Thursday Motivation : వెళ్లాలనుకునేవారిని ఆపండి.. కానీ వారి కోసం దిగజారిపోకండి..-thursday motivation on never lose yourself while trying to hold on to someone who doesn t care about losing you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Thursday Motivation On Never Lose Yourself While Trying To Hold On To Someone Who Doesn't Care About Losing You

Thursday Motivation : వెళ్లాలనుకునేవారిని ఆపండి.. కానీ వారి కోసం దిగజారిపోకండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 26, 2023 04:00 AM IST

Thursday Motivation : మనం ప్రేమించిన వారు లేదా మనం ఇష్టపడిన వారు దూరమైపోతుంటే.. వారిని ఆపడానికి మనం ప్రయత్నిస్తాము. వారు తిరిగి మన దగ్గరకు రావాలని.. మనతో కలిసి ఉండాలని కోరుకుంటాము. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి.. మీ ఎఫర్ట్స్​ని, మీ ప్రేమని అర్థం చేసుకోనివారి కోసం.. మిమ్మల్ని మీరు కోల్పోకండి.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Thursday Motivation : ఓ వ్యక్తి మనకి దూరంగా ఉంటే మనకు తెలియకుండానే ఆందోళన కలుగుతుంది. వారి మీద ఉండే ప్రేమ, గౌరవం, ఇష్టం వల్ల మనకి ఈ ఫీల్ కలుగుతుంది. అదే వ్యక్తి కావాలనే మన దగ్గరనుంచి దూరంగా వెళ్లిపోతుంటే వారిని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తాము. మనకి ఇష్టం లేనివారు వెళ్లిపోతుంటే మనం ఎలాగో వారిని ఆపము. కానీ వాళ్లతో ఉంటే మన లైఫ్​ బాగుంటుందనుకునేవారు.. మనల్ని కాదని వెళ్లిపోతున్నప్పుడు కచ్చితంగా బాధగా ఉంటుంది. వారిని ఎలా అయినా ఆపాలని కచ్చితంగా ప్రయత్నిస్తాము. ఇది సహజంగా జరిగేదే.

మీ జీవితంలో ఎవరు ఉండాలి.. ఎవరు ఉండకూడదని నిర్ణయించుకునే అధికారం కచ్చితంగా మీకు మాత్రమే ఉంటుంది. అందుకే మీరు ఎంతగానో ఇష్టపడేవారు, ప్రేమించేవారు మీ జీవితంలో ఉండాలి అనుకుంటారు. దానివల్లనే వారు వెళ్లిపోతున్నా.. ఆపాలని.. పట్టుకోవాలని చూస్తారు. ఇది మీ ప్రేమనే కావొచ్చు. కానీ మీరు వారిని బతిమాలడం నుంచి.. మిమ్మల్ని మీరు కోల్పోయే స్థాయికి మాత్రం చేరుకోకండి. మనలోని ప్రేమ తెలియకుండానే ప్రేమించిన వ్యక్తి దగ్గర మన స్థాయిని దిగజార్చేస్తుంది. వారిని ఆపాలనే ప్రయత్నంలో మనల్ని మనం కోల్పోతాము. అలాంటి పరిస్థితి ఎదురైతే.. వారిని వదిలేయండి కానీ.. మిమ్మల్ని మీరు కోల్పోకండి.

వెళ్లిపోవాలనుకున్నవారిని ఆపితే.. వారు మన జీవితంలో ఉన్నా లోటుగానే ఉంటుంది.. అనే డైలాగ్​ని మనం అర్థం చేసుకోవాలే కానీ.. దానిలో జీవిత సత్యం ఉంది. నిజంగానే మన జీవితం నుంచి వెళ్లాలనుకునే వారిని ఆపినా.. వారి మనసులో నుంచి వెళ్లిపోవాలనే ఫీల్​ని మీరు తీసివేయలేరు. ఈరోజు కాకుంటే మరొక రోజు వారు కచ్చితంగా మీ నుంచి దూరంగా వెళ్లిపోతారు. లేదా వెళ్లిపోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఓ వ్యక్తిని ప్రేమతో అయినా.. బలంతో అయినా ఎన్ని రోజులు ఆపగలం. మన ఫీలింగ్స్​ని పట్టించుకోని వ్యక్తితో ఎన్నిరోజులు కలిసి ఉండగలం. ఏదొక రోజు కచ్చితంగా ఆ బంధానికి ఎండ్​ కార్డ్ పడిపోతుంది.

ఎంతకాదనుకున్నా.. అవతలి వ్యక్తి కన్నా.. మనకి మనం గొప్పనే. అటువైపు ఎంత గొప్పవారు ఉన్నా సరే.. మన సెల్ఫ్ రెస్పెక్ట్.. మన పర్సనాలిటీని వారికోసం ఎప్పుడూ కోల్పోకూడదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రేమించినవారు.. ఇలా ఎవరికోసం అయినా సరే తగ్గండి కానీ.. దిగజారిపోకండి. వెళ్లిపోవడం వారి ఛాయిస్ అయినప్పుడు మీరు ఆపిన ప్రయోజనం ఉండదు. ఈ రియాలిటీని మీరు ఎంత త్వరగా గుర్తిస్తే.. మీరు అంత త్వరగా ఈ ఎమోషన్​ నుంచి బయటపడతారు. వారు మీతో ఉండకూడదు అనుకుంటే వారిని మీరు పంపిచేయండి. వారి నిర్ణయాన్ని గౌరవించడం కూడా ప్రేమేనేమో ఆలోచించండి.

WhatsApp channel

సంబంధిత కథనం