రాత్రి నిద్ర పోవట్లేదా బాబూ.. క్యాన్సర్ ముప్పుందట జాగ్రత్త.. వైద్యుల హెచ్చరిక ఇదే-this one change in your night routine could dramatically lower your cancer risk ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రాత్రి నిద్ర పోవట్లేదా బాబూ.. క్యాన్సర్ ముప్పుందట జాగ్రత్త.. వైద్యుల హెచ్చరిక ఇదే

రాత్రి నిద్ర పోవట్లేదా బాబూ.. క్యాన్సర్ ముప్పుందట జాగ్రత్త.. వైద్యుల హెచ్చరిక ఇదే

HT Telugu Desk HT Telugu

జీవ గడియారంలో అంతరాయం అనేక క్యాన్సర్లకు దారి తీస్తుందని, నిద్ర నాణ్యత క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఆయుధమని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ విషయాలను మరింత లోతుగా ఇక్కడ తెలుసుకోండి.

జీవగడియారంలో అంతరాయం క్యాన్సర్‌కు దారితీస్తుంది (Image by Pexels)

ఆధునిక జీవనశైలి అలవాట్లు.. ముఖ్యంగా నిద్రను ప్రభావితం చేసేవి దీర్ఘకాలిక క్యాన్సర్ ప్రమాదాన్ని ప్రభావితం చేయగలవని క్యాన్సర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ కాంతి, ముఖ్యంగా డిజిటల్ స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతి కారణంగా మన శరీర అంతర్గత గడియారం (బయోలాజికల్ క్లాక్)కు అంతరాయం కలగడం అనేది అత్యంత నిర్లక్ష్యం చేస్తున్న ముప్పులలో ఒకటి అని చెబుతున్నారు. నిద్ర ఇప్పుడు ఐచ్ఛికం కాదు అది మీ శరీరం యొక్క ఉత్తమ క్యాన్సర్ వ్యతిరేక ఆయుధమని వైద్య నిపుణులు అంటున్నారు.

గువాహటిలోని అపోలో క్యాన్సర్ సెంటర్‌లో సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ కిరణ్ కమలాసనన్ హిందుస్తాన్ టైమ్స్ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి వివరించారు.

“రాత్రి పొద్దుపోయే వరకూ నీలి కాంతికి గురికావడం వల్ల ఈ సమయం ఇంకా పగలే కావొచ్చనే భ్రమలో మెదడు ఉంటుంది. ఇది మెలటోనిన్ విడుదలను ఆలస్యం చేస్తుంది. ఇది నిద్ర నాణ్యతకు మాత్రమే కాకుండా కణజాల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని నియంత్రించడానికి కూడా కీలకమైన హార్మోన్” అని వివరించారు.

రాత్రంతా స్క్రీన్ చూస్తున్నారా? క్యాన్సర్ ముప్పు బాగా ఉంటుందట
రాత్రంతా స్క్రీన్ చూస్తున్నారా? క్యాన్సర్ ముప్పు బాగా ఉంటుందట (Shutterstock)

మెలటోనిన్ కణితి పెరుగుదలను అణచివేయడానికి సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దాని స్థాయిలు నిలకడగా తగ్గినప్పుడు, అది క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉన్న జీవసంబంధ వాతావరణాన్ని సృష్టించవచ్చు.

నైట్ షిఫ్ట్ ఉద్యోగులలో దీర్ఘకాలిక సర్కాడియన్ అంతరాయం అధికస్థాయిలో రొమ్ము, ప్రోస్టేట్, కొలొరెక్టల్ క్యాన్సర్‌లతో సంబంధం కలిగి ఉందని ఎపిడెమియోలాజికల్ ఆధారాలు చూపిస్తున్నాయి. వాస్తవానికి, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) సర్కాడియన్ రిథమ్ అంతరాయం కలిగించే నైట్ షిఫ్ట్ పనిని మానవులకు క్యాన్సర్ కారకంగా గుర్తించింది.

డాక్టర్ కమలాసనన్ మాట్లాడుతూ "మన సర్కాడియన్ రిథమ్ ఒక ముఖ్య నియంత్రణ వ్యవస్థ. డిఎన్‌ఎ రిపేర్, హార్మోన్ విడుదల, కణ విభజనను సమన్వయం చేయడం వంటి పనులను నిర్వర్తిస్తుంది. ఈ రిథమ్‌కు భంగం కలిగించడం వల్ల వాపు, మంటను ప్రేరేపించవచ్చు. సెల్యులార్ రిపేర్ మెకానిజమ్‌ల ప్రభావాన్ని తగ్గించవచ్చు. అసాధారణ కణాలను గుర్తించి తొలగించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చు.." అని వివరించారు.

డాక్టర్ రీతికా ఏమన్నారంటే

ముంబైలోని మాహిమ్‌లోని పిడి హిందూజా హాస్పిటల్, మెడికల్ రీసెర్చ్ సెంటర్‌లో రేడియేషన్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ రీతికా హిందూజా జీవ గడియారం గురించి మరింత వివరించారు.

"నిద్ర నాణ్యత తగ్గడం ఒక ఆందోళనకరమైన ప్రజారోగ్య సమస్య. సర్కాడియన్ రిథమ్ లేదా జీవ గడియారం అనేది మన పరిసరాలలో కాంతి మార్పులకు ప్రతిస్పందించడం ద్వారా అప్రమత్తత, నిద్ర చక్రాలను నియంత్రించే మన మెదడులోని 24 గంటల అంతర్గత గడియారం. ఇది మెదడులోని పీనియల్ గ్రంధిచే ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ హార్మోన్ ద్వారా నియంత్రణలో ఉంటుంది" అని చెప్పారు.

ఆ అలవాట్ల నుండి విముక్తి పొందండి

"శరీరంలోని జీవ గడియారంలో అంతరాయాలు నిద్ర, వేలకొలది ఇతర పనులకు భంగం కలిగిస్తాయి. రొమ్ము, పెద్దప్రేగు, అండాశయాలు, ప్రోస్టేట్ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయి. అనేక సంవత్సరాలు రాత్రి షిఫ్టులలో పనిచేసేటప్పుడు కాంతికి గురికావడం వల్ల మెలటోనిన్ స్థాయిలు తగ్గుతాయి. క్యాన్సర్ పెరగడాన్ని ప్రోత్సహిస్తాయి" అని డాక్టర్ రీతికా హిందూజా నొక్కిచెప్పారు. నిద్ర లేమి మన రోగనిరోధక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుందని తెలిపారు.

రాత్రి వేళ కృత్రిమ కాంతి థైరాయిడ్‌ను కూడా ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రి వేళ కృత్రిమ కాంతి థైరాయిడ్‌ను కూడా ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. (Photo by Francesco Casalino on Unsplash)

వృద్ధాప్యానికి సంబంధించిన ఇంగ్లీష్ లాంగిట్యుడినల్ అధ్యయనం నిద్ర నాణ్యత, క్యాన్సర్ ప్రమాదం మధ్య సంబంధాన్ని అంచనా వేసింది. 10,000 మందికి పైగా వ్యక్తులను అధ్యయనం చేసిన తర్వాత.. నిద్ర నాణ్యత లోపం వృద్ధులలో క్యాన్సర్ అభివృద్ధి చెందే దీర్ఘకాలిక ప్రమాదంతో సంబంధం కలిగి ఉందని తేచ్చింది.

"నిద్ర నాణ్యత మెరుగుపరచడంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. క్యాన్సర్, నిద్ర ఒకటి కంటే ఎక్కువ విధాలుగా కలిసిపోయాయి. అవి కోడి ముందా? గుడ్డు ముందా? అనే దృగ్విషయాన్ని అనుకరించాయి. క్యాన్సర్ నుండి బయటపడినవారు మానసిక ఒత్తిడి వల్ల కలిగే నిద్ర సమస్యలతో బాధపడతారు. క్యాన్సర్, దాని చికిత్స కూడా దీనికి కారణం" అని డాక్టర్ డాక్టర్ హిందూజా ముగించారు.

చిన్నచిన్న మార్పులతో రాత్రి త్వరగా నిద్ర పట్టేలా చేసుకోవచ్చు
చిన్నచిన్న మార్పులతో రాత్రి త్వరగా నిద్ర పట్టేలా చేసుకోవచ్చు (Shutterstock)

"ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను ప్రోత్సహించడం, రాత్రిపూట స్క్రీన్ ప్రభావానికి గురికావడాన్ని తగ్గించడం, సూర్యాస్తమయం తర్వాత లైట్లను తగ్గించడం, క్రమం తప్పకుండా నిద్ర షెడ్యూల్‌ను పాటించడం మానసిక స్పష్టత లేదా శక్తికి మాత్రమే కాదు.. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఒక కీలకమైన భాగం అవుతుంది. మంచి నిద్ర ఐచ్ఛికం కాదు. ఇది శరీరం బలమైన, అత్యంత సహజమైన రక్షణ మార్గాలలో ఒకటి" అని డాక్టర్ కమలాసనన్ సూచించారు.

(పాఠకులకు గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా వైద్య పరిస్థితి గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.