Travel Packing Tips: వెకేషన్‍కు వెళుతున్నారా? బ్యాగ్ సర్దుకునేందుకు ఈ టిప్స్ పాటిస్తే ఇబ్బందులు ఉండవు!
Travel packing Tips: ఏదైనా వేరే ప్రాంతానికి ట్రావెలింగ్ చేసేటప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకోవడం ఓ పెద్ద పనిగా ఉంటుంది. సరిగా సర్దుకోకపోతే ఏది ఎక్కడ ఉందో గుర్తించడం కష్టమవుతుంది. అందుకే లగేజ్ సర్దుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.
వెకేషన్‍కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే లగేజ్ సరిగా సర్దుకుంటే ట్రావెలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. లేకపోతే ఏది ఎక్కడ ఉందో తెలియక లగేజీలో వెతుక్కోవాల్సి వస్తుంది. కొన్ని మరిచిపోయే అవకాశం కూడా ఉంటుంది. ప్లానింగ్ సరిగా లేకపోతే ఎక్కువ బ్యాగ్‍లు కూడా తీసుకెళ్లాల్సి రావొచ్చు. కొన్ని టిప్స్ పాటిస్తే ట్రావెలింగ్ కోసం బ్యాగ్‍లు బాగా సర్దుకోవచ్చు. ప్రయాణంలో లగేజీతో పెద్దగా చిరాకు అనిపించదు. ప్యాకింగ్ కోసం ముఖ్యమైన టిప్స్ ఇవే..
చెక్‍లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి
ట్రావెల్ చేసే ముందు రోజే ఏమేం తీసుకెళ్లాలని అనుకుంటున్నారో మొత్తంగా ఓ పేపర్ మీద రాసుకోండి. బయలుదేరే ముందు అయితే ఆ హడావుడిలో అన్నీ గుర్తుకు రాకపోవచ్చు. అందుకే ముందుగానే చెక్‍లిస్ట్ తయారు చేసుకోవాలి. అవసరమైనవన్నీ అందులో రాసుకోవాలి. దీంతో ఏం తీసుకెళ్లాలో క్లారిటీ వస్తుంది. బ్యాగ్‍ల్లో వాటిని సర్దేటప్పుడు టిక్ పెట్టుకోవాలి. ఇలా అయితే తీసుకెళ్లాల్సినవి ఏమీ మరిచిపోకుండా ప్యాక్ చేసుకోవచ్చు.
ప్యాకింగ్ క్యూబ్స్, ఆర్గనైజర్లు బెస్ట్
పెద్ద బ్యాగ్‍ల్లో, సూట్‍కేసుల్లో దుస్తులు, వస్తువులు సర్దుకునేందుకు ప్యాకింగ్ క్యూబ్స్, ఆర్గనైజర్లు వినియోగించడం మేలు. వీటి వల్ల స్పేస్ కలిసి వస్తుంది. అలాగే, ఒకే రకమైన వాటిని ఒకదాంట్లో సెట్ చేసుకోవచ్చు. ఇలా వేర్వేరుగా ఉండటంతో కావాల్సినవి గుర్తించడం చాలా మేలు. దుస్తులకు ఆర్గనైజర్స్ వాడడం వల్ల నలగకుండా కూడా ఉంటాయి.
ఎలక్ట్రానిక్స్ ఒకే చోట
ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ వెతుక్కోవడం కూడా తికమకగా ఉంటుంది. అందుకే మీరు తీసుకెళ్లాలనుకుంటున్న ఛార్జర్లు, కేబుల్స్, హెడ్‍ఫోన్స్ లాంటి ఎలక్ట్రానిక్స్ అన్నీ ఒకే బ్యాక్‍లో ఒకే లేయర్‌లో ఉంచండి. దీనివల్ల అన్నీ ఒకే చోట ఉండి కావాల్సినది సులభంగా దొరుకుతుంది. ఎక్కడ ఉన్నాయో సులభంగా గుర్తుకు వస్తాయి. ల్యాప్‍టాప్ తీసుకెళితే దానికి ప్రత్యేకంగా బ్యాగ్ ఉంటే సురక్షితంగా ఉంటుంది.
మడత కాకుండా.. రోల్
దుస్తులను మడత పెట్టుకుండా.. రోల్ చేస్తే బ్యాగ్‍లు స్పేస్ తక్కువగా తీసుకుంటాయి. ఎక్కువగా దుస్తులు సర్దుకోవచ్చు. అలాగే మరీ ఎక్కువగా మడతలు పడవు.
అదనంగా ప్లాస్టిక్ కవర్స్
మీరు ఎక్కువ రోజులు ప్రయాణానికి వెళుతుంటే బ్యాగ్‍లతో పాటు అదనంగా కొన్ని ప్లాస్టిక్ కవర్స్ తీసుకెళ్లండి. మీరు వేసుకొని విడిచిన దుస్తువు ఈ కవర్లలో వేసుకోవాలి. ఇలా చేస్తే ఉతికిన దుస్తుల్లో కలవకుండా ఉంటాయి. ఇంటికొచ్చాక కూడా ఏవి విడిచిన దుస్తులు ఏవో సులువుగా కనుక్కోవచ్చు.
విభిన్న రకాల బ్యాగ్స్
మీరు లగేజ్‍కు ఏ రకమైన బ్యాగ్స్ సరిపోతాయో అవి తీసుకోవాలి. ఒకవేళ లాంగ్ టూర్ అయితే విభిన్న రకాల బ్యాగ్స్ ఉండాలి. సూట్ కేస్‍లు తీసుకెళుతుంటే.. ఒక బ్యాక్‍ప్యాక్ కూడా వెంట ఉంటే బాగుంటుంది. వెళ్లిన ప్రాంతంలో బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు చిన్న బ్యాక్‍ప్యాక్స్ తీసుకెళ్లడం సులువుగా ఉంటుంది.
బరువైనవి కింద..
బ్యాగ్‍ల్లో బరువువైన వస్తువులు కింది భాగంలో సర్దుకోవాలి. ఇలా చేస్తే బ్యాగ్ తడబడి ముందుకు పడకుండా ఉంటుంది. స్టిఫ్‍గా ఉంటుంది. తీసుకెళ్లేందుకు అనుకూలంగా అనిపిస్తుంది. ఈ ప్యాకింగ్ టిప్స్ పాటిస్తే లగేజీ విషయంలో పెద్దగా చిక్కులు ఉండవు.
టాపిక్