Bitterness tips: కాకరకాయ కూర చేదు రావద్దంటే, ఈ 8 టిప్స్‌లో ఏదైనా ఫాలో అవ్వండి
Bitterness tips: కాకరకాయలు చేదు తగ్గాలంటే కొన్ని చిట్కాలు పాటించండి. కాకర తినాలని ఉన్నా చేదు వల్ల దాని జోలికి పోరు చాలా మంది. ఈ సింపుల్ టిప్స్ తెల్సుకున్నారంటే రుచి పెరగడమే కాకుండా చేదూ తగ్గుతుంది.
కాకరకాయ తింటే ఆరోగ్యకరం అని తెల్సినా చేదు రుచి నచ్చక ఎక్కువగా తినము. కానీ కొన్ని టిప్స్ పాటించి కాకరకాయ కూర చేస్తే అస్సలు చేదే ఉండదు. అలాగే మన శరీరానికి మేలు చేసే పదార్థాలు రుచిలో కమ్మగా ఉండవు. ఏ ఔషదం అయినా చేదుగానే ఉంటుంది. కాకరకాయలో ఉండే చేదు కూడా మన ఆరోగ్యానికి మంచిదే. కానీ ఆ చేదు వల్ల మీరు కాకరకాయకు పూర్తిగా దూరం అవ్వకుండా ఈ టప్స్ పాటించి కాస్తో కూస్తో తినడం అలవాటు చేసుకోవచ్చు.
ఉప్పు, పసుపు:
కాకరకాయ కూర వండే ముందు చిన్న ముక్కలుగా కోసి రెండు చెంచాల ఉప్పు, చెంచా పసుపు ముక్కల మీద చల్లాలి. వాటిని ముక్కలకు బాగా పట్టించాలి. వాటి మీద మూత పెట్టుకుని అరగంటయ్యాక ముక్కలను గట్టిగా పిండేస్తే రసంలాగా వస్తుంది. దాన్ని పడేయాలి. ముక్కలతో నేరుగా కూర వండుకోవడమే. దీనివల్ల చేదు చాలా వరకు తగ్గుతుంది.
చెక్కు తీసేయాలి:
కాకరకాయ మీద ఉండే ముదురు ఆకుపచ్చ రంగు భాగాన్ని వీలైనంత తీసేయాలి. పొట్టు తీయడానికి వాడే పీలర్ లేదా చాకు కూడా వాడి ఆ చెక్కు అంతా తీసేయొచ్చు. కాకరకూడా మృదువుగా అయిపోతుంది. చేదు కూడా కాస్త తగ్గుతుంది.
గింజలు తీసేయాలి:
కాకరకాయ లోపల కొన్నిసార్లు పెద్ద గింజలుంటాయి. లేత కాకరకాయల్లో గింజలు తక్కువగా ఉంటాయి. వాటివల్ల కూడా కాకరకాయ చేదు పెరుగుతుంది. కాబట్టి కూర వండే ముందు కాకరకాయ నిలువుగా చీల్చి గింజలు తీసేయాలి.
పెరుగు లేదా మజ్జిగతో :
కొన్ని కూరలు వండేముందు కాకరకాయను ముక్కలుగా కోసి మజ్జిగలో నానబెడతారు. కాకరకాయ చేదు తగ్గడమే కాకుండా రుచి కూడా పెరుగుతుంది. కూర చేసే అరగంట లేదా గంటముందే ముక్కలుగా కోసుకుని మజ్జిగ లేదా పెరుగులో ఆ ముక్కల్ని నానబెట్టాలి. బాగా పిండేసి ముక్కల్ని కూర కోసం వాడాలి. చేదు అస్సలే ఉండకూడదంటే ఉప్పు, నిమ్మరసం కలిపి వాడొచ్చు. కాకరకాయ ముక్కల మీద ఈ రసం చల్లి కాసేపు పక్కన పెట్టాలి. రసం పిండేసి, ఒక్కసారి మంచి నీళ్లతో కడిగేసి కూరకు వాడుకుంటే చేదు అనిపించదు.
తీపి చేదును తగ్గిస్తుంది:
కాకరకాయ ముక్కల్ని షాలో ఫ్రై చేస్తున్నప్పుడు అవి బాగా వేగాక చివర్లో కాస్త పంచదార వేసి ఫ్రై చేయొచ్చు. కాకరకాయతో గ్రేవీ కూర వండితే కాకరకాయ ముక్కలు ఉడికాక కాస్త బెల్లం లేదా పంచదార వేసుకోవచ్చు. కొద్దిగా తీపి జతచేయడం వల్ల కాకరకాయల్లో ఉన్న చేదు తగ్గిపోతుంది.
ఉడికించడం:
ముక్కలను ముందుగానే ఉడికించేసి, నీళ్లు వంపేస్తే పోషకాలు పోతాయి అంటారు. కానీ ఎంతో కొంత కడుపులో పడాలి అనుకుంటే ఈ పద్ధతి ఫాలో అయిపోవచ్చు. కూర వండే ముందు రెండు నిమిషాలు ముక్కలను ఉప్పు కలిపిన నీళ్లలో ఉడికించుకోవాలి. ఆ నీళ్లన్ని వంపేసి కూర వండుకుంటే చేదు అసలే అనిపించదు.
చింతపండు రసం:
కాకరకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని చింతపండు రసంలో కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత వండుకుంటే చేదు రాదు. లేదంటే కాకరకాయ కూరలో కాస్త చింతపండు రసం వేసి ఉడికించుకుని పులుసు పెట్టుకున్నా చేదు చాలా తగ్గిపోతుంది.
డీప్ ఫ్రై:
కాకరకాయతో బజ్జీలు, చిప్స్ లాంటివి కూడా చేస్తారు. అవి రుచిగా ఉంటాయి కూడా. బయట మార్కెట్లో కాకరకాయ చిప్స్ తింటే అస్సలు చేదు అనిపించవు. అలాగే రావాలంటే ముందుగా కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసి తర్వాత వాటితో చిప్స్ లేదా బజ్జీల్లాగా వేసుకోవచ్చు. దాంతో చేదు అనిపించవు. రుచి పెరుగుతుంది. క్రిస్పీగా అనిపిస్తాయి.
టాపిక్