తిన్నది పూర్తిగా అరిగితేనే అందులోని పోషకాలు మన శరీరానికి చేరుతాయి. తిన్న ఆహారం అరగకపోతే పొట్ట అసౌకర్యంగా ఉంటుంది. అజీర్తి సమస్య ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది. అజీర్తితో, అజీర్ణంతో బాధపడే వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇలాంటివారు ప్రతిరోజు కాసేపు హలాసనం వేయడానికి ప్రయత్నించాలి. యోగాలోను హలాసనం ఒక ముఖ్యమైన భంగిమ.
హలాసనం వేయడం వల్ల పొట్ట, పేగు ప్రాంతాలకు మసాజ్ చేసినంత ఫలితం దక్కుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సజావుగా జీర్ణం అవుతుంది. మలబద్ధకం అంటే సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి ఎవరైతే తిన్నది అరగక ఇబ్బంది పడుతున్నారో వారు హలాసనం వేయడం అలవాటు చేసుకోవాలి.
అజీర్తి సమస్యను తీర్చడమే కాదు... హలాసనం వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణవ్యవస్థలో రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా ఈ హలాసనం ప్రేరేపిస్తుంది. అలాగే వెన్నెముక, వీపు కండరాలను కూడా ఇది బలపరుస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచి మధుమేహం రాకుండా అడ్డుకుంటుంది. డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు హలాసనం వేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
హలాసనం ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. మంచిగా నిద్ర పట్టేలా చేస్తుంది. ఎవరైతే మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు హలాసనం వేయడం అన్ని విధాల మంచిది. ఇది కండరాల ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కళ్ళ ఆరోగ్యానికి కూడా హలాసనం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. అలాంటి వారు కూడా హలాసనం వేయడం వల్ల నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా వరకు తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా హలాసనం ప్రయత్నించాలి.
ప్రతిరోజు మూడు నుంచి నాలుగు నిమిషాలు హలాసనం వేసేందుకు ప్రయత్నించండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. సీజనల్ గా వచ్చే అంటువ్యాధులు అడ్డుకోవాలంటే రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా హలాసనం మేలు చేస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని థైరాయిడ్ గ్రంథికి సవ్యంగా జరిగేలా చేస్తుంది. దీనివల్ల జీవక్రియ హార్మోన్ల సమతుల్యత కూడా మెరుగుపడుతుంది. హలాసనం వేసినప్పుడు మీ వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి.
హలం అంటే నాగలి. హలాసనం అంటే నాగలి ఆకారంలో ఆసనం చేయడం. ఇది వేయడానికి ముందుగా మీరు కింద పడుకోవాలి. వీపు నేలకు అనేలా పడుకోవాలి. చేతులు నిటారుగా నేలపై ఉంచాలి. ఇప్పుడు మెల్లగా చిత్రంలో చూపించినట్టు కాళ్ల నుంచి నడుము వరకు పైకెత్తి పాదాలను తలవైపుగా నేలకు తాకేలా ఉంచాలి. రెండు చేతులను వీపు దగ్గర ఒకదానితో ఒకటి కలిపి పట్టుకోవాలి. ఇలా కొన్ని సెకన్ల పాటు ఉండి మరల సాధారణ నిద్ర స్థితికి రావాలి. ఇలా మూడు నాలుగు నిమిషాల పాటు ఈ హలాసనాన్ని ప్రయత్నించాలి. ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేసే ఆసనం.