Parenting Tips: పిల్లలపై కోపం చూపించడం కరెక్టేనా? తరచూ కోప్పడటం వారిని ఎలా మారుస్తుంది?
Parenting Tips: పిల్లలు అల్లరి చేస్తుంటేనే సరదాగా ఉంటుంది. కానీ, అది హద్దు మీరితే వయస్సు పెరిగే కొద్దీ ఆకతాయితనంగా మారిపోతుంది. మరి అలాంటప్పుడు పిల్లలపై కోపపడి అదుపులో పెట్టడం కరెక్టేనా..! ఎప్పుడు కోప్పడాలి, తరచూ కోప్పడటం వల్ల ఎటువంటి పర్యావసనాలు ఉంటాయో తెలుసుకుందాం రండి.
రోజువారీ జీవితంలో మనం అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటాం. ఇంటికి రాగానే అల్లరి చేస్తూ కనిపించే పిల్లలు విసుగు తెప్పిస్తున్నారని కసురుకుంటాం. కొన్ని సార్లు నియంత్రణ కోల్పోయి కొట్టేస్తాం కూడా.ఇలా పిల్లలపై కోపపడి అదుపులో పెట్టాలనుకోవడం కరెక్టేనా..! ఎప్పుడు కోప్పడాలి, తరచూ కోప్పడటం వల్ల ఎటువంటి పర్యావసనాలు ఎదురవుతాయి మీకు తెలుసా?
పిల్లలపై కోప్పడటం అనేది సరైనది కాదని, చాలా స్టడీలు, అధ్యయనాలతో పాటు మానసిక వైద్య నిపుణులు చెప్పేమాట.ఇలా చేయడం అనేది వారి సున్నితమైన మనస్సుపై బలమైన ప్రభావం కనిపిస్తుందట. మానసిక ఎదుగుదల ఆగిపోవడం కొందరిలో కనిపించే లోపమైతే, మరికొందరికి మానసికంగా కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆటంకంగా మారిపోతుందట. ఇవే కాకుండా పిల్లలపై కోప్పడటం వల్ల మరికొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటో చూద్దాం.
భయభయంగా మారడం:
పిల్లలపై తరచూ కోపాన్ని చూపిస్తున్నప్పుడు, వారు భయపడి అలగడం, కొద్ది రోజుల తర్వాత ఒంటరితనం అలవాటు చేసుకోవచ్చు. చెప్పిన పని చేయలేకపోతున్నారని కించపరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల తమకు తాముగా చేతగానివారిగా భావిస్తుంటారు. ఫలితంగా చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం క్షీణిస్తుంది.
సంబంధాలు నచ్చకపోవడం:
ఇది సాధారణంగా కనిపించే విషయమే. కానీ, ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. పిల్లలను ఎక్కువగా కోప్పడుతూ ఉంటే, వారు మీతో ఉండటానికి ఇష్టపడకపోవచ్చు. తరచూ మీకు ప్రత్యామ్నాయం వెదుకుకునే అవకాశాలు ఉన్నాయి కూడా. కోపం చూపించి తర్వాత ఎంత లాలించినా వారి మనస్సులో కోపగించుకున్న సందర్భాలే నాటుకుపోయి ఉంటాయనే సంగతి మర్చిపోకండి.
నేర్చుకోలేకపోవడం:
మీ పిల్లలను అవమానాలకు గురి చేయడం, తరచూ గేలి చేయడం వల్ల వారు మీరు చెప్పినవి నిజంగా నేర్చుకోకుండా వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. కాలంతో పాటు వాటిని చేయొద్దని మీరు వారిస్తున్నప్పటికీ, అదే నిర్ణయాన్ని బలంగా నమ్మి పెడదోవ పట్టే అవకాశాలు ఉన్నాయి.
ఎమోషనల్ ఇంపాక్ట్:
మీరు చూపించే కోపం వల్ల పిల్లల మీద ఎమోషనల్‌గా ప్రభావం పడుతుంది. వారిలో ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి ఎమోషనల్ ఫీలింగ్స్ కు చిన్ననాటి నుంచే బీజం పడుతుంది.
పిల్లల ప్రవర్తనలో మార్పు:
చిన్న పిల్లలు ఎక్కువగా చుట్టూ ఉండే పరిసరాల్లోని విషయాలనే నేర్చుకుంటూ ఉంటారు. రెగ్యులర్‌గా మిమ్మల్ని కోపంతో చూసే వారు మీలా కాకుండా ఇంకొకరిలా ప్రవర్తించరు. పూర్తిగా వారి ప్రవర్తనలో మార్పు తెస్తుంది.
కాబట్టి, పిల్లలతో సహనం, ప్రేమతో ప్రవర్తించడం ముఖ్యమైంది. వారి తప్పులను సరి చేయడానికి కొన్ని టిప్స్ పాటించండి. మీ చిన్నారులను భవిష్యత్ కోపిష్టులుగా మార్చకండి.
అల్లరి చేసే పిల్లలను ఎలా అదుపు చేయాలి:
శాంతంగా ఉండండి:
పిల్లల్లో అల్లరి పెరిగితే, కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. వయస్సుతో పాటు పెరిగే శక్తి స్థాయిలు మూలంగా వారిలో యాక్టివ్ నెస్ కొంచెంకొంచెంగా పెరుగుతూ వస్తుంది. దానికి తగ్గట్లుగా వారికి యాక్టివిటీస్ పెంచండి. అంతేకానీ, వారితో సమానంగా కోపంతో ప్రతిస్పందించడం వలన పరిస్థితి అదుపులో రాదు.
స్పష్టమైన నియమాలు:
అల్లరి చేయడం వల్ల వారు ఎదుర్కొనే పరిస్థితులను వివరంగా కుదిరితే కళ్లకు కట్టినట్లుగా చూపించండి. "ఇది చేయకు, ఈ పని చెయ్యడం వల్ల ఇలా జరుగుతుంది" అని స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం. ఫలితాలను ముందుగా తెలుసుకోవడం వల్ల వారికి పరిస్థితి అర్థం అయి చేయకుండా ఉంటారు.
నైతికతతో ప్రవర్తించండి:
పిల్లలు మంచిగా ప్రవర్తిస్తే , వారిని ప్రశంసించండి. అలా చేయడం వల్ల వారిలో మంచి ప్రవర్తన పట్ల ఆకర్షణ ఎక్కువవుతుంది. క్రమంగా చెడు/అల్లరి పనులు చేయాలనిపించినా వారికి వారుగా దారి మళ్లిపోతారు.
ప్రత్యామ్నాయం చూపించండి:
అల్లరి చేసే సమయంలో కాస్త ఓర్పుగా ఉండండి. కొత్తగా ఆలోచించి వారి అల్లరికి సరిపడే స్థాయిలో ఉండే పనిని లేదా ఆటను ఎంచుకోమని చెప్పండి. ఇది వాళ్ళు ఇతర పద్ధతులు ప్రయత్నించేలా చేస్తుంది.
ప్రతిఫలాలు ఉండాలి:
అల్లరి పెరిగితే, సరైన చర్యలు తీసుకోవాలి. కానీ ఆ చర్యలు మృదువుగా ఉండాలి. శిక్షలు కంటే, ఆ పనికి సరిపోయే ప్రతిఫలాలు చెప్పడం మంచిది. పిల్లలకు విధించే శిక్ష కూడా ప్రయోజనకరంగా ఉండాలి. పిల్లలతో సహనంగా ఉండి, నెమ్మదిగా వారిని నేర్పిస్తే, వారు అల్లరి చేయడం తగ్గిస్తారు.
సంబంధిత కథనం