Blood Sugar Reduce: రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాలంటే దాల్చిన చెక్కను ప్రతిరోజూ ఇలా తీసుకోండి-to lower blood sugar levels take cinnamon every day like this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Blood Sugar Reduce: రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాలంటే దాల్చిన చెక్కను ప్రతిరోజూ ఇలా తీసుకోండి

Blood Sugar Reduce: రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాలంటే దాల్చిన చెక్కను ప్రతిరోజూ ఇలా తీసుకోండి

Haritha Chappa HT Telugu

డయాబెటిస్ రోగులు ఏమి తిన్నా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతూ ఉంటాయి. కొంతమందికి 200 దాటి కూడా నమోదవుతాయి. అలాంటివారు దాల్చిన చెక్కను ఆహారంలో భాగం చేసుకోవాలి.

దాల్చిన చెక్కతో ఉపయోగాలు (Pixabay)

మనం తినే ఆహారం నుండి ఎంతో చక్కెర విడుదలవుతుంది. అది శరీరంలో గ్లూకోజ్ గా మారి రక్త ప్రవాహంలోకి విడుదలవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరిగిపోతే డయాబెటిస్ వచ్చినట్టు అర్థం.

అందుకే డయాబెటిస్ వచ్చిన వారు చాలా జాగ్రత్తగా ఆహారాన్ని ఎంపిక చేసుకుని తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నవారు దాల్చిన చెక్క ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అంతేకాదు చక్కెర స్థాయిలను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

షుగర్ స్థాయిలు ఎంత ఉండాలి?

రక్తంలో చక్కెర స్థాయిలు పెద్దవారిలో తెల్లవారుజామున అంటే ఉపవాసం తర్వాత 70 నుంచి 100 లోపు ఉండాలి. అదే ఆహారం తిన్న తర్వాత అయితే 140 కన్నా తక్కువగా ఉండాలి. అదే డయాబెటిస్ వచ్చిన రోగికి అయితే ఉపవాస సమయంలో 80 నుంచి 130 మధ్యలో ఉండాలి. అదే తిన్న రెండు గంటల తర్వాత 150 కంటే తక్కువగా ఉండాలి. కానీ కొంతమందికి రెండు వందల కంటే ఎక్కువ స్థాయిలో నమోదవుతూ ఉంటాయి. ఇలా ఉంటే డయాబెటిస్ ను వెంటనే నియంత్రించాల్సిన అవసరం ఉంది. లేకుంటే అనేక రకాల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.

జర్నల్ ఆఫ్ డయాబెటిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెబుతున్న ప్రకారం దాల్చిన చెక్కలో సినమాల్దిఫైడ్, పాలిఫెనల్స్ వంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది ఈ ఇన్సులిన్ ప్రభావాలను ప్రదర్శిస్తాయి. ఈ సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. కణాలు మన గ్లూకోజ్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి సహకరిస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి ఆహారంలో దాల్చిన చెక్కను భాగం చేసుకుంటే మంచిది.

దాల్చిన చెక్క ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఒకటి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి డయాబెటిక్ రోగులకు ఎంతో ఉపయోగపడతాయి. శరీరంలో ఆక్సీకరణం ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకతను అడ్డుకుంటాయి. కాబట్టి దాల్చిన చెక్క మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అన్ని రకాలుగా మేలే జరుగుతుంది.

దాల్చిన చెక్కను ఎలా తినాలి?

డయాబెటిస్ ఉన్నవారు దాల్చిన చెక్కను ప్రతిరోజు ఆహారంలో కలుపుకొని తింటే మంచిది. వేడి నీటిలో దాల్చిన చెక్కను వేసి టీలాగా స్టవ్ మీద పెట్టి మరగ పెట్టుకోవాలి. పావుగంట సేపు అలా మరిగిన తర్వాత ఆ దాల్చిన చెక్కను తీసి బయటపడేయాలి. ఆ నీటిని తాగేయాలి, లేదా దాల్చిన చెక్కను పొడి రూపంలోకి మార్చుకోవాలి. నీటిలో ఆ పొడిని వేసి పావుగంట సేపు మరిగించుకోవాలి.

భోజనానికి ఒక గంట ముందు ఈ టీ ని తాగితే మంచిది. అది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క నీరు తాగినప్పుడు అందులో చక్కెరను వేయడం మంచి పద్ధతి కాదు. చక్కెరను పూర్తిగా మానేయాలి. దాల్చిన చెక్కను నీళ్ళల్లో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం పూట ఆ దాల్చిన చెక్క నీటిని తాగితే ఇంకా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు రెండు మూడు వారాల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం