Tomato Pickle: ఎండతో పనిలేకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేలా టమోటో నిల్వ పచ్చడి ఇలా చేసేయండి, చూస్తేనే నోరూరిపోతుంది
Tomato Pickle: టమాటో నిల్వ పచ్చడి చేయాలంటే ఎర్రటి ఎండలో టమోటా ముక్కలు ఆరబెట్టాలని అనుకుంటారు. నిజానికి ఎండతో పని లేకుండా టమోటో నిల్వ పచ్చడి చేసేయొచ్చు. రెసిపీ ఇదిగో.
టమోటో ధరలు తగ్గినప్పుడే టమాటో పచ్చడిలో చేసుకుని నిల్వ చేసుకుంటే మంచిది. ఇక్కడ మేము ఎండతో పని లేకుండా ఎక్కువకాలం నిల్వ ఉండేలా టమోటో నిల్వ పచ్చడి రెసిపీ ఇచ్చాము. ఇలా చేశారంటే ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. మీకు స్పైసీగా టమోటా పచ్చడి కావాలనుకుంటే ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. రుచి అదిరిపోతుంది. ఈ పద్ధతిలో చేసుకుంటే కనీసం రెండు మూడు నెలల పాటు ఇది తాజాగా ఉంటుంది.

టమాటో నిల్వ పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
టమోటాలు - కిలో
ఉప్పు - 50 గ్రాములు
పసుపు - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - 30
మెంతి పొడి - ఒక స్పూను
ఆవాల పొడి - రెండు స్పూన్లు
నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె - మూడు కప్పులు
పచ్చిశనగపప్పు - రెండు స్పూన్లు
ఆవాలు - రెండు స్పూన్లు
ఎండుమిర్చి - ఐదు
కరివేపాకులు - గుప్పెడు
కారం - రెండు కప్పులు
మినపప్పు - రెండు స్పూను
టమోటో నిల్వ పచ్చడి రెసిపీ
1. టమాటోలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి ఈ టమోటో ముక్కలను వేయాలి.
3. ఆ టమోటోలోనే చింతపండును కూడా వేసి మూత పెట్టి ఉడికించాలి.
4. అర స్పూన్ ఉప్పును కూడా వేస్తే టమోటాలు త్వరగా ఉడుకుతాయి.
5. ఈ మిశ్రమం అంతా మెత్తగా ఇగురులాగా అయ్యే వరకు ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.
6. ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఈ మొత్తం మిశ్రమాన్ని వేయాలి.
7. ఈ టమోటా మిశ్రమంలోనే కారం, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, మెంతి పొడి, ఆవాల పొడి వేసి బాగా కలిపి ఒకసారి మిక్సీ మీద వేసి తిప్పాలి.
8. అందులోనే ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మూడు కప్పుల నూనెను వేయాలి.
9. ఆ నూనెలోనే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పది వెల్లుల్లి రెబ్బలు, గుప్పెడు కరివేపాకులు వేసి వేయించాలి.
10. అందులో మిక్సీలో రుబ్బుకున్న పచ్చడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
11. దీన్ని బాగా చల్లారాక గాలి చొరబడని డబ్బాలోకి మార్చి నిల్వ చేసుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. ఈ పచ్చడి మీకు నచ్చడం ఖాయం.
మీకు స్పైసీగా కావాలనుకుంటే కారాన్ని అధికంగా వేసుకుంటే సరిపోతుంది. ఈ టమాటో పచ్చడిని టమోటా ధరలు తక్కువగా ఉన్నప్పుడే చేసుకొని చూడండి. ప్రస్తుతం టమోటో ధరలు బాగా దిగి వచ్చాయి. కాబట్టి ఈ టమోటా నిల్వ పచ్చడిని చేయడం ద్వారా మీరు ప్రతిరోజు టమోటో రెసిపీలను తినవచ్చు. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో టమోటో చట్నీ చేస్తే వేడి వేడి అన్నంలో ఆ చట్నీ కలుపుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు దోశ, ఇడ్లీల్లోకి కూడా ఈ చట్నీ బాగుంటుంది.