Thursday Motivation: డబ్బు ఉందని విర్రవీగకండి, జీవితంలో ఒంటరిగా మిగిలిపోతారు
Thursday Motivation: కొందరు నడి మంత్రపుసిరి వల్ల కళ్ళు నెత్తికెక్కిపోతాయి. ఎదుటివారిని చులకనగా చూస్తారు. గర్వంతో మాట్లాడుతారు. అలాంటివారు తెలుసుకోవాల్సిన నీతి ఒకటి ఉంది.
Thursday Motivation: కొందరు ధనవంతులు తమ దగ్గర ఉన్న డబ్బును చూసి గర్వంగా ఫీల్ అవుతారు. ఇతరులను చూసి చులకనగా మాట్లాడతారు. చిన్న చిన్న విషయాలకి ఆవేశపడుతూ ఉంటారు. అలాంటివారు కుండను చూసి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక వ్యక్తి నిండు కుండ దగ్గరకు వెళ్లి అడిగాడట... ‘నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు. ఇది ఎలా సాధ్యం’ అని. అప్పుడు కుండ ‘నేను ఎప్పుడూ ఒకే విషయాన్ని గుర్తు పెట్టుకుంటాను. నేను వచ్చింది మట్టి నుంచే, మళ్లీ మట్టిలోనికే వెళ్తాను. మధ్యలో ఈ ఆవేశం, పొగరు, గర్వం లాంటివి అవసరమా’ అని నవ్విందట. ధనవంతులమని విర్రవీగుతున్నవారు ఈ కుండ చెప్పిన నీతిని అర్థం చేసుకోవాలి. ఎంత డబ్బు ఉన్నా వారు కలిసేది మట్టిలోనే.
గర్వంతో విర్రవీగే వ్యక్తి శత్రువులను పెంచుకుంటాడు, మిత్రులను దూరమయ్యేలా చేసుకుంటాడు. గర్వం తలకెక్కిన ప్రతి ఒక్కరూ ఓసారి స్మశానం వైపు చూడండి. మీలాంటి ఎంతోమంది గర్వంతో నిండిపోయిన గొప్పవాళ్ళు అక్కడే మట్టిలో కలిసిపోయారు. గర్వం ఒక్కటి చాలు సర్వం కోల్పోవడానికి. గర్వానికి వెనుకే వినాశనం కూడా నడుస్తూ వస్తుంది.
సహనం మంచి వారి దగ్గరే ఉంటుంది. గర్వం, అసూయ చెడ్డవారి దగ్గరే ఉంటాయి. మీరు ఎలాంటి వారో మీరే నిర్ణయించుకోండి. గర్వపడే మనిషికి ఓటమి కచ్చితంగా ఏదో ఒకరోజు ఎదురవుతుంది.
ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవించాలంటే మీకు ఉండాల్సింది డబ్బు కాదు, సంస్కారం. తాటిచెట్టు ఎంత పెరిగిన దాని కింద ఎవరూ నిలబడరు. అదే మర్రి చెట్టు కింద ఎంతోమంది సేద తీరుతారు. అలాగే గర్వితులు ఉన్న చోటకి ఎవరూ రారు, ఒంటరిగా బతకాల్సిందే.
ఒక మనిషికి సంపాదన పెరిగే కొద్దీ అహంకారం, గర్వం పెరుగుతుంది. విచక్షణా తగ్గిపోతుంది. అహంకారం పెరుగుతుంది. అంటే పతనం ప్రారంభమవుతుందని అర్థం చేసుకోవాలి. మీ అధికారాన్ని, హోదాన్ని చూసి వచ్చే గౌరవం శాశ్వతం కాదు, మీ మంచితనమే శాశ్వతం.
డబ్బులు ఉన్నాయి కదా అని ప్రతి ఒక్కరిని చులకనగా చూడడం మానేయండి. ఒక్కోసారి వ్యర్థంగా పడేసిన కాగితం కూడా ఏదోరోజు గాలిపటంలా మారి పైకి ఎగురుతుంది. అప్పుడు మీరే తలెత్తి చూడాల్సి వస్తుంది.
మీ అహంకారం గర్వం, కోపం ఇవన్నీ డబ్బు వల్ల వస్తే మిమ్మల్ని నడిరోడ్డుపై నిలబెట్టే పరిస్థితులు వస్తాయి. మనకి ఎప్పుడూ తోడుండేది మంచి మాత్రమే. మంచిగా ఉంటే ఇలాంటి సమస్యలు రావు... వచ్చినా కూడా ఆదుకునే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది.