Tomato Juice: టమోటో రసంతో రాలిపోయిన జుట్టును తిరిగి పెంచుకోవచ్చు, ఇలా ఉపయోగించండి
Tomato Juice: జుట్టు రాలే సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే టమోటో రసాన్ని ఇలా ఉపయోగించండి. ఇది మీకు వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతూ ఉంటే టమోటో రసంతో జుట్టును తిరిగి పెరిగేలా చేసుకోవచ్చు. టమాటో జ్యూస్ కు జుట్టు తిరిగి పెరగడానికి ప్రోత్సహించే సామర్థ్యం ఉంది. టమోటోలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలకు పోషణను అందిస్తాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఊడిపోతున్న జుట్టు ప్రదేశంలో తిరిగి వెంట్రుకలు మొలిచేలా చేస్తాయి. దీనికోసం టమోటో రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
టమోటా రసంతో జుట్టు పెరుగుదల
టమోటో రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. జుట్టు పెరుగుదలకు అత్యవసరమైన ప్రోటీన్ కొలాజెన్ ను ఇది అందిస్తుంది. అలాగే టమాటోలో ఉండే లైకోపీన్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని అడ్డుకుంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అలాగే టమాటోలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది సెబమ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆరోగ్యకరంగా జుట్టు పెరిగేలా చేస్తుంది. అలాగే టమాటో లో ఉండే బయోటిన్, జింక్ వంటివి జుట్టు బలాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి పలుచబడకుండా తిరిగి పెరిగేలా చేస్తాయి. టమోటోల్లో సహజమైన ఆమ్లాలు ఉంటాయి. ఇవి మాడు పీహెచ్ బ్యాలెన్స్ నిర్వహించడానికి ఉపయోగపడతాయి. చుండ్రును తగ్గించి జుట్టు తిరిగి పెరగడానికి అనుకూలమైన వాతావరణం సృష్టిస్తాయి.
టమోటో జ్యూస్ తో ఇలా మసాజ్
టమోటాలను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. వాటిని ఒక క్లాత్ లో వేసి పిండితే రసం బయటికి వస్తుంది. ఈ రసాన్ని ఒక చిన్న గిన్నెలో వేయాలి. ఈ రసాన్ని నేరుగా మీ జుట్టుకు పట్టించండి. సున్నితమైన వేళ్ళతో వృత్తాకారంగా మసాజ్ చేస్తూ ఉండండి. ఒక అరగంట పాటు అలా వదిలేసి గోరు వెచ్చని నీటితో... తేలికపాటి షాంపుతో మీ జుట్టును వాష్ చేసుకోండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మీకు జుట్టు పెరిగే అవకాశం పెరుగుతుంది.
టమోటా అలోవెరా హెయిర్ మాస్క్
టమోటో రసాన్ని కలబందతో కలిపి రాయడం వల్ల కూడా మంచి ప్రభావం పడుతుంది. టమోటో రసాన్ని రెండు టేబుల్ స్పూన్లు తీసుకోండి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కలపండి. ఇది పేస్ట్ లాగా అవుతుంది. ఈ మెత్తని పేస్ట్‌ను జుట్టుకు బాగా పట్టించండి. 45 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రం చేసుకోండి. కలబంద నెత్తి మీద ఉన్న చర్మాన్ని శుభ్రం చేసి ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. జుట్టు తిరిగి పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.
టమోటో జ్యూస్ కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. టమోటో రసంలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ రెండు కలిపి తలకు పట్టించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇందుకోసం మీరు రెండు టేబుల్ స్పూన్ల టమాటో రసం తీసుకుని చిన్న గిన్నెలో వేయండి. ఇప్పుడు కొబ్బరి నూనె ఒక స్పూన్ తీసుకొని కాస్త గోరువెచ్చగా చేయండి. ఈ రెండింటిని కలిపి మీ తలపై ఉన్న మాడుకు పట్టించండి. రాత్రంతా అలా వదిలేయండి. మరుసటి రోజు ఉదయం తలకు స్నానం చేసి శుభ్రం చేసుకోండి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
టమోటో జ్యూస్ ఉల్లిపాయ రసం మాస్క్
టమోటో రసాన్ని ఒక టేబుల్ స్పూన్ సేకరించండి. అలాగే ఉల్లిపాయ రసం కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. ఈ రెండింటినీ బాగా కలిపి మీ తలపై ఉన్న మాడుకు పట్టించండి. అరగంట పాటు అలా వదిలేయండి. తర్వాత తేలికపాటి షాంపుతో శుభ్రం చేసుకోండి. ఈ రెండూ కలిసి మీ తలపై రక్తప్రసరణను పెంచుతాయి. జుట్టుకుదుళ్లకు పోషణను అందిస్తాయి. జుట్టు మీకు పెరిగేలా చేస్తాయి.
టమోటో జ్యూస్ ను తలకి అప్పుడప్పుడు పట్టించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఐరన్, బయోటిన్, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తాయి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)