Thursday Motivation: గాయాన్ని మరచిపోవచ్చు కానీ.. అది ఎందుకు తగిలిందో మరచిపోకూడదు
Thursday Motivation : మిమ్మల్ని బాధపెట్టే విషయాలను, వ్యక్తులను మీరు మరచిపోవచ్చు లేదా క్షమించవచ్చు. తప్పుకాదు. కానీ ఆ సమయంలో మీరు నేర్చుకున్న పాఠాలను మరచిపోకూడదు. ఎందుకంటే మీ జీవితంలో అవే చాలా విలువైనవి. అలాంటి వ్యక్తులు, పరిస్థితులు మళ్లీ రాకుండా జాగ్రత్త పడేందుకు.. మళ్లీ బాధపడకుండా ఉండేందుకు అవి మీకు చాలా ఉపయోగపడతాయి.
Thursday Motivation : జీవితం ఎప్పుడూ గులాబీల మంచం కాదు. ఎక్కడో చోట దానికి సంబంధించిన ముళ్లు ఉండే ఉంటుంది. ఆ ముళ్లు ఎప్పుడు.. ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేము. కాబట్టి గుడ్డిగా వెళ్లకుండా.. జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వెళ్లాలి. ఒకసారి చేసిన తప్పును మళ్లీ చేయకుండా ఉండడమే మంచిది. తెలిసో, తెలియకో మీరు పొరపాటు చేసి ఉంటారు. దాని వల్ల చాలా బాధపడుతూ ఉంటారు. పొరపాటును మీరు కొన్ని రోజులకు మరచిపోవచ్చు. కానీ అది నేర్పే పాఠాలను మాత్రం మరచిపోకూడదు. ఎందుకంటే మీరు మళ్లీ ఆ పొరపాటు చేయకుండా ఉండేలా అదే మిమ్మల్ని కాపాడుతుంది.
ట్రెండింగ్ వార్తలు
జీవితం కష్ట సుఖాలతో నిండి ఉంటుంది. వాస్తవానికి కష్టతరమైన సమయాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అవి జీవిత పాఠాలను నేర్పుతాయి. మన జీవితం ఎంత విలువైనదో తెలిసేలా చేస్తాయి. జీవితంలో కొన్నిసార్లు మనం కొంతమందిని కలుస్తాము. ఆ సమయంలో కొన్నిసార్లు మనం బాధపడి ఉండొచ్చు. బాధపెట్టి ఉండొచ్చు. అప్పుడు అనుకుంటాము అరె మనం వాళ్లని కలవకుండా ఉంటే అయిపోయేది ఇంత దూరం వచ్చేది కాదే అనిపిస్తుంది. కానీ అప్పుడు మీరు ఏమి చేయలేరు. జరిగిన దానిని మార్చలేరు కాబట్టి.. దానిగురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు. కానీ మరోసారి ఆ పొరపాటు చేయకుండా జాగ్రత్తపడాలి.
కొన్నిసార్లు మనం పరిస్థితులను ఎంత త్వరగా అంగీకరించడం ప్రారంభిస్తామో.. జీవితం పరమార్థం అంత త్వరగా అర్థమవుతుంది. మీరు వాటిని అంగీకరించకుండా ఉంటే.. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాలంతో ముందుకు వెళ్లలేరు. అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. జీవితంలో ఎవరూ ఉన్నా.. లేకున్నా అది ముందుకు సాగుతూనే ఉండాలి. ఎందుకంటే అది మీ జీవితం. కడదాక ఎవరూ మీకు తోడు ఉండరు అనే విషయం మీకు ఎంత త్వరగా అర్థమైతే.. అంత త్వరగా మీ జీవితంలో మీరు అడుగు ముందుకు వేయగలుగుతారు.
కొన్నిసార్లు మనం పరుగెత్తవలసి ఉంటుంది. కానీ పరుగెత్తలేకపోతే కనీసం నడవాలి. లేదంటే పాకాలి. ఏం జరిగినా జీవితం ముందుకు సాగిపోవాల్సిందే. మనం మట్టి ముద్దలం కాదు కదా.. ఎక్కడ వేస్తే అక్కడ ఉండిపోవడానికి. మనుషులం. బాధలున్నా.. సంతోషంగా ఉన్నా.. కష్టాలు ఉన్నా.. సుఖాలు ఉన్నా.. అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోవాల్సిందే. జీవితం అందించే పాఠాలను నేర్చుకోవాల్సిందే.
చేదు జ్ఞాపకాలను అంటిపెట్టుకుని ఉండటం మంచిది కాదు. కానీ అవి నేర్పే అనుభవాలను మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఆ జ్ఞాపకాలు గాయం లాంటివి. దానికి మందు వేసి మాన్పించవచ్చు. కానీ ఆ గుర్తు మీకు ఆ జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే ఉండాలి. అది మన జీవితంలో వార్నింగ్ బెల్ లాంటిది. దానిని చూసినప్పుడు, లేదా దాని గురించి ఆలోచించినప్పుడు మనం ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడతాం. మనం జీవితం నుంచి నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకూడదు. ఎందుకంటే జీవితం మనకు బోధించడం ఎప్పటికీ ఆపదు కాబట్టి.
సంబంధిత కథనం