల్లదనం మటన్ కూరకు కలిసి చాలా రుచిగా ఉంటుంది.

పుల్లపుల్లగా స్పైసీగా ఉండే ఈ కర్రీని వేడి వేడి వైట్ రైస్ లో తింటే అద్భుతంగా ఉంటుంది. లేదా ప్లెయిన్ బిర్యాని బగారా రైస్ తో కూడా అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం గ్రీన్ మటన్ కర్రీ చేసేందుకు ఒకసారి ప్రయత్నించండి.

గ్రీన్ మటన్ కర్రీలో మటన్ తో పాటు మనం చుక్కకూరను కూడా అధికంగా వాడాము. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చుక్కకూర ఇగురులాగా తయారవుతుంది. ఆ ఇగురు అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. మటన్ కూడా మెత్తగా ఉడుకుతుంది. కాబట్టి చిన్నపిల్లలు కూడా చక్కగా దీన్ని నమిలి తినగలరు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.