Wednesday Motivation: ఎక్కువ కాలం జీవించాలంటే మీ మెదడు యవ్వనంగా ఉండాలి, మెదడును యవ్వనంగా ఉంచే అలవాట్లు ఇదిగో
Wednesday Motivation: మన మెదడే మన ఆలోచనలను నిర్ణయిస్తుంది. మన ఆలోచనలే మన జీవితాన్ని నడిపిస్తాయి. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే జీవితం అంత చక్కగా ఉంటుంది. మెదడు యవ్వనంగా ఉంటే శరీరం కూడా ఉత్సాహంగా పనిచేస్తుంది.
Wednesday Motivation: మన శరీరంలో మెదడు ఎంతో ముఖ్యమైనది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మెదడుది ముఖ్యపాత్ర. వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు రావడం, అభిజ్ఞా ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది. శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే మెదడును కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన ప్రవర్తనలను పాటించడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. అలాగే మెదడు ఎంత యవ్వనంగా ఉంటే ఆలోచనలు కూడా అంత మెరుగ్గా ఉంటాయి. కాబట్టి మీ జీవితం ఆనందంగా ఆరోగ్యంగా సాగుతుంది. దీనివల్ల ఆయుష్షు పెరుగుతుంది.
తినాల్సినవి ఇవే
మెదడు కోసం పోషకాహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని పెంచే పదార్థాలు తినడం ముఖ్యం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ ఉన్న మాంసం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే చేపలు తినడం చాలా అవసరం. ఇది అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెదడును సంరక్షిస్తాయి. బాదంపప్పులు, సాల్మన్ చేపలు, ఆకుకూరలు, బ్లూ బెర్రీస్ వంటివి తింటే మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు.
మెదడు ఆరోగ్యానికి వ్యాయామం చేయడం చాలా అవసరం. వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త ప్రవాహం చక్కగా జరుగుతుంది. దీనివల్ల కొత్త న్యూరాన్లు అభివృద్ధి చెందుతాయి. ఇవి సాధారణ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వ్యాయామాలు, యోగా, ఈత, నడక వంటివి ప్రతిరోజు చేయడం వల్ల మీ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.ప్రతిరోజు కనీసం అరగంట పాటు వ్యాయామాలు చేయడం ఎంతో ముఖ్యం.
అభిజ్ఞా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ మనసును ఎప్పుడూ బిజీగా ఉంచుకోవాలి. పజిల్స్ చేయడం, పుస్తకాలు చదవడం, వాయిద్యాలు వాయించడం, కొత్త భాషను నేర్చుకోవడం వంటివి చేస్తే మీ మెదడు చక్కగా పనిచేస్తుంది.
తగినంత నిద్ర
మెదడుకు తగినంత నిద్ర కూడా ముఖ్యం. మెదడు విశ్రాంతి తీసుకునేది కేవలం మనం నిద్రపోతున్నప్పుడే. పగటిపూట ఏర్పడే మలినాలను రాత్రిపూట నిద్రలోనే మెదడు ప్రక్షాళన చేస్తుంది. మనం నిద్రపోతున్నప్పుడే జ్ఞాపకాలను ఏకీకృతం చేస్తుంది. కాబట్టి మెదడు కోసం ప్రతి రాత్రి 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవడం ఎంతో ముఖ్యం.
మీ సోషల్ మీడియా యాక్టివిటీలను చాలా వరకు తగ్గించుకుంటేనే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక, భావోద్వగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సోషల్ మీడియాను దూరం పెట్టాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో అనుబంధాలను కలుపుకోవాలి. వారితోనే అర్థవంతమైన సంభాషణలను చేయాలి. మెదడును బిజీగా ఉంచుకోవాలి.
ఒత్తిడిని ఎంతగా నియంత్రించుకుంటే అంత మంచిది. దీర్ఘకాలిక ఒత్తిడి, మానసిక ఆరోగ్యం పై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి యోగా, లోతైన శ్వాస, ధ్యానం వంటివి చేయడం ముఖ్యం. ఈ వ్యాయామాలు మెదడుకు స్పష్టతను, జ్ఞాపకశక్తిని, మంచి దృష్టిని అందిస్తాయి.
మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఉత్తమంగా పనిచేయాలన్నా ఎక్కువగా ద్రవాలను తీసుకోవాలి. శరీరం ఎంత హైడ్రేటెడ్ గా ఉంటే మెదడు అంత ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి రోజులో తీసుకునే ద్రవాల పరిమాణం పెంచాల్సిన అవసరం ఉంది.
ధూమపానం, మద్యపానం వంటివి మెదడు కణజాలానికి హాని కలిగిస్తాయి. వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి. కాబట్టి ఈ రెండిటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ మెదడు యవ్వనంగా ఉండాలంటే ధూమపానాన్ని, మధ్యపానాన్ని పూర్తిగా మానేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించాలి. సామాజిక అనుబంధాలను కొనసాగించాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను అనుసరించాలి.