జుట్టు ఒత్తుగా పెరగాలంటే బయోటిన్ నిండుగా ఉన్న వీటిని ప్రతిరోజు తినండి-to make your hair grow thicker eat these foods that are full of biotin every day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  జుట్టు ఒత్తుగా పెరగాలంటే బయోటిన్ నిండుగా ఉన్న వీటిని ప్రతిరోజు తినండి

జుట్టు ఒత్తుగా పెరగాలంటే బయోటిన్ నిండుగా ఉన్న వీటిని ప్రతిరోజు తినండి

Haritha Chappa HT Telugu

జుట్టు రాలిపోయే సమస్య చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ ఉంది. జుట్టు పెరగడానికి ఏం తినాలా? అని జుట్టు పీక్కునేవారు కూడా ఎంతోమంది. వారి కోసమే ఈ బయోటిన్ నిండిన ఆహారాలు.

జుట్టు కోసం బయోటిన్ నిండిన ఫుడ్స్ (Pixabay)

జుట్టు పెరగడానికి బయోటిన్ చాలా అవసరం. వయసు పెరిగే కొద్ది జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, పలచబడడం అనేవి జరుగుతూ ఉంటాయి. జుట్టు బాగా పెరగాలంటే ప్రతిరోజూ విటమిన్ బి7 అత్యవసరం. విటమిన్ బి7 ని బయోటిన్ అని కూడా పిలుస్తారు.

ఆరోగ్యకరమైన జుట్టును పెంచేందుకు బయోటిన్ ఉపయోగపడుతుంది. మీరు ప్రతిరోజు బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడడమే కాదు.. జుట్టును ఒత్తుగా పెంచుకోవచ్చు. ఏ ఏ ఆహారాల్లో బయోటిన్ అధికంగా ఉంటుందో ఇక్కడ ఇచ్చాము.

కోడిగుడ్లు

గుడ్లలో బయోటిన్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొనలో బయోటిన్ ఉంటుంది. అలా అని తెల్ల సొన తినకుండా పడేయమని కాదు. తెల్ల సొన, పచ్చ సొన రెండు తినాల్సిందే. బయోటిన్ తో పాటు ప్రోటీన్, ఇనుము కూడా పుష్కలంగా అందుతాయి. ఈ మూడు కూడా బలమైన జుట్టును నిర్మించడానికి, వెంట్రుకలకు రక్తప్రసరణ పెంచడానికి సహాయపడతాయి. ప్రతిరోజు ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డును తినండి చాలు. కొన్ని రోజుల్లోనే మీకు జుట్టు పెరుగుదలలో మార్పు కనిపిస్తుంది.

నట్స్, సీడ్స్

జుట్టుకు కావలసిన పోషకాలు నట్స్, సీడ్స్ లో అధికంగా ఉంటాయి. బాదం, వాల్నట్లు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, జీడిపప్పులు... ఇలా అన్ని విత్తనాలలో బయోటిన్ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్ ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. వీటిని తినడం వల్ల తలకు కావలసిన పోషణ అందుతుంది. జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటాయి. అలాగే గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జుట్టును పొడి బారకుండా అడ్డుకుంటాయి.

సాల్మన్ చేపలు

సాల్మన్ చేపల్లో బయోటిన్ తో పాటు ప్రోటీన్ కూడా అధికంగా ఉంటుంది. అలాగే మన శరీరానికి అతి అవసరమైన ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. కాబట్టి వారానికి ఒక్కసారైనా సాల్మన్ చేపలు తింటే ఎంతో మంచిది. ముఖ్యంగా జుట్టు రాలిపోతున్న సమస్యతో బాధపడుతున్న వారు సాల్మన్ చేపలను తినేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. 100 గ్రాముల సాల్మన్ లో నాలుగు నుంచి ఐదు మైక్రోగ్రాముల బయోటిన్ అందుతుంది.

చిలగడ దుంపలు

చిలగడదుంపలు తక్కువ ధరకే లభిస్తాయి. కాబట్టి అన్ని వర్గాలవారు వీటిని తినవచ్చు. చిలగడ దుంపలలో బయోటిన్ తో పాటు బీటా కెరాటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అంటే విటమిన్ బి7తో పాటు విటమిన్ ఏ కూడా చిలగడదుంపల్లో ఉంటుంది. జుట్టును తేమగా ఉంచేందుకు సహజంగా నూనెను ఉత్పత్తి చేసేందుకు విటమిన్ ఏ అత్యవసరం. అలాగే చిలగడదుంపల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా పెరిగేలా చేస్తాయి. ప్రతిరోజూ ఒక చిలగడదుంప తింటే విటమిన్ బి7తో పాటు విటమిన్ ఏ పుష్కలంగా జుట్టుకు అంది... మందంగా ఎదుగుతుంది.

అవకాడోలు

అవకాడో పండ్లు కాస్త ఖరీదైనవి. కాబట్టి వీటిని ప్రతిరోజు తినడం కష్టం. వారానికి కనీసం రెండుసార్లు ఒక అవకాడో పండు తినేందుకు ప్రయత్నించండి. దీనిలో బయోటిన్ అధికంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, విటమిన్ బి5 కూడా ఉంటుంది. తలపై చర్మాన్ని తేమగా ఉంచేందుకు, ఒత్తిడి, కాలుష్యం నుండి బయట పడేలా చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. జుట్టు మొత్తానికి అవకాడోలోని పోషకాలు బలాన్ని ఇస్తాయి. తద్వారా వెంట్రుకలు రాలకుండా ఉంటాయి.

పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. కాబట్టి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు అధికంగా తినేందుకు ప్రయత్నించండి. ఇవన్నీ కూడా మీకు ఆరోగ్యకరమైన జుట్టును ఇస్తాయి. అలాగే జుట్టును పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎక్కువగా మురికి పడితే జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంది. అలాగే చివర్లను క్రమం తప్పకుండా కట్ చేయడం కూడా చాలా ముఖ్యం.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.