Straight Hair Naturally: సహజంగా హెయిర్ స్ట్రైటెనింగ్ చేయండిలా..
Straight Hair Naturally: జుట్టు రింగురింగులుగా ఉండటం కొందరికి నచ్చదు. అలాంటప్పుడు స్ట్రెటెయినింగ్ కోసం వేడి ఉత్పత్తులు వాడకుండా కొన్ని సహజ పద్ధతులు ప్రయత్నించి చూడండి.
కాస్త వంకీలు తిరిగిన జుట్టు ఉన్న చాలా మందికి జుట్టు నిటారుగా ఉంటే బాగుంటుందనిపిస్తుంది. ఈ మధ్య హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకోవడం సర్వసాధారణం అయ్యింది కూడా. అలాగే ముఖ్యమైన వేడుకల లాంటి వాటికి హాజరు అవ్వాలనుకున్నప్పుడు కూడా అమ్మాయిలు హెయిర్ స్ట్రైటనింగ్ చేయించుకుంటుంటారు. కొందరైతే హెయిర్ స్ట్రైటనర్లు ఉపయోగించి ఇంట్లోనే జుట్టును సెట్ చేసుకుంటారు. ఇలా స్ట్రైటనర్‌లో జుట్టును వేడి చేయడం వల్ల క్రమంగా దాని ఆరోగ్యం దెబ్బ తింటుంది. రాను రాను నిర్జీవంగా తయారవుతుంది. మరి అసలు జుట్టుకు వేడి తగలకుండా స్ట్రైటనింగ్ చేసుకునే పద్ధతులు కొన్ని ఇక్కడున్నాయి. ఓసారి చెక్ చేసేయండి.
ట్రెండింగ్ వార్తలు
రోలర్లను వాడటం :
మార్కెట్‌లో హెయిర్ రోలర్లు అందుబాటులో ఉన్నాయి. తడి జుట్టును చిక్కులు లేకుండా దువ్వి ఈ రోలర్లను జుట్టు పై నుంచి కిందకి నిటారుగా లాగడం వల్ల జుట్టు సహజంగానే స్ట్రైట్‌గా తయారవుతుంది. వీటికి వేడి అవసరం ఉండదు. అలాగే హెయిర్ స్టైలింగ్ చేసుకునేప్పుడు అమ్మాయిల తలపైన పాపిట భాగంలో జుట్టు మరీ స్ట్రైట్‌గా ఉంటే బాగోదు. కాబట్టి అక్కడ ఓ పెద్ద రోలర్‌ని ఉంచి పిన్నులు పెట్టి, తర్వాత కింద కేశాలను మరో రోలర్‌తో స్ట్రైటన్ చేసుకోవాలి. అప్పుడు తలపైన జుట్టు కాస్త కొప్పులా ఉండి, పైన జుట్టు నిండుగా కనిపిస్తుంది.
మిల్క్ ప్యాక్ వేయడం :
మనం ఇంట్లో వాడుకునే పాలే కాదు, కొబ్బరి పాలు, బాదాం పాల లాంటి ఏ రకమైన పాలతో అయినా జుట్టుకు మాస్క్ వేసుకోండి. పాలు అనేవి జుట్టుకు సహజమైన కండిషనర్‌లా పని చేస్తాయి. పాలను జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు బాగా పట్టించి ఓ పదిహేను నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత తలస్నానం చేయండి. తర్వాత టవల్‌తో కేశాలను నిటారుగా అంటూ ఉండటం వల్ల మరీ ఎక్కువ రింగులు లేకుండా స్ట్రెయిట్ గా తయారవుతాయి.
స్ట్రైటనింగ్ షాంపూలు, కండిషనర్లు :
ఇప్పుడు జుట్టు స్ట్రైటనింగ్ కోసం మార్కెట్‌లో పలు రకాల షాంపూలు, కండిషనర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా స్ట్రైటనింగ్ కోసం తయారు చేసినవి కాబట్టి జుట్టు పాడుకాకుండా, రింగులుగా, చిక్కులు కాకుండా నిటారుగా చేస్తాయి. ప్రమాదకరమైన రసాయనాల శాతం తక్కువగా ఉన్న వాటిని ఎంచుకోవాలని మాత్రం గుర్తుంచుకోండి.
టవెల్ చుట్టడం:
తలస్నానం చేయగానే టవెల్ చుట్టి గుండ్రంగా తిప్పేసి కొప్పులాగా పెట్టేస్తాం. అలా కాకుండా కేవలం జుట్టు కుదుళ్ల నుంచి కిందిదాకా టవెల్‌తో అద్దుతూ తడిపోయాలా చేయాలి. దీనివల్ల మరీ అంత రింగుల జుట్టు తగ్గకపోయినా, కాస్త మృదువుగా మాత్రం తయారవుతుంది. ముఖ్యంగా రాత్రిపూట స్నానం చేసి తలకు టవెల్ చుట్టుకుని పడుకుంటే జుట్టు రింగులురింగులుగా తయారవుతుందని గుర్తుంచుకోవాలి.