Snoring Tips: గురకతో ఇబ్బంది పడుతున్నారా? ప్రశాంతంగా నిద్రించేందుకు ఈ చిట్కాలను పాటించండి, గురక తగ్గుతుంది
Snoring Tips: గురక వల్ల సరిగా నిద్ర పోలేరు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. పక్కవారికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. గురకను తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
Snoring Tips: గురక ఆరోగ్యకరమైన సంకేతం కాదు. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. గురకపెట్టే వారికే కాదు పక్కన పడుకున్న వారికి కూడా ఇది ఎంతో ఇబ్బంది కలిగించే సమస్య. నోరు లేదా ముక్కు ద్వారా గాలి ప్రవహించడానికి అద్దంకి ఏర్పడినప్పుడు ఇలా గురక అనే శబ్దం వస్తుంది. గురక ఒక్కోసారి ప్రమాదకరంగా కూడా మారుతుంది. అసలు గురక ఎందుకు వస్తుందో? దాన్ని తగ్గించుకోవడానికి ఉన్న చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
గురక వయసు పెరిగే కొద్దీ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే మన శరీర వయసుతో పాటు గొంతులోని కండరాల వయసు కూడా పెరుగుతుంది. అవి ఎక్కువగా పని చేయకుండా రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడతాయి. ఆ సమయంలో గురక వచ్చే అవకాశం ఉంది. ఊబకాయం వల్ల కూడా గురక అధికంగా వస్తుంది. మెడ, గొంతు చుట్టూ కొవ్వు అధికంగా పేరుకుపోవడం వల్ల అక్కడ ఉన్న శ్వాసనాళాలు కుచించుకుపోతాయి. దీనివల్ల గురక శబ్దం వస్తుంది. అలెర్జీలు, జలుబు, సైనస్ ఇన్ఫెక్షన్లు వచ్చినా కూడా నాసిక మార్గాలు గాలి సులువుగా ప్రవహించలేదు. అప్పుడు గురక వంటి శబ్దాలు వస్తాయి. మీ స్లీపింగ్ పొజిషన్ కూడా గురక రావడానికి కారణం అవుతుంది. ఆల్కహాల్ అధికంగా తాగే వారిలో కూడా గురక వస్తుంది. మరొక తీవ్రమైన సమస్య స్లీప్ డిజార్డర్ అని పిలిచే రోగం ఉన్నవారిలో కూడా గురక వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇలాంటివారికి గురక శబ్దం అధికంగా వస్తుంది.
గురకతో ముడిపడి ఉన్న ప్రమాదాలు
గురకను పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అది హానికరం కాదని అనుకుంటారు. కొంతమేరకు అది నిజమే, కానీ కొన్నిసార్లు గురక కొన్ని ఆరోగ్య ప్రమాదాలతో ముడిపడి ఉంటుంది. అందులో ముఖ్యమైనది స్లీప్ ఆప్నియా నిద్రలో ఉండగానే శ్వాస ఆగిపోతుంది. ఆక్సిజన్ స్థాయిలో తగ్గిపోతాయి. దీనివల్ల ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించవచ్చు. స్లీప్ ఆప్నియా వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. గురక వల్ల సరిగా నిద్ర పట్టక పగటి పూట అలసటగా ఉంటుంది. ఏకాగ్రత దెబ్బతింటుంది.
గురకను ఆపడం ఎలా?
1. మీరు అధిక బరువుతో బాధపడుతుంటే వెంటనే ఆ బరువును తగ్గించుకోండి. ఎప్పుడైతే బరువు తగ్గుతుందో మెడ చుట్టూ ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. దీనివల్ల అక్కడున్న వాయు మార్గాలలో గాలి ప్రవాహం సులువుగా జరుగుతుంది. అప్పుడు గురకరావడం తగ్గుతుంది.
2. పడుకునే పొజిషన్ బట్టి గురక వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సైడ్ స్లీపింగ్ పొజిషన్‌కు మారడం మంచిది, అంటే ఎడమవైపు లేదా కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల వాయు మార్గాలు తెరిచి ఉంటాయి. కొంతమేరకు గాలి ప్రవాహం సులువుగా జరుగుతుంది.
3. నిద్రపోయేటప్పుడు మీ తలను పైకి ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. అంటే తల కింద అదనపు దిండ్లు పెట్టి తల ఎత్తుగా పెట్టుకుంటే వాయు మార్గం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల కూడా గురక ఆగుతుంది.
4. శరీరంలో డిహైడ్రేషన్ సమస్య ఉన్నా కూడా గురక వచ్చే అవకాశం ఉంది. గొంతు, ముక్కు భాగాలలో శ్లేష్మం అధికంగా చేరిపోతుంది. దీనివల్ల గురక ఎక్కువవుతుంది. కాబట్టి రోజంతా మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగినందుకు ప్రయత్నించండి.
5. రాత్రిపూట మద్యపానం చేసే వారి సంఖ్య ఎక్కువ. ఈ ఆల్కహాల్ గొంతులోని కండరాలను సంకోచించేలా చేస్తుంది. దీనివల్ల గాలి సరిగా ఆడదు. కాబట్టి నిద్ర వేళకు ముందు మద్యం సేవించడం పూర్తిగా మానేయడమే ఉత్తమం.
6. జలుబు, ఫ్లూ వంటి వాటితో బాధపడుతూ ఉంటే తగిన మందులు వేసుకోండి. శ్లేష్మం వాయు మార్గాల్లో అడ్డుపడకుండా జాగ్రత్త పడండి. గురక దాని మటుకు అది పోతుంది.