ఉదయం నిద్ర లేవగానే తాజాగా, ఆనందంగా అనిపించాలి. ఉదయానే చిరాకుగా నిద్రలేస్తే ఆ రోజంతా కూడా విసుగ్గానే అనిపిస్తుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆఫీసుకు, స్కూళ్లకు బయలుదేరేందుకు రెడీ అవుతూ ఉంటారు. ఉదయం అంతా చాలా హడావుడిగా ఉంటుంది.
మీరు రోజును ప్రారంభించేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నిద్రలేచిన తర్వాత ఒక అరగంట పాటు మీకే సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ అరగంటలో మీరు చేసే పనులు ఆ రోజంతా సానుకూలంగా, శక్తివంతంగా ప్రొడక్టివిటీ ఉండేలా మారుస్తుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎలాంటి అలవాట్లు పాటించాలో తెలుసుకోండి.
మంచి రోజు కోసం మీ రోజును సానుకూల ఆలోచనలతో ప్రారంభించండి. మీరు ఉదయం నిద్ర లేచినప్పుడు మీకు నచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. ఆరోజు మంచి రోజు అవ్వాలని కోరుకోండి. అలాగే అన్ని పనులు పూర్తి చేసుకోవాలని నిర్ణయించుకోండి. ఆ రోజు ఏ పనిని వాయిదా వేయకూడదని అనుకోండి. ముందు రోజు కంటే ఆ రోజు మెరుగ్గా ఉండాలని దేవుడిని ప్రార్థించండి.
ఉదయం నిద్ర లేచిన తర్వాత మంచం మీదే కూర్చొని లోతైన శ్వాస వ్యాయామాలు చేయడానికి కొన్ని నిమిషాలు కేటాయించండి. శ్వాస వ్యాయామాలు అంటే ధ్యానం చేయడమే. నీ మనసు ప్రశాంతంగా ఉండేలా ఈ వ్యాయామాలు చేస్తాయి. ఒత్తిడి బారిన పడకుండా కాపాడుతాయి. ఇది ఆరోజు ఎదురయ్యే సవాళ్లు, గొడవల నుంచి మిమ్మల్ని బయటపడేసే ఎలా ఉంటాయి. కాబట్టి కనీసం పది నిమిషాలు పాటు శ్వాస వ్యాయామాలు చేస్తూ ధ్యానంలో ఉండేందుకు ప్రయత్నించండి.
రాత్రి నిద్ర పోయే ముందు నీళ్లు తాగి ఉంటారు. ఉదయం మీరు లేచే వరకు శరీరం నీటి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శరీరం హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి ఉదయం లేవగానే ముందుగా మీరు ఒక గ్లాసు నీరు తాగండి. ఇది మీ శరీరానికి శక్తిని ఇస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరం నుంచి విషాలను బయటికి పంపించడంలో సహాయపడుతుంది. గ్లాసు నీరు తాగితే మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావు. విరేచనం సాఫీగా సాగుతుంది. దీనివల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
ఉదయం నిద్ర లేచిన తర్వాత శరీరం బలహీనంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. కాబట్టి కాసేపు స్ట్రెచింగ్, వ్యాయామాలు చేయడం మంచిది. అంటే కాళ్లు, చేతులు సాగదీసే వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో అలసట తొలగిపోతుంది. కండరాలకు విశ్రాంతిగా అనిపిస్తుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. యోగా, వ్యాయామం వంటివి ఉదయాన్నే 10 నిమిషాలు చేయడం వల్ల మీకు ఎంతో చురుగ్గా అనిపిస్తుంది. ఆ రోజంతా కూడా మీరు ఉత్సాహంగా పనులు చేసుకోగలుగుతారు.
సంబంధిత కథనం