ఈ రోజుల్లో మీ ఫోన్‌లో చూస్తే ఏదో ఒక కొత్త ఆరోగ్య ట్రెండ్ కనిపిస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న పానీయాలలో ఒకటి నెయ్యి కాఫీ. పోషకాహార నిపుణుల నుండి సెలబ్రిటీల వరకు, అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. 'నెయ్యి కాఫీ' లేదా 'నెయ్యి టీ' గురించి పోస్ట్‌లు పెడుతూ, దీనిని ఆయుర్వేద నివారణిగా లేదా చిన్నప్పటి నుండి తాగుతున్న పానీయంగా పేర్కొంటున్నారు.
మీరు దీన్ని ఇప్పటివరకు ప్రయత్నించారా? లేకపోతే, బహుశా ఇప్పుడు సరైన సమయం కావచ్చు. ఈ సాధారణ పానీయం మీ మెటబాలిజంను పెంచడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి, పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నెయ్యి కాఫీ కేవలం ఒక ట్రెండీ పానీయం కంటే ఎక్కువ ఎందుకు అనేది తెలుసుకుందాం.
నెయ్యి కాఫీని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా అంటారు. ఇది బ్లాక్ కాఫీ, నెయ్యి మిశ్రమం. ఇది క్రీమీగా, చిక్కగా ఉండే పానీయం. దీనిని ఉదయం పూట తాగుతారు. కాఫీకి నెయ్యి ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వు తోడవడంతో ఇది స్థిరమైన శక్తిని అందిస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది తక్కువ కార్బ్, ఆయుర్వేద ఆహారాలలో ప్రాచుర్యం పొందింది.
కాఫీలో నెయ్యిని కలిపి ప్రతిరోజూ తాగడం వల్ల కలిగే 6 ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.
అన్ని కొవ్వులు మన ఆరోగ్యానికి చెడ్డవి కావు. "నెయ్యి ఒమేగా-3, ఒమెగా 6, ఒమెగా 9 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటుంది. ఇది విటమిన్లు A, E, మరియు K లకు సహజ వనరు. మరోవైపు కాఫీలో కెఫిన్, కాఫెస్టోల్, కహ్వియోల్, క్లోరోజెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తికి అండగా ఉంటాయి" అని పోషకాహార నిపుణురాలు విధి చావ్లా అంటున్నారు. 'ట్రెండ్స్ ఇన్ ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ'లో ప్రచురితమైన ఒక అధ్యయనం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కాఫీ ప్రయోజనాలను హైలైట్ చేస్తుంది.
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుందని మీరు నమ్ముతుంటే.. దానిని వదిలించుకోవడానికి నెయ్యితో బ్లాక్ కాఫీని ప్రయత్నించండి. నెయ్యిలో ఉండే బ్యుటిరిక్ యాసిడ్ జీర్ణక్రియకు సహాయకారిగా ఉంటుంది. ప్రేగులలో మంటను తగ్గిస్తుంది. పొట్ట ఉబ్బరంతో బాధపడేవారికి నెయ్యి కాఫీ ముఖ్యంగా సహాయపడుతుంది.
బ్లాక్ కాఫీని నెయ్యితో కలపడం వల్ల గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. నెయ్యి మంటను తగ్గించడానికి, కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. నిజానికి, 'ఓచ్స్నర్ జర్నల్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం కాఫీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించగలదని, రక్తపోటును తగ్గించగలదని, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచగలదని చూపిస్తుంది.
నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పీరియడ్ క్రాంప్స్ తీవ్రతను తగ్గించవచ్చు. "ఇది శక్తిని పెంచడానికి, ఆరోగ్యకరమైన రుతుక్రమ చక్రానికి మద్దతు ఇవ్వడానికి హార్మోన్ల సమతుల్యతను కూడా అందిస్తుంది" అని చావ్లా వివరిస్తున్నారు.
ఉదయం నెయ్యి కాఫీ తాగడం వల్ల ఆకలిని నియంత్రించవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు మీకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. కాబట్టి మీరు అనవసరంగా స్నాక్స్ తినే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకు తోడ్పడుతుంది.
కాఫీ తక్షణ శక్తిని ఇస్తుందని అంటారు. అలాగే నెయ్యిలోని కొవ్వులు కెఫిన్ శోషణను నెమ్మదిస్తాయి. మీకు నిలకడైన శక్తిని అందిస్తాయి. 'జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్'లో ఒక అధ్యయనం ఈ నిలకడైన శక్తి విడుదల కొవ్వులు, కెఫిన్ కలయిక వల్లనే అని పేర్కొంది.
ఈ బుల్లెట్ కాఫీ లేదా నెయ్యి కాఫీని రోజూ ఆనందించవచ్చు. కానీ మీరు దానిని అతిగా తీసుకోకుండా చూసుకోండి. నెయ్యిలో సంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు పెరగడం, అధిక కొలెస్ట్రాల్ లేదా అధిక కేలరీల వినియోగం జరగవచ్చు. "గుండె జబ్బులు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి" అని చావ్లా హెచ్చరిస్తున్నారు. అలాగే, రోజుకు చాలా కప్పుల కాఫీ తాగడం వల్ల మీ కెఫిన్ తీసుకోవడం పెరుగుతుంది. ఇది జీర్ణ అసౌకర్యం లేదా ఇతర సమస్యలను కలిగించవచ్చు. కాబట్టి, రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ కాఫీని నెయ్యితో తీసుకోండి.
"ఉత్తమ ఫలితాల కోసం, నెయ్యి కాఫీని ఉదయం ఖాళీ కడుపుతో తాగండి" అని చావ్లా సూచిస్తున్నారు. ఇది మీ మెటబాలిజంను ప్రారంభించడానికి, జీర్ణక్రియకు సహాయకారిగా ఉండడానికి, రోజంతా స్థిరమైన శక్తిని అందించడానికి సహాయపడుతుంది. నిజానికి, ఉదయం పూట మీ చక్కెర పానీయాలైన నారింజ రసం లేదా టీకి ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయం.