Masala Idli Recipe : అల్పాహారంలోకి మసాలా ఇడ్లీని తయారు చేయడం ఎలా?-today breakfast recipe how to prepare masala idli in simple way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Breakfast Recipe How To Prepare Masala Idli In Simple Way

Masala Idli Recipe : అల్పాహారంలోకి మసాలా ఇడ్లీని తయారు చేయడం ఎలా?

Anand Sai HT Telugu
Mar 26, 2024 06:30 AM IST

Masala Idli Recipe : ఇడ్లీని ఎప్పుడూ ఒకే రకంగా తింటే బోర్ కొడుతుంది కదా? అందుకే ఒకసారి కొత్తగా మసాలా ఇడ్లీ ట్రై చేయండి. రుచి కొత్తగా ఉంటుంది.

మసాలా ఇడ్లీ
మసాలా ఇడ్లీ

భారతదేశంలో అల్పాహారంలో ఇడ్లీకి ఉన్న స్థానం వేరు. చాలా మంది ఉదయంపూట ఇడ్లీ తినేందుకే ఇష్టపడుతారు. అయితే మీరు ఎప్పుడూ ఒకేలాగా ఇడ్లీ తింటే కొత్తగా ట్రై చేయండి. మసాలా ఇడ్లీని తయారు చేయండి. నేరుగా ఇడ్లీలు చేసుకుని ఇది తయారు చేయవచ్చు. లేదంటే రాత్రి ఇడ్లీ చేసుకుని మిగిలిపోయినా ఈ రెసిపీ ప్రిపేర్ చేయెుచ్చు. అయితే ఇడ్లీతో మసాలా ఇడ్లీ ఎలా చేయాలో తెలుసుకుందాం.. ఈ మసాలా ఇడ్లీ సరైన అల్పాహారం మాత్రమే కాదు, తయారు చేయడం కూడా సులభం. పిల్లలు కూడా దీన్ని ఇష్టపడతారు. మసాలా ఇడ్లీ రెసిపీ కింది విధంగా చేయాలి..

మసాలా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు

ఇడ్లీ - 6, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ - 1/2 కప్పు, కారం - 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి - 5, టమోటో - 1 కప్పు, ఉప్పు - రుచి ప్రకారం, పసుపు పొడి - 1/2 tsp, మిరియాల పొడి - 1/2 tsp, పావ్ భాజీ మసాలా - 1/2 tsp, నిమ్మరసం - 1/2 tsp

మసాలా ఇడ్లీ తయారీ విధానం

ముందుగా ఇడ్లీలను కట్ చేసి విడిగా పెట్టుకోవాలి.

తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయలు, మిరపకాయలు వేసి వేయించి, పైన ఉప్పు చల్లి ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించాలి.

పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 30 సెకన్లు వేయించాలి.

తర్వాత అందులో టొమాటోలు వేసి మెత్తగా వేయించాలి.

టొమాటోలు బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలపాలి. ఉప్పు, కారం, పసుపు, పావ్ భాజీ మసాలా రుచికి తగినట్లుగా వేసి 1 నిమిషం పాటు వేయించాలి.

తర్వాత ఇడ్లీ ముక్కలను వేసుకోవాలి. మసాలాలు బాగా కలిసే వరకు ఇడ్లీలో మెల్లగా తిప్పాలి. పైన నిమ్మరసం, కొత్తిమీర చల్లితే రుచికరమైన మసాలా ఇడ్లీ రెడీ. ఇక ఎంజాయ్ చేస్తూ.. లాగించేయడమే.