Work-related stress | వృత్తిపరమైన ఒత్తిళ్లతో సతమతమవుతున్నారా? టెన్షన్ వద్దు గురూ, ఇలా చేయండి!
Work-related stress: వృత్తిపరమైన ఒత్తిళ్లతో సతమతమవుతున్నారా? మీకు పనిభారం కాకుండా మిమ్మల్ని ట్రాక్ లోకి తెచ్చేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి చూడండి.
Work-related stress: ప్రతీ వ్యక్తికి జీవితంలో వ్యక్తిగతంగా అనేక ఒత్తిళ్లు, ఆందోళనలు ఉండవచ్చు. అయితే ఉద్యోగం చేసేవారికి అదనంగా వృత్తిపరమైన ఒత్తిళ్లు కూడా ఉంటాయి. ఒక్కోసారి ఎంత కష్టపడి పనిచేసినా, మీ వృత్తికి మీ వంతు ప్రయత్నాలు పెట్టి ఎంత కృషిచేసినా, పైఅధికారులు మెప్పు పొందకపోవచ్చు, బదులుగా నిందలు కూడా పడాల్సి రావచ్చు. ఇటువంటి సమయాల్లో మీరు మరింత నిరుత్సాహానికి లోనవడం, భవిష్యత్తులో పురోగతి సాధించలేమనే బెంగ, ఇతర ప్రతికూల ఆలోచనలు కలుగుతాయి, ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. మరోవైపు పనిని భారంగా భావిస్తారు. మీకు అప్పజెప్పిన పనులను సమయానికి పూర్తిచేయలేక అదనపు గంటలు పనిచేయాల్సి వస్తుంది. దీంతో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా గతితప్పుతుంది.

కానీ, మీరు ఏదైనా చేయగలరు, మీలో ఆ సత్తా ఉంది. మీరు ఈ ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడి, ఒక ప్రొఫెషనల్‌గా మళ్లీ ట్రాక్ లోకి రావాలంటే, మీకు కొంత ప్రేరణ అవసరం. ఇక్కడ మీకు సహాయపడే కొన్ని మార్గాలను తెలియజేస్తున్నాం. వీటిని అనుసరించి చూడండి.
సెలవు తీసుకోండి
మీరు మీ వృత్తిజీవితం నుంచి స్వల్ప విరామం తీసుకోండి. సెలవు పెట్టి ఏదైనా విహారయాత్రకు వెళ్లండి. మీ వ్యక్తిగత జీవితంపై శ్రద్ధపెట్టండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సమయం గడపండి. ఈ సెలవు మిమ్మల్ని పునరుజ్జీవింపజేస్తుంది. మళ్లీ మీరు ఏకాగ్రత సాధిస్తారు. మీ వృత్తిజీవితంపై దృష్టిపెడతారు.
విరామాలు తీసుకోండి
మీరు రోజంతా పనిచేస్తున్నప్పుడు మధ్యమధ్యలో చిన్నపాటి విరామాలు తీసుకోండి. తద్వారా మిమ్మల్ని మీరు మానసికంగా, శారీరకంగా రిఫ్రెష్ చేసుకోవచ్చు. మీ చేతిలో ఉన్న పనిని కాసేపు పక్కనపెట్టి, కొన్ని నిమిషాలు ఆరుబయట గడపండి. ఈ విరామం తిరిగి మీరు శక్తిని పొందడంలో సహాయపడుతుంది.
వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోండి
మీరు సాధించగల లక్ష్యాలను నిర్దేశించుకోండి, తద్వారా మీరు భారంగా అనుభూతి చెందరు. కేటాయించిన సమయంలో మీరు సాధించగల వాస్తవిక లక్ష్యాలను సెట్ చేయడం ముఖ్యం. ఇది మీరు మళ్లీ ట్రాక్‌లో ఉండేందుకు, అనవసరపు ఒత్తిడిని నిరోధించడంలో సహాయపడుతుంది.
మీ ఒత్తిడిని తగ్గించుకోండి
మీరు ఒత్తిడికి లోనయితే అది మీ ఉత్పాదకతను పెంచవచ్చు. కానీ ఒత్తిడి స్థాయిలు ఎక్కువైతే, మీలో ఆందోళన, గందరగోళం మరింత పెరగవచ్చు. దీంతో మరింత అలసటగా భావించి పని పూర్తచేయలేరు. ఒత్తిడి తగ్గించుకోవడానికి కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి.
తగినంత నిద్రపోండి
మీరు సరిగ్గా పనిచేయాలన్నా, మీ పనితీరు మెరుగుపడాలన్నా మీకు తగినంత విశ్రాంతి, నిద్ర అవసరం. మీరు రోజు కంటినిండా నిద్రపోతున్నారా? ఎందుకంటే నిద్రలేమితో మీకు రోజంతా అలసట, బద్ధకం ఉంటాయి. మీరు సమయానికి పనులు పూర్తిచేయలేరు, మీ ఉత్పాతగత తగ్గుతుంది. కావున రోజూ రాత్రి మంచి నిద్ర తీసుకోండి. దీనివల్ల ఉదయం మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి, తద్వారా మీరు రోజులో ఏ పనులనైనా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు.