Thursday Motivation: మనసు కోతిలాంటిది, దాన్ని అదుపులో ఉంచుకుంటేనే అనుకున్నది సాధించగలరు-thursday motivation mind is like a monkey if you keep it under control you can achieve what you want ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Thursday Motivation: Mind Is Like A Monkey, If You Keep It Under Control You Can Achieve What You Want

Thursday Motivation: మనసు కోతిలాంటిది, దాన్ని అదుపులో ఉంచుకుంటేనే అనుకున్నది సాధించగలరు

Haritha Chappa HT Telugu
Feb 29, 2024 05:00 AM IST

Thursday Motivation: మన మనసు కోతిలాంటిదే. దీనివల్లే విజయం దూరం అయిపోతుంది. అనుకున్నది సాధించలేక ఎంతోమంది ఓటమి అంచులకు చేరుకుంటారు.

మోటివేషన్ స్టోరీ
మోటివేషన్ స్టోరీ (pixabay)

Thursday Motivation: మన మనసే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. అలాంటి మనసు కోతిలాంటిదైతే ఆ వ్యక్తి జీవితం ఒడిదుడుకుల్లో సాగడం ఖాయం. కోతిలాంటి మనసు ఒక విషయంపై ఎక్కువసేపు దృష్టిని కేంద్రీకరించదు. ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకి గెంతుతూ పోతుంది. విశ్రాంతి తీసుకోనివ్వదు. నిద్రపోనివ్వదు. ఆలోచనలను చెల్లాచెదురు చేస్తుంది. ఆందోళనను పెంచుతుంది. పరధ్యానంగా ఉంచుతుంది. ఇలాంటి ప్రతికూల ప్రభావాలు ఎన్నో కోతి మనసు వల్ల జరుగుతాయి.

కోతి లాంటి మనసు మీకు కూడా ఉంటే మీరు ఎంతో మారాలి. అప్పుడే మీకు విజయం అందుతుంది. స్థిరమైన మానసిక ఆరోగ్యం, ఆలోచనలు చాలా అవసరం. రోజంతా మీ మనసు కోతిలా ఆలోచిస్తూ ఉంటే రాత్రికల్లా తీవ్రంగా అలసిపోతారు. చివరకు అసమర్ధుడిగా జీవించాల్సి వస్తుంది. కాబట్టి గందరగోళాన్ని సృష్టించే మనసును శాంత పరచడానికి మైండ్ ఫుల్ నెస్ సాధన చేయండి. నిశ్శబ్దంగా కూర్చుని మీ మనసును, ఆలోచనలను మీ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించండి. ఒకే విషయంపై ఎక్కువ సేపు దృష్టి ఉంచడానికి సాధన చేయండి.

మీ కష్టాల్లో, నష్టాల్లో మీకు తోడుగా ఉండేది నీ మనస్సే. అదే మీ శాశ్వతమైన స్నేహితుడు. అలాంటి మనసే కోతిలాంటిదైతే కష్టాలను అదే తెచ్చిపెడుతుంది. చిన్న చిన్న విషయాలకి మిమ్మల్ని ఆందోళనకు గురి చేసేలా చేస్తుంది. అందుకే ఆ మనసును మార్చడం కోసం శ్వాస వ్యాయామాలను సాధన చేయండి. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.

మనసును ఒకే విషయంపై ఏకాగ్రం చేయడం ద్వారా దాన్ని మీరు అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఇది చెప్పినంత సులువు కాదు, అలా అని అసాధ్యం కూడా కాదు. మనసు సహజంగానే చంచలంగా ఉంటుంది. కాబట్టి దాన్ని మీ దారిలోకి తెచ్చుకోవాలంటే సాధన, కృషి ఎంతో అవసరం.

మనసును అదుపులో పెట్టుకోలేకపోవడమే మనిషిలో ఉన్న పెద్ద బలహీనత. ఈ బలహీనతను అధిగమిస్తే ఎన్నో విజయాలు మీ ముందుకు వచ్చి స్వాగతం పలుకుతాయి.

మనసును అదుపులో పెట్టుకోవాలంటే మీరు ప్రశాంతంగా ఉండాలి. తగినంత నిద్రపోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పోషకాహారం తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు మనసును కంట్రోల్ చేసేందుకు సహకరిస్తాయి. అలాగే మీ కోసం మీరు కొంత నిశ్శబ్ద సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలో మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకోవాలి. మీ కోతి మనస్సును కట్టిపడేయాలి. మీరు ఏం చెబితే అదే వినేలా మీ మనసును మార్చుకోవాలి.

ప్రతిరోజూ ఉదయం ధ్యానం చేయడం ప్రారంభించండి. ఇది మనసును తేలిక పరుస్తుంది. మీ మనసుకు ఉన్న కోతి లక్షణాన్ని పోగొడుతుంది. ధ్యానం చేస్తున్నప్పుడు మీ శ్వాసపై పూర్తి దృష్టిని నిలపండి. ఇది మీకు మనసును కంట్రోల్ చేసేందుకు సహకరిస్తుంది.

WhatsApp channel