Mexican Rice Recipe : మెక్సికన్ రైస్.. ఫటా ఫట్ చేసేయండి.. కమ్మగా లాగించేయండి
Mexican Rice Recipe : కొన్నిసార్లు ఏం వండుకోవాలో అర్థంకాదు. అలాంటి సమయంలో మెక్సికన్ రైస్ చేయండి. చాలా ఈజీగా చేసేయెుచ్చు. ఎలా చేయాలో తెలుసుకుందాం..
కొన్నిసార్లు ఆఫీసుకు వెళ్లే హడావుడిలో ఏం చేయాలో తెలియదు. ఇక ఈరోజుకు బయట తినేద్దాంలే అనుకుంటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంలోకి ఉపయోగపడే వంట చేసుకుంటే అయిపోతుంది. ఇంట్లో మధ్యాహ్నం పూట కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే.. మెక్సికన్ రైస్ చేయండి. టైమ్ ఎక్కువగా తీసుకోదు. ఈ రోజు మేం మీ కోసం మెక్సికన్ రైస్ వంటకాన్ని(Mexican Rice Recipe) ఎలా చేయాలో చెబుతాం.. ఇది తినడానికి చాలా రుచికరమైనది, చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు
ముందుగా ఏం చేయాలంటే.. ఒకటిన్నర కప్పు బాస్మతి రైస్, తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లిపాయ, తరిగిన క్యాప్సికమ్, కరివేపాకు, టొమాటో సాస్, కారం పొడి, జీలకర్ర, ఎండు మిరపకాయలు రెండు, టమోటా సాస్, ఉడికించిన స్వీట్ కార్న్, రెండున్నర కప్పుల నీరు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర, నూనె కొంచెం, రుచికి సరిపడా ఉప్పు.
బియ్యాన్ని బాగా కడిగి నీటిలో అరగంట నానబెట్టాలి. బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర, వెల్లుల్లి వేయించాలి. వెల్లుల్లి కొద్దిగా వేయించిన తర్వాత తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయను కాసేపు వేయించిన తర్వాత, బియ్యా్న్ని నీటి నుంచి తీసి.. బాణలిలో పోయాలి.
బియ్యాన్ని కొన్ని నిమిషాలు పాటు అందులో ఉంచాలి. తర్వాత తరిగిన క్యాప్సికమ్, కరివేపాకు, టొమాటో సాస్, రుచికి ఉప్పు, కారం ఇలా మిగిలిన పదార్థాలు వేసుకోవాలి. అన్ని పదార్థాలను బాగా కలపాలి. కొంత సమయం అలానే ఉంచాలి. తర్వాత నీరు పోయాలి. మీడియం మంట మీద ఐదు నిమిషాలు ఉడికించాలి. మూత పెట్టాలి.
ఐదు నిమిషాల తర్వాత ఉడికించిన మొక్కజొన్న, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. తర్వాత మూతపెట్టి తక్కువ మంట మీద మరో 5-6 నిమిషాలు ఉడికించాలి. కొన్ని నిమిషాల తర్వాత మూత తెరిచి మళ్లీ షేక్ చేయాలి. అవసరమైతే మీరు కొంచెం ఎక్కువ నీరు పోసుకోవచ్చు. అన్నం బాగా ఉడికి నీరు ఆరిపోయాక తీసేయాలి. అంతే వేడి వేడి మెక్సికన్ రైస్ ఆస్వాదించండి.