Tomato ka Salan: అన్నంలోకి, బిర్యానీలోకి ఇలా టమాటా కా సాలన్ చేసేయండి, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇది వండుకోవడం సులువు
Tomato ka Salan: మిర్చి కా సాలన్ పేరు వినే ఉంటారు. బిర్యానీతో పాటు మిర్చి కా సాలన్ ఇస్తారు. అలాగే టమాటా కా సాలన్ కూడా వండవచ్చు. అన్నంలోకి, బిర్యానీలోకి అదిరిపోతుంది.

టమాటాలతో చేసే మరొక ఇగురు రెసిపీ టమాటా కా సాలన్. బిర్యానీలతో మిర్చి కా సాలన్ జోడీగా ఇస్తారు. అలాగే టమాటాలతో కూడా టమాటా కా సాలన్ రెసిపీ చేయవచ్చు. దీన్ని అన్నంలోని, బిర్యానీలోని, పులావ్ లోని తినవచ్చు. ఒకసారి మేము చేసిన పద్ధతిలో వండి చూడండి. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. టమాట కా సాలన్ చేయడం కూడా చాలా సులువు. కేవలం 20 నిమిషాల్లోనే ఇది రెడీ అయిపోతుంది.
టమాటా కా సాలన్ రెసిపీకి కావలసిన పదార్థాలు
టమాటాలు - నాలుగు
వేరుశెనగ పలుకులు - మూడు స్పూన్లు
ధనియాలు - ఒక స్పూను
నువ్వులు - మూడు స్పూన్లు
కొబ్బరి పొడి - మూడు స్పూన్లు
యాలకులు - రెండు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - నాలుగు
చింతపండు - ఉసిరికాయ సైజులో
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - మూడు స్పూన్లు
పసుపు - అర స్పూను
ఆవాలు - ఒక స్పూను
జీలకర్ర - అర స్పూను
మెంతులు - పావు స్పూను
ఉల్లిపాయ - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
కారం - ఒక స్పూను
పచ్చిమిర్చి - మూడు
కరివేపాకులు - గుప్పెడు
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
టమాట కా సాలన్ రెసిపీ
1. స్పైసీగా టమాటా కా సాలన్ చేసేందుకు టమాటాలను శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలుగా కోసుకోవాలి.
2. ఇందులో పెద్ద పెద్ద ముక్కలనే వేయాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి పల్లీలు, ధనియాలు, నువ్వులు వేయించాలి.
4. తర్వాత అందులోనే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి.
5. ఇవన్నీ వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. చింతపండును అర గ్లాసు నీళ్లలో నానబెట్టుకోవాలి.
6. ఇప్పుడు మిక్సీలో వేయించిన పల్లీల మిశ్రమాన్ని చింతపండు గుజ్జును వేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
8. ఆ నూనెలో టమోటో ముక్కలను వేసి వేయించి ఆ ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి.
9. ఆ మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
10. అవి వేగాక ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసి బాగా రంగు మారేవరకు వేయించుకోవాలి.
11. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి వేయించాలి.
12. ఆ తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
13. ఈ పల్లీల మిశ్రమం బాగా కలిసాక పసుపు, కారం వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి పైన మూత పెట్టి బాగా ఉడికించాలి.
14. తర్వాత మూత తీసి నిలువుగా కోసిన పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకులు వేసి చిన్న మంట మీద ఉడికించుకోవాలి.
15. ఇది బాగా ఉడుకుతున్నప్పుడు చింతపండు నీళ్లను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
16. ఈ మొత్తం మిశ్రమం నూనె తేలే వరకు వేయించాలి.
17. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నా టమోటోలను వేసి మరొక పది నిమిషాలు పాటు చిన్న మంట మీద ఉడికించాలి.
18. తర్వాత మూత తీసి పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.
19. అంతే టేస్టీ టమాటా కా సాలన్ రెడీ అయినట్టే. దీని రుచి అద్భుతంగా ఉంటుంది.
20. వేడివేడి అన్నంలో కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది. పులావ్ బిర్యానీ తో కూడా అదిరిపోతుంది.
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా టమాటో కా సాలన్ చేసి చూడండి. నాలుగు టమాటాలు ఉంటే చాలు ఈ కూర రెడీ అయిపోతుంది. అన్నంలోనూ, ఇడ్లీలోనూ, దోశలోనూ చివరికి చపాతీలో కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. కొంతమంది టమాటాలను పెద్ద ముక్కలుగా కోసుకుంటారు. ఒక్కో టమాటాలను రెండు ముక్కలు మాత్రమే కోసి ఈ ఇగురులో వేసుకుంటారు. ఇలా చేసుకున్నా కూడా ఈ కూర టేస్టీగా ఉంటుంది.
సంబంధిత కథనం