Thursday Motivation: అదృష్టం అవకాశం రూపంలోనే ఉంటుంది.. మిగతాది నీ చేతుల్లోనే..-thursday motivational story about luck and opportunity ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation: అదృష్టం అవకాశం రూపంలోనే ఉంటుంది.. మిగతాది నీ చేతుల్లోనే..

Thursday Motivation: అదృష్టం అవకాశం రూపంలోనే ఉంటుంది.. మిగతాది నీ చేతుల్లోనే..

Koutik Pranaya Sree HT Telugu
Jun 27, 2024 05:00 AM IST

Thursday Motivation: ఏ పని చేసినా కలిసి రావట్లేదు అనే మాట చాలా సార్లు, చాలా మంది నోట వింటుంటాం. కానీ అదృష్టం ఎప్పుడూ ఒక వరంలా వచ్చి మీ ధరి చేరదు. అవకాశం రూపంలో మీ తలుపు తడుతుంది.

అదృష్టం అవకాశం రూపంలోనే ఉంటుంది
అదృష్టం అవకాశం రూపంలోనే ఉంటుంది (freepik)

మన పక్క వాడు ఏం పట్టినా బంగారమే, ఏం చేసినా బంగారమే. నేనేం ముట్టుకున్నా బూడిదే. ఏ పని చేసినా కలిసి రావట్లేదు. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండట్లేదు. ఇలా ఆలోచిస్తూ చాలా సార్లు బాధ పడతాం. ఎక్కడ ఏ లోపం ఉందో అర్థం కాదు. ఇక చివరికి అతడి అదృష్టం బాగుంది, అందుకే అన్నీ కలిసొస్తున్నాయని ఫిక్స్ అయిపోతాం. కానీ ఆ అదృష్టం వెనక అతను పడ్డ కష్టం అర్థం చేసుకోం. కోటిలో ఒకరికి తప్ప ఇంకెవరికీ కష్టం లేకుండా ప్రతిఫలం రాదు. అదృష్టం అవకాశం రూపంలో అందరి తలుపులు తడుతుంది. ఆ అవకాశాన్నిఉపయోగించుకున్నవాళ్లు మాత్రమే అదృష్టవంతులుగా మారతారు. మనదాకా వచ్చిన అవకాశాన్ని మనకు తెలిసో తెలీకో వద్దనుకుని మళ్లీ బాధపడటంలో అర్థం లేదు. ఒక అవకాశం వచ్చినప్పుడు నేనేం చేసినా కలిసి రావట్లేదు కాబట్టి ఇంకోటి ప్రయత్నించినా మళ్లీ నష్టమే తప్ప ఇంకేమీ ఉండదు అనే ఆలోచన గనక మన మనసులో వస్తే ఇక నీ విజయానికి ఫుల్ స్టాప్ పడ్డట్లే. నువ్వు అనుకున్న మెట్టు ఎక్కేదాకా ప్రయత్నం ఆపకూడదు. ఓపిగ్గా ఉండాలి. ఏ అవకాశం వచ్చినా తీసి పడేయకూడదు.

ఒకసారి వారణాసిలో నివసించే సురేష్ అనే వ్యక్తికి పురాతన కాలం నాటి పుస్తకం ఒకటి దొరుకుతుంది. అది చదువుతుండగా ఒక పేజీలో ఆసక్తికర విషయం ఉంటుంది. కష్టాల్లో ఉన్న సురేష్‌కు అది గొప్ప అవకాశంలా అనిపిస్తుంది. ఆ పేజీలో.. గంగానది ఒడ్డున మహిమలున్న రాళ్లు ఉంటాయనీ, తాకితే వెచ్చగా ఉండే ఈ రాళ్లతో ఏ వస్తువు తాకినా బంగారంలా మారిపోతుందని రాసి ఉంటుంది. ఆ పుస్తకంలో చెప్పిన ప్రదేశానికి వెంటనే సురేష్ వెళ్తాడు. రాళ్లకోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఒక్క రాయి దొరికినా జీవితం మారిపోతుందనే ఆశ అతనిది.

ఆ నది ఒడ్డున వారం రోజుల పాటూ అన్ని రాళ్లు తీసి వెతుకుతూనే ఉంటాడు. అయినా ఆ విలువైన రాయిని గుర్తించలేకపోతాడు. అయినా ప్రయత్నిస్తూనే ఉంటాడు. నెల రోజులు గడిచాయి. రాయి జాడ ఇంకా కనిపెట్టలేకపోయాడు. దాంతో ఇక తన బతుకు మారదులే అని నిరాశ చెందుతాడు. అప్పటిదాకా ఓపిగ్గా ప్రతి రాయిని తాకి పక్కన పెట్టేసిన సురేష్.. కోపంతో ఒక్కో రాయిని తాకి చూసి అది వెచ్చగా లేకపోతే నదిలోకి విసిరేస్తుంటాడు. చివరికి అది అలవాటుగా మారిపోయింది. వెతగ్గా వెతకగా ఒకరోజు ఆ మహిమలున్న వెచ్చని రాయి చేతికి దొరికింది. ఆ వెచ్చదనాన్ని గుర్తించేలోపే అలవాటు ప్రకారం రాయిని నదిలోకి విసిరేశాడు. రాయి చేతిలోనుంచి పోయే ఆఖరి క్షణంలోగానీ అతడు ఆ విషయం గమనించలేదు. అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. అప్పటిదాకా పడ్డ శ్రమంతా వృథా అయిపోయింది.

మనం కూడా ఈ సురేష్ లాగా చాలా ప్రయత్నాలు చేస్తాం. కష్టపడతాం. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే మనం విజయానికి దగ్గరవుతాం. కానీ ఆ ఓపిక ఉండదు. కోపం పెరుగుతుంది. అదృష్టం కలిసిరావట్లేదు అనుకుని.. ఇక ప్రయత్నించడం ఆపేస్తాం. మన దాకా వచ్చిన అదృష్టాన్ని చేతులారా పాడు చేసుకుంటాం. అందుకే మీరు అనుకున్నది సాధించేదాకా, కష్టాలు తీరేదాకా ఓపిగ్గా ఉండండి. మీకూ ఆ మహిమలున్న రాయి ఏదో ఒక రూపంలో తప్పకుండా దొరుకుతుంది.

 

WhatsApp channel