Thursday Motivation: విజయం పొందాలంటే ఓర్పు, సహనం చాలా ముఖ్యం, ఈ రైతు విజయానికి అవే కారణం
Thursday Motivation: కొందరికి విజయం ఇన్‌స్టెంట్‌గా రావాలని కోరుకుంటారు. ఎక్కువ కాలం వేచి చూడలేరు. ఓర్పు,సహనంతో వేచి చూస్తే విజయం ఎప్పటికైనా దక్కుతుంది.
Thursday Motivation: ఒక గ్రామంలో ఓ రైతు ఉండేవాడు. అతనికి తెలివితేటలతో పాటు సహనం, ఓర్పు కూడా ఎక్కువ. ఆ గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. పొలాలు బీడుగా మారిపోయాయి. తాగడానికి నీరు దొరకడమే కష్టంగా మారింది. రైతులు చాలా భయాందోళనకు గురయ్యారు. పొలాలను విడిచిపెట్టి పట్నాలకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు.
అందరూ ఎంతగా భయపడుతున్న ఈ రైతు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. నిరాశకు, నిస్పృహకు లోను కాలేదు. ఎండిపోయిన తన పొలం చుట్టే చిన్న చిన్న గోతులు తవ్వడం ప్రారంభించాడు. వర్షాలు కురుస్తాయన్న ఆశతో ఎదురు చూశాడు. వర్షాలు కురిస్తే ఆ గోతుల్లో నీరు నిండుతుంది. దీనివల్ల నీటికి ఎలాంటి లోటు రాదు. వర్షాలు పడతాయి అన్న ఆశ ఆయనలో ఉంది. పొలం చుట్టూ గోతులు తీయడంతో పాటు పొలంలో విత్తనాలను కూడా చల్లాడు. ఆ విత్తనాలకు కాస్త నీటిని కూడా పోశాడు.
ఎన్నో రోజులు గడిచిపోయాయ. ఈ రైతు తన ప్రయత్నాలను ఆపలేదు. రోజూ పొలానికి వెళ్లి, ఏదో ఒక పని చేసేవాడు. తన పొలం చుట్టూ పెద్ద చెరువునే తవ్వాడు. అతడిని చూసి అందరూ నవ్వుకునేవారు. ఒకరోజు ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. హఠాత్తుగా వర్షం కురిసింది. ఈ రైతు తవ్విన గోతులన్నీ నీటితో నిండిపోయాయి. ఆ చిన్న చెరువు కూడా నీటితో నిండిపోయింది. కొన్ని రోజులకు ఆ రైతు పొలం పచ్చదనంతో వికసించింది.
ఇక మిగతా రైతులు మాత్రం వర్షాలు పడవనే నిరాశతో తమ భూములు బీడుగానే వదిలేశారు. గోతులు తవ్వలేదు, చెరువులు పూడికలు తీయలేదు. దీంతో వారి పొలాలు ఎండిపోయే ఉన్నాయి. కానీ ఈ రైతు పొలం మాత్రం పచ్చగా వికసించింది. అతను గోతులు, చెరువులు తవ్వి నీటిని నిలబెట్టుకున్నాడు. గోతుల్లోని నీరు అతని పంటకు ప్రాణాధారంగా మారాయి. ఒక పంట తర్వాత రెండో పంట కూడా వేశాడు. మిగతా రైతులు అతడిని చూసి బుద్ధి తెచ్చుకున్నారు.
తాము కూడా వర్షాలు పడకపోయినా పొలం చుట్టూ గోతులు తవ్వడం, చెరువుల పూడికలు తీసుకోవడం వంటి పనులు చేశారు. చివరికి మరోసారి వర్షాలు పడ్డాయి. అప్పుడు అన్నీ చెరువులు నిండిపోయాయి. ఇతర రైతుల పొలాలు కూడా నీటితో నిండి పచ్చగా పండాయి.
విజయం పొందిన రైతు ఇతరులు ఎన్ని మాటలు అంటున్నా తన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. ఓర్పుగా, సహనంగా వర్షం కోసం ఎదురు చూశాడు. అలాగే తెలివిగా నీటిని నిల్వ చేసుకునే పద్ధతులను కనిపెట్టాడు. సమయాన్ని వృధా చేయకుండా వర్షాలు లేనప్పుడు చెరువులు తవ్వుకున్నాడు. ఓర్పుతో, సహనంతో వేచి ఉన్నాడు. వర్షాల కోసం ముందుగానే ప్రిపేర్ అయ్యాడు. అవే ఆయన విజయానికి కీలకమయ్యాయి. ఎవరికైనా ఇంతే... కాలం కలిసి రానప్పుడు ఓర్పుగా వెయిట్ చేయాలి. విజయం సాధించేందుకు ముందుగానే ప్రిపేర్ అన్నీ సిద్ధం చేసుకోవాలి.
టాపిక్