Thursday Motivation: మీ అతిపెద్ద శత్రువు మీ ఆత్మ న్యూనతే, ముందుగా దాన్ని ఓడించండి
Thursday Motivation: ఎవరో అవసరం లేదు... మీరే చాలు మిమ్మల్ని తక్కువ చేసుకోవడానికి. మీలో ఉన్న ఆత్మన్యూనతను వదిలిపెట్టకపోతే మిమ్మల్ని మీరే అగాధంలోకి స్వయంగా తోసుకుంటారు.
Thursday Motivation: మనిషిగా బతకాలంటే ధైర్యం ఉండాలి... లేకుంటే అథమంగా బతకాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆత్మన్యూనత ఉన్నవారు అధమంగానే బతుకాల్సిన పరిస్థితి. ఆత్మన్యూనత అనేది మనిషిని స్వయంగా నాశనం చేసే ఒక గుణం. పక్కవారో, ఎదుటివారో అవసరం లేదు. తనను తానే చులకనగా చూసుకుంటాడు. ఆ వ్యక్తి తాను ఎందుకు పనికిరానని అనుకుంటాడు, తనలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉండకూడదనుకుంటారు, ప్రతిసారీ బాధలు, భయాలనే గుర్తుపెట్టుకుంటాడు. ఇదే ఆత్మన్యూనత లక్షణాలు. ఇవన్నీ వదిలిపెడితేగాని మీరు సంపూర్ణమైన మనిషిలా బతకలేరు. బాధలు, భయాలు తలచుకోవడం... మీ ఆనందాన్ని పీల్చి పిప్పి చేసే విష కీటకాలతో సమానం. మీరు ఆనందంగా ఉండాలంటే మీలో ఉన్న ఆత్మన్యూనతను బయటకు తోసేయండి.

ఒక అధ్యయనం ప్రకారం ఆత్మ న్యూనత 20 ఏళ్ల నుండి 35 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వ్యక్తల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఆత్మన్యూనత అనేది ఒక మానసిక రోగం అనుకోవాలి. దీనికి ఔషధం ప్రత్యేకంగా దొరకదు. అది కూడా మీలోనే ఉంటుంది. నేను ఎవరికి తక్కువ కాదు, నేను కూడా ఏదైనా సాధించగలను, నాలో ఏం లోపం ఉంది? నేను అందరితోనూ సమానమే అని ఆ మనిషి తనను తాను నమ్ముకున్నప్పుడే ఆత్మన్యూనతకు చికిత్స చేసినట్టు. ఆత్మన్యూనతతో బాధపడే వ్యక్తులను భరించడం చాలా కష్టం. ఆత్మన్యూనతతో బాధపడేవారు ఒక పట్టాన ఏ విషయాన్ని ఒప్పుకోరు. అడుగు ముందుకు వేయరు. నిత్యం సమస్యలను, బాధలను తలుచుకుంటారు. ఇలాంటి వారు జీవితంలో ఏదీ సాధించలేరు. పరిస్థితులతో రాజీపడి బతికేస్తూ ఉంటారు. ఇలా ఉంటే మనిషి జన్మ ఎందుకు? మనిషి జన్మ ఎత్తాక... ఏదో ఒకటి సాధించి తీరాలి. మీరు ఏదైనా సాధించాలంటే మీలో ఉన్న మాయదారి రోగం ఆత్మ న్యూనతను బయటకు తోసేయాలి.
ఆత్మన్యూనత... అతిధి లాగా ఏదో ఒకసారి వచ్చి పోదు. నిత్యం మన లోపలికి వస్తూ పోతూనే ఉంటుంది. అది వచ్చిన ప్రతిసారి స్వాగతిస్తే... మీలోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. వెంటపడి తరిమితేనే మరొకసారి రావడానికి భయపడుతుంది. ఆత్మన్యూనత ఉన్నవారు విజయాలను, అధికారాలను సంపాదించలేరు.
ఆత్మన్యూనతను పోగొట్టుకోవాలంటే ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. మీ మీరు తీసుకున్న నిర్ణయాలకు మీరు విలువ ఇవ్వాలి. అప్పుడే మిమ్మల్ని ఎదుటి వారు ప్రేమించడం మొదలుపెడతారు. మీకు విలువ ఇవ్వడం ప్రారంభిస్తారు. మిమ్మల్ని మీరే నమ్మకపోతే ప్రపంచం ఎలా నమ్ముతుంది? మీరు ఎలాంటి బ్రతుకు కావాలనుకుంటున్నారో... అలాంటి జీవితం మీకు కావాలంటే ముందుగా ధైర్యాన్ని మీలో నింపుకోండి. ఆత్మవిశ్వాసాన్ని నింపుకోండి. నేను ఏదైనా చేయగలననే నమ్మకాన్ని నింపుకోండి. మీతో మీరు ఎక్కువ సమయం గడపండి. మీ మీద మీకున్న ప్రేమను వ్యక్తపరచుకోండి. మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి, నచ్చిన తిండిని తినండి, మీకోసం మీరు రోజుల్లో కొంత సమయాన్ని కేటాయించుకోండి. మీకు ఇష్టమైన పనులు మాత్రమే చేయండి. అప్పుడే మీరంటే మీకు ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ జీవితంలో ఏదైనా సాధించేలా చేస్తుంది.
మీకు ఇష్టమైన పని ఏదైనా కావచ్చు. వంట చేయడం, దైవ ప్రార్థన, తోటపని, టీవీ చూడడం, పుస్తకాలు చదవడం... ఏదైనా సరే మీకు నచ్చిన పనిని రోజులో కనీసం రెండు గంటలు చేసేందుకు ప్రయత్నించండి. మీ హృదయం విప్పారుతుంది. ఆ హృదయంలో సాధించాలన్న కోరిక పుడుతుంది. మీలోని శక్తి వెలికి వస్తుంది. అప్పుడే ఆత్మన్యూనత బయటికి పోతుంది.