Tips to reduce stress: ఈ పనులు చేస్తే.. ఒత్తిడి తగ్గుతుంది.. ఆనందం పెరుగుతుంది..
Tips to reduce stress: మానసికంగా ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాలా మార్గాలుంటాయి. వాటిలో కొన్ని ఉత్తమమైనవేంటో తెలుసుకోండి.
ఉదయం లేచినప్పటి నుంచి హడావిడి మొదలు. చేయాల్సిన పనుల చిట్టా చాంతాడంత ఉంటుంది. దీంతో ఉరుకుల పరుగుల జీవితాలు తప్పడం లేదు. ఫలితం ఒత్తిడి. అందుకనే ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారు. ఆందోళనతో చిత్తవుతున్నారు. వీటి వల్ల వచ్చే శారీరక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ ఒత్తిడిని తగ్గించుకుంటే చాలా అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకు ఇంట్లో మనంతట మనం పాటించగల చిన్న చిట్కాలను అందిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూసేద్దాం.
మసాజ్ చేసుకోవడం :
గోరు వెచ్చని లేదా చల్లని నీటితో స్నానం చేయడం, ఎక్కడైనా నొప్పులుగా అనిపిస్తే చిన్నగా మసాజ్ చేసుకోవడం, కండరాలన్నీ సాగేలా ఒళ్లు విరుచుకోవడం లాంటి పనుల వల్ల ఒత్తిడి తగ్గుతుంది. బాత్ రూంలో చిన్న మ్యూజిక్‌ని పెట్టుకుని, గోరు వెచ్చని నీటితో ఓ పావు గంట సేపైనా టబ్ బాత్ చేయాలి. అందుకు మంచి సువాసన ఉన్న సహజమైన సబ్బును ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.
డ్యాన్స్ చేయడం:
డ్యాన్స్ చేయడం అనేది స్ట్రెస్ రిలీవర్‌లా పని చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మంచి సంగీతాన్ని పెట్టుకుని దానికి తగినట్లుగా డ్యాన్స్ చేయవచ్చు. ఎవరైనా ఉన్నప్పుడు చేయడం మొహమాటం అయితే ఎవరూ లేనప్పుడు ఆ పని చేయండి. దీనివల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. ఒత్తిడి హార్మోన్ల స్థాయి తగ్గుతుంది.
ఇష్టమైన వారితో రొమాంటిక్‌గా:
ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇష్టమైన వారితో రొమాంటిక్‌గా గడిపేందుకు ప్రయత్నించండి. అందువల్ల శరీరంలో డోపమైన్ లాంటి హ్యాపీ హార్మోన్‌లు విడుదలవుతాయి. దీంతో మీరు ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
ధ్యానం :
ఒత్తిడి నుంచి బయట పడటానికి ధ్యానం అద్భుతమైన మార్గం అని చాలా అధ్యయనాల్లో తేలింది. శ్వాస మీద ధ్యాస పెట్టి కేవలం రెండు నిమిషాలు కళ్లు మూసుకున్నా సరే అది మీ శరీరంలో స్ట్రెస్ హార్మోన్ కోర్టిసోల్ స్థాయిల్ని తగ్గిస్తుంది.
బబుల్ ర్యాప్‌లను పగలగొట్టడం:
బబుల్ ర్యాప్ కవర్లను చూడగానే అంతా వాటిని పగలగొట్టాలని ఉవ్విళ్లూరతారు. అందుకు కారణాలు లేకపోలేదు. అలా వాటిని పేల్చడం వల్ల మనలో ఓ రకమైన ఆనందం కలుగుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. అందువల్లనే మనం వాటిని పేల్చేందుకు ఇష్టపడతుంటాం.
మీరు చాలా ఒత్తిడిలో ఉన్నారు అనుకున్నప్పుడు ఈ పనుల్లో మీకు వీలైన దాన్ని చేసి చూడండి. అద్భుతంగా పని చేస్తుంది.