Thursday Motivation: విజయం సాధించాలంటే కావాల్సినవి ఏమిటో థామస్ ఎడిసన్ వందేళ్ళ క్రితమే చెప్పారు, ఈ లక్షణాలు మీకున్నయా?
Thursday Motivation: విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు, కానీ ఆ ప్రయత్నాలు అనేక రకాలు ఉంటాయి. కొందరు కఠోరంగా ప్రయత్నిస్తే, మరికొందరు తేలికగా ప్రయత్నిస్తూ ఉంటారు. విజయం సాధించడానికి కావాల్సిన లక్షణాలు ఏమిటో థామస్ అల్వా ఎడిసన్ ఎప్పుడో చెప్పారు.
Thursday Motivation: జీవితంలో విజయం సాధించడం అనేది ఆ వ్యక్తికి పరిపూర్ణతను అందిస్తుంది. కానీ విజయం సాధించడం అంతా సులువైంది కాదు, థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పిన ప్రకారం విజయాన్ని పొందడానికి పదిశాతం ప్రేరణ ఉంటే, 90 శాతం కఠోరమైన శ్రమ ఉండాలి. నిజానికి ఇప్పుడు 90 శాతం కష్టపడుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. షార్ట్ కట్‌లో విజయాన్ని పొందేందుకే ఎక్కువమంది దారులు వెతుకుతున్నారు. అలా షార్ట్ కట్‌లో లభించిన విజయాలు దీర్ఘకాలంగా నిలబడడం కష్టం.
ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాడు. ఆయన మాటల్లోనే కనీసం 3000 సార్లు విఫలమయ్యానని చెప్పాడు. కానీ విఫలమైన ప్రతిసారీ ఒక అనుభవం వచ్చిందని, ఆ అనుభవం నుంచి కొత్త విషయాన్ని తెలుసుకున్నానని చెప్పారాయన. అలాగే ప్రతి వైఫల్యం అతనికి ఎంతో స్ఫూర్తిని, ప్రేరణను నింపిందనీ, విజయం సాధించాలన్న కసిని పెంచిందని 1890లో హార్పర్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎడిసన్ చెప్పారు.
థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పిన ప్రకారం ఆయనకు విజయం సాధించాలన్నా బలమైన కోరిక మాత్రమే కాదు, కష్టపడే తత్వం కూడా ఉంది. అందుకే ఆయన చివరకు విజయం సాధించి బల్బును కనిపెట్టాడు. మన ఇంటిలో ఇప్పుడు చీకట్లో వెలుగులు విరజిమ్ముతున్నాయంటే ఆయనే కారణం.
వైఫల్యాలే పాఠాలు
ఎడిసన్ చెప్పిన ప్రకారం తన ప్రయోగం విఫలమైన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునేవాడినని, కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం మొదలుపెట్టానని చెప్పారాయన. ఎడిసన్ తన విజయం గురించి కంటే వైఫల్యాల గురించే ఎక్కువ చెప్పేవారు. ఎందుకంటే వైఫల్యమే జీవితానికి కావలసిన పాఠాలను నేర్పిస్తుంది. గొప్ప విజయాలకు బాట వేసేది కూడా వైఫల్యాలే. విఫలం చెందిన వ్యక్తికే విజయం ఎంత గొప్పదో, దాన్ని సాధించడం ఎంత కష్టమో అర్థమవుతుంది.
మీలో విజయం సాధించాలన్న కసిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే ఉండండి. అలాగే విజయానికి కావాల్సిన కష్టాన్ని కూడా పడేందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడే మీ ప్రయాణం విజయానికి చేరువవుతుంది.
మైండ్ సెట్ ముఖ్యం
ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే అతని మైండ్ సెట్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉండాలి. మెదడులో కష్టపడడం, ప్రయత్నించడం... ఈ రెండే నిండిపోవాలి. విజయం సాధించడానికి కొన్నిసార్లు వ్యూహాత్మక ఆలోచన విధానాలు కూడా అవసరం పడతాయి. ఎప్పటికప్పుడు మీ పని ఎలా ఉందో, మీరు ఎలా పని చేస్తున్నారో విశ్లేషించుకుంటూ ఉండాలి. అలాగే ఎలా పని చేస్తే త్వరగా విజయాన్ని చేరుకుంటారో కూడా ఆలోచించాలి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే థామస్ ఆల్వా ఎడిసన్‌లా మీరు కూడా గొప్ప విజయాన్ని రుచి చూస్తారు.