Tomato Masala Curry: చపాతీ రైస్ పులావ్‌లోకి అదిరిపోయే టమోటో మసాలా కర్రీ రెసిపీ, దీన్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది
Tomato Masala Curry: టమోటో మసాలా కర్రీ ఇక్కడ చెప్పినట్టు వండుకుంటే అన్నంలో తిన్నా, పులావ్‌లో తిన్నా, చపాతీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. రెసిపీ తెలుసుకోండి.
ప్లెయిన్ బిర్యానీ, చపాతీ, పులావ్, అన్నం... ఇలా దేనిలోకి తిన్నా కూడా అదిరిపోయే కర్రీ టమాటో మసాలా కర్రీ. ఇలా వండారంటే రుచి అదిరిపోతుంది. దీని వండుతున్నప్పుడే నోరూరిపోతుంది. వేడివేడిగా రైస్ లో కలుపుకొని తింటే ఆ రుచితో మిర్చి కా సాలన్ కి బదులు టమోటో మసాలా కర్రీ వండుకొని చూడండి. కచ్చితంగా కాంబినేషన్ అదిరిపోతుంది. పైగా ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే. సింపుల్ గా ఈ టమోటో మసాలా కర్రీ ఎలా వండుకోవాలో తెలుసుకోండి.
టమోటో మసాలా కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు
టమోటోలు - నాలుగు
వేరుశెనగ పలుకులు - రెండు స్పూన్లు
కొబ్బరి ముక్కలు - ఒక స్పూను
ధనియాలు - ఒక స్పూను
లవంగాలు - నాలుగు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
యాలకులు - మూడు
జీలకర్ర - అర స్పూను
మెంతులు - పావు స్పూను
మిరియాలు - అర స్పూను
తెల్ల నువ్వులు - ఒక స్పూను
కసూరి మేతి - ఒక స్పూను
ఉల్లిపాయలు - రెండు
నూనె - రెండు స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
కారం - ఒక స్పూను
పసుపు - అర స్పూను
పచ్చిమిర్చి - నాలుగు
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
చింత పండు - ఉసిరికాయ సైజులో
టమాటో మసాలా కర్రీ రెసిపీ
1. టమాటో మసాలా కర్రీ వండడానికి ముందుగా మసాలా పేస్ట్ ను రెడీ చేసుకోవాలి.
2. ఇందుకోసం స్టవ్ మీద కళాయి పెట్టి వేరుశెనగ పలుకులు వేసి వేయించాలి.
3. అవి వేగాక అందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, నువ్వులు, కసూరి మేతి వేసి వేయించుకోవాలి.
4. వాటిని మిక్సీలో వేసి తగినంత నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు టమాటాలను పెద్ద ముక్కలుగా కోసుకోవాలి.
6. ఫోర్క్ తోనే టమోటాలపై దానిమీద పొడిచి రంధ్రాలు పెట్టుకోవాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
8. ఆ నూనెలో ఉల్లిపాయ తరుగును వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి.
9. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
10. కరివేపాకులను, పచ్చిమిర్చిని కూడా వేసి వేయించాలి.
11. అందులోనే ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను వేసి బాగా కలుపుకోవాలి.
12. కాసేపు వేగాక అందులో పసుపు, కారం వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
13. ఆ మిశ్రమంలో నీటిని వేసి బాగా కలపాలి. చింతపండు నువ్వు నానబెట్టి ఆ నీటిని కూడా వేయాలి.
14. ఈ మొత్తం మిశ్రమం మరుగుతున్నప్పుడు పెద్దగా కోసుకున్న టమాటా ముక్కలను వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి.
15. ఇది ఇగురులాగా అయ్యే వరకు చిన్న మంట మీద ఉడికించాలి.
16. నూనె పైకి తేలితే అది ఉడికిపోయినట్టే. అప్పుడు పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
17. అంతే టేస్టీ టమోటో మసాలా కర్రీ రెడీ అయినట్టే. దీన్ని తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. మీరు దేనితో జతగా తిన్నా కూడా రుచి అదిరిపోతుంది. మేం చెప్పిన విధానంలో ఒకసారి వండి చూడండి. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది.
టమోటోలు ప్రతిరోజూ తిన్నా వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని అధ్యయనాలు కూడా చెప్పాయి. కాబట్టి ప్రతిరోజూ టమోటాలను ఆహారంలో ఎలాగోలా భాగం చేసుకోండి. టమోటోలో ఉండే లైకోపీన్ మన శరీరాన్ని కాపాడుతుంది. టమోటో మసాలా కర్రీ లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పదార్థాలు వేసాము. అవన్నీ కూడా తగినన్ని పోషకాలను శరీరానికి అందిస్తాయి. పైగా ఇది చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి దీన్ని తిని చూడండి. మీకే తెలుస్తుంది ఎంత అద్భుతంగా ఉంటుందో. దీన్ని చపాతీతో, పూరీతో, ఇడ్లీతో, ప్లెయిన్ రైస్ తో, బిర్యానితో దేనితో తిన్న చాలా టేస్టీగా ఉంటుంది.