Daytime Fatigue: రోజంతా అలసటగా ఉంటోందా? ఇవి చేసి చూడండి..
Daytime Fatigue: రోజంతా పడుకోవాలనే అనిపించడం, ఏ పని చేయాలన్నా మనసు రాకపోవడం.. ఇవన్నీ నీరసాన్ని, నిస్సత్తువను సూచిస్తాయి. ఈ సమస్య రోజూ ఉంటే కొన్ని విషయాలు గమనించుకోవడం మంచిది.
కొంత మందికి ఉదయం లేచినప్పటి నుంచి విపరీతమైన నీరసంగా ఉంటుంది. ఏమీ చెయ్యకపోయినా ఏదో చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. మత్తుగా ఉండి నిద్ర పోవాలని అనిపిస్తుంది. దీని వల్ల ఏ పనినీ మనసు పెట్టి చెయ్యలేం. అందువల్ల విసుగు వస్తుంటుంది. అయితే అందుకు కారణాలు వేరే ఉంటాయి. శరీరంలో ఏదో ఒక అవయవానికి వచ్చిన ఇబ్బందో, లేకపోతే పోషకాహార లోపమో కారణం అయి ఉండవచ్చు. అందుకనే ఈ లక్షణాలతో బాధపడుతున్న వారు సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అలాగే ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకోవాలి. అవేంటో ఇక్కడున్నాయి. వీలైతే ఆచరించేందుకు ప్రయత్నించండి.

థైరాయిడ్ పరీక్ష అవసరం :
ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపించడం, నిద్ర వస్తున్నట్లు మత్తుగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తుంటే అవి థైరాయిడ్ హార్మోన్ అసమతుల్యతకు సంబంధించిన లక్షణాలు కావచ్చు. అందుకనే ముందుగా ఈ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
గింజలు తినండి :
ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వుల్ని అందించాల్సిన అవసరం ఉంటుంది. సాల్మన్, మెకరాల్, ట్యూనా లాంటి చేపలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, నువ్వులు, బాదాం, వాల్‌నట్స్ లాంటి వాటిని రోజూ కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండాలి. వీటి వల్ల మనలో శక్తి పెరుగుతుంది.
ఎక్కువ నీటిని తాగండి :
పగటి పూట అసలట, మత్తు ఇబ్బంది పెడుతున్నట్లయితే శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ఎక్కవ నీరు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, చెరుకు రసం, నిమ్మకాయ నీళ్లు తదితరాలను ఎక్కువగా తీసుకునేందుకు ప్రయత్నించాలి.
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు :
మనం రోజూ తినే ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించి ప్రొటీన్‌లకు ఎక్కువగా తినేందుకు ప్రయత్నించాలి. బిర్యానీలు, ఫ్రైలు, మాంసాహారాలు తగ్గించాలి. బదులుగా తేలికపాటి ఆహారం, ప్రొటీన్ ఫుడ్‌ని తీసుకోవాలి. అందువల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.
విటమిన్ బీ ఆహారాలు :
రోజంతా అలసటకు విటమిన్ బీ లోపం కూడా ఓ కారణం అయి ఉండవచ్చు. దీని వల్ల మూడ్ స్వింగ్స్, విసుగు, ఆందోళన లాంటివి వస్తాయి. గుడ్లు, పాల ఉత్పత్తులు, పప్పులు, బీన్స్ లాంటి వాటిలో ఈ విటమిన్ బీ పుష్కలంగా దొరుకుతుంది.
కొంచెం సేపు నిద్ర :
మరీ అలసట అనిపిస్తున్నప్పుడు పగటి పూట అయినా ఫర్వాలేదు. ఓ పావు గంట నుంచి అరగంట సేపు చిన్న కునుకు వేయాలి. అప్పుడు శరీరం మళ్లీ శక్తివంతం అయినట్లు అనిపిస్తుంది. కాస్త రిలాక్సింగ్‌గా ఉండి పనులు చేసుకునేందుకు అవసరమైన శక్తి సమకూరుతుంది.