Thursday Motivation: మగవారు ఏడవడం తప్పేమీ కాదు, బాధ తీరాలంటే తనివితీరా ఏడ్చేయండి
Thursday Motivation: మగవారు ఏడవకూడదని ఎవరు చెప్పారు? బాధనిపిస్తే మనస్పూర్తిగా ఏడ్చేయండి, భారం దిగిపోతుంది.
Thursday Motivation: మగవారు ఏడవకూడదని ఎవరు చెప్పారు? ఏ దేశ రాజ్యాంగంలో ఈ విషయాన్ని రాశారు? రామాయణం, మహాభారతం, భగవద్గీతలో వీటి గురించి వివరించారా? బాధ వచ్చినప్పుడు ఏడవని ప్రాచీన పురుషుడు ఎవ్వరు? సీతా దేవి దూరమైనప్పడు శ్రీరాముడు కళ్లనీళ్లు పెట్టుకోలేదా? తన ప్రాణ స్నేహితుడు సుధాముడిని చూసి శ్రీ కృష్ణుడు కన్నీరు కార్చలేదా? అవతార పురుషులకే లేని మొహమాటం... కలికాలంలో పుట్టిన ఈ సాధారణ మగవారికి ఎందుకు? ఏడిస్తే మగతనం తగ్గిపోతుందని ఏ అధ్యయనాలు ఇంతవరకు తేల్చలేదు. పైగా ఏడుపుకు ఆడా, మగా అనే తేడా ఉందని సైన్సు చెప్పలేదు. బాధ వస్తే ఎవరికైనా కన్నీరు వస్తుంది. బాధకు కూడా స్త్రీ పురుషులు అనే తేడా లేదు. బాధ తగ్గాలంటే కన్నీరు బయటికి రావాలి. కాబట్టి గుండెలు బరువెక్కకుండా... ఆ బరువును కన్నీళ్ల రూపంలో బయటికి పంపేయండి.
మగపిల్లలు ఏడిస్తే చాలు ‘ఆడపిల్లలా ఏడుస్తున్నాడు’ అని కామెంట్ చేస్తారు. ఏడుపుకు ఆడవాళ్లే బ్రాండ్ అండాసిడర్లని ఎవరు ధ్రువీకరించారు? ఏడుపు జెండర్ డిఫరెన్స్ ఏమీ లేదు. ఇప్పటికే మగవారి ఏడుపుపై ఎన్నో అధ్యయనాలు జరిగాయి. బాధ కలిగినప్పుడు ఏడ్వకపోవడం వల్ల వారిలోని బాధ, ఒత్తిడి వారి గుండెపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నట్టు ఆ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా ఎమోషన్స్ ఆపుకున్న మగవారి కఠినాత్ములుగా మారే అవకాశం ఉంది. వారిలో కోపం, అసహనం వంటివి పెరిగిపోతాయి.
ఏడవడం వల్ల నాడీ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ వంటి హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి మానసికంగా, శారీరకంగా తేలికగా ఉన్న అనుభూతిని ఇస్తాయి. ఏడవకపోతే శరీరంలో ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ హార్మోను అధికంగా ఉత్పత్తి అవుతుంది. దాని వల్ల రక్తపోటు పెరగడం, గుండె సమస్యలు రావడం జరగవచ్చు. కాబట్టి మగవారికి బాధ అనిపించినప్పుడు మనస్పూర్తిగా ఏడ్చేయడమే మంచిది. అందరూ చూస్తే సిగ్గనిపిస్తే... మీరొక్కరే గదిలోకి వెళ్లి మనసుతీరా ఏడ్చేయండి. ఒత్తిడి ఉఫ్‌మని ఎగిరిపోతుంది. అలాగని రోజూ ఏడవమని మాత్రం చెప్పడం లేదు. రోజూ ఏడిస్తే బలహీనంగా మారిపోతారు. భరించలేని ఒత్తిడి, బాధ కలిగినప్పుడు మాత్రం గుండెల్లో బరువు దిగేలా ఏడ్చేయండి.