New Year 2025: మీ పిల్లలంటే మీకు ప్రాణమా..? అయితే న్యూ ఇయర్ సందర్భంగా వారి కోసం ఈ ఐదు ప్రమాణాలు చేయండి-this new year every parent should make these resolutions to themselves for their children ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Year 2025: మీ పిల్లలంటే మీకు ప్రాణమా..? అయితే న్యూ ఇయర్ సందర్భంగా వారి కోసం ఈ ఐదు ప్రమాణాలు చేయండి

New Year 2025: మీ పిల్లలంటే మీకు ప్రాణమా..? అయితే న్యూ ఇయర్ సందర్భంగా వారి కోసం ఈ ఐదు ప్రమాణాలు చేయండి

Ramya Sri Marka HT Telugu
Dec 31, 2024 05:02 PM IST

New Year 2025: మీ పిల్లలంటే మీకు ప్రాణమా..? వారి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారా..? అయితే నూతన సంవత్సరం సందర్భంగా బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా ఈ ఐదు ప్రమాణాలు చేయండి. మీకు మీరు చేసుకునే ఈ తీర్మానాలు మీ పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా మారుస్తాయి.

మీ పిల్లలంటే మీకు ప్రాణమా..? అయితే న్యూ ఇయర్ సందర్భంగా వారి కోసం  ఈ ఐదు ప్రమాణాలు చేయండి
మీ పిల్లలంటే మీకు ప్రాణమా..? అయితే న్యూ ఇయర్ సందర్భంగా వారి కోసం ఈ ఐదు ప్రమాణాలు చేయండి (Shutterstock)

కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు ముందుగా అందరూ ఆలోచించేది జీవితంలో ఏదో మార్పు రాబోతుంది, కొత్తగా ఏదో మంచి జరగనుంది అని. గత సంవత్సరంలోని పరిస్థితుల్లో హెచ్చు తగ్గులను బేరీజు వేసుకుని, తప్పుఒప్పులను గుర్తుచేసుకుని, మెరుగైన అవకాశాలపై ఆశలతో, కొత్త ఉత్సాహంతో ప్రయాణం మొదలు పెడుతుంటారు. మీరు అలాంటి వారే అయితే.. ముఖ్యంగా మీరు తల్లిదండ్రులు అయితే కొన్ని విషయాలను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కొన్ని ప్రమాణాలు చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం రండి..

yearly horoscope entry point

మీ పిల్లల భవిష్యత్తును విజయంతో, ఉత్సాహంతో రూపొందించడంలో మీ పెంపకం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తల్లిదండ్రులందరూ తెలుసుకోవాలి. పిల్లలను మంచి మనుషులుగా తీర్చిదిద్దడానికి వారిలో విలువలను పెంపొందిచడానికి బాధ్యతాయుతమైన తల్లిదండ్రుల పాత్రను పోషించాల్సి ఉంటుంది. ఇందుకోసం కొత్త ఏడాది రోజున మీకు మీరే కొన్ని ప్రమాణాలు ఎందుకు చేయకూడదు.

1. పిల్లల ఫీలింగ్స్ పట్టించుకుంటామని..

తల్లిదండ్రులు పిల్లల మనోభావాలను అర్థం చేసుకోవడంలో విఫలం కాకూడదు. చాలా మంది పిల్లల వయస్సు, అనుభవాన్నే పరిగణలోకి తీసుకుంటారు కానీ కావడం వారి ఫీలింగ్స్ గురించి ఆలోచించరు. వారు చెబుతున్న పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు తమ మనసుకు సంబంధించిన విషయాలను మీతో పంచుకోవడానికి ఇష్టపడరు. బయట వారికి చెప్పుకుంటారు. చాలాసార్లు బయటి వ్యక్తులు కూడా దీనిని సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి ఈ సంవత్సరం, పిల్లల భావాలను అర్థం చేసుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేస్తానని మీరే వాగ్దానం చేసుకోండి. స్నేహితుడిలా జడ్జ్ చేయకుండా వారికి దగ్గరై సరైన దారి చూపించే ప్రయత్నం చేస్తానని తీర్మానం చేసుకోండి.

2. నాణ్యమైన సమయం గడపుతామని..

నేటి బిజీ లైఫ్ స్టైల్‌లో కుటుంబ సభ్యులతో రెండు క్షణాలు హాయిగా కూర్చునే తీరిక చాలా మందికి ఉండటం లేదు. అన్నింటినీ పక్కక్కు పెట్టేసి కెరీర్ కోసం పరుగెత్తే వారు ఎందరో. ఇదేం చెడ్డ విషయం కాదు, కానీ తల్లిదండ్రులుగా మీ పిల్లల పట్ల మీకు కొంత కర్తవ్యం కూడా ఉంది. వారితో మీరు సమయం గడపాల్సిన బాధ్యత, అవసరం రెండూ ఉన్నాయి. ఇది మీకు వారికీ మర్చిపోలేని అనుభవాలను మిగుల్చుతుంది. కనుక ఈ సంవత్సరం మీరు మీ పిల్లలతో మరింత నాణ్యమైన సమయాన్ని గడుపుతారని మీకు మీరు వాగ్దానం చేసుకోండి. ఇది మీ పిల్లలతో మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే వారు భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంతో, మానసికంగా బలమైన వ్యక్తిగా మారతాడు.

3. ఆరోగ్యంలో శ్రద్ధ తీసుకుంటామని..

ఈ రోజుల్లో పిల్లల జీవన శైలి చాలా దుర్భరంగా మారుతోంది. ఆహారం నుండి రోజువారీ కార్యకలాపాల వరకు, మానసిక, శారీరక ఆరోగ్యానికి హాని చేసే చాలా విషయాలు ఉన్నాయి. బిజీ లైఫ్ స్టైల్ కారణంగా తల్లిదండ్రులు తరచూ ఈ విషయాలను విస్మరిస్తారు. అటువంటి పరిస్థితిలో మీ పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక నూతన సంవత్సరంలో వారి ఆరోగ్యం మెరుగుపరిచే దిశగా మీరు చర్యలు తీసుకుంటారని ఈ తీర్మానం చేసుకొండి. ధ్యానం, వ్యాయామాలు, అవుట్డోర్ గేమ్స్ వంటి వాటిని వారి దినచర్యలో చేర్చుకునేలా ప్లాన్ చేయండి. ఇది మంచి వ్యక్తిగా, ఆరోగ్యకరమైన వ్యక్తిగా మారడానికి వారికి సహాయపడుతుంది.

4. ఆదర్శంగా ఉంటామని

పిల్లలు పచ్చి మట్టి లాంటివారు అని పెద్దలు అంటుంటారు. అంటే మీరు వారిని ఏ ఆకారంలోకి తీర్చిదిద్దితే వారు ఆ రూపంలోకి మారతారని అర్థం. మరో ముఖ్య విషయం ఏంటంటే వారు ఏం చూస్తే అదే నేర్చుకుంటారు. ప్రతీదీ చెప్పాల్సిన అవసరం లేకుండా మిమ్మల్ని చూసే చాలా విషయాలను నేర్చుకుంటారు. మంచైనా, చెడైనా. కనుక మీరు పిల్లలకు ఆదర్శంగా ఉంటారని మీరే వాగ్దానం చేసుకోండి. మీ బిడ్డలో మీరు చూడాలనుకునే మంచి అలవాట్లను ముందుగా మీ స్వంత జీవితంలో అమలు చేయండి. ఇలా చేయడం వల్ల పిల్లలపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది.

5. ఆటలు నేర్పిస్తామని..

పిల్లలు విజయం సాధించాలనుకుంటే, వారి టైమ్ టేబుల్‌ను సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా పిల్లలతో కాసేపు కూర్చోండి, వారి సలహా తీసుకోండి, వారి దినచర్యను వారి మాటల్లోనే వినండి. వివరణాత్మక టైమ్ టేబుల్ తయారు చేయండి. అలా అని ఆ టైమ్ టేబుల్ లో కేవలం చదువు కోసం మాత్రమే ప్లాన్ చేయకండి. చదువుతో పాటు ఆడటానికి తగినంత సమయం కేటాయించండి. వారికి ఇష్టమైన పాటలు, పెయింటింగ్ వంటి వాటి గురించి ప్లాన్ చేయండి. ఇది పిల్లల సంపూర్ణ ఎదుగుదలకు దారితీస్తుంది. అదే సమయంలో వారు బాల్యం నుండి వ్యవస్థీకృత పద్ధతిలో జీవించే అలవాటును కలిగిస్తుంది.

Whats_app_banner